ఒంటిమిట్ట రామాలయంలో వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల‌ పూజలు

వైయ‌స్ఆర్‌ జిల్లా: ప్రసిద్ధి గాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయం లో కడప ఎంపీ వైయ‌స్ అవినాష్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే దాసరి సుధా, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాష, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మాజీ మేయర్ సురేష్ బాబు కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ వేద పండితులు ఆలయ మర్యాదలతో వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం అంతరాలయంలో సీతారామ లక్ష్మణులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం రంగమండపంలో టీటీడీ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఈ సందర్భంగా ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ, ఒంటిమిట్ట రామాలయంలో పూజలు చేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. శ్రీరాముని జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. రాబోయే ఒకటవ తేదీన జరిగే కళ్యాణ మహోత్సవానికి వేలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలాగే, ఒంటిమిట్ట రైల్వే స్టేషన్‌లో ప్రతి రైలు ఆగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర రైల్వే శాఖ మంత్రిని పలుమార్లు కలిసి వినతిపత్రాలు అందజేసినట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల సమయంలో మాత్రమే కాకుండా అన్ని రోజుల్లోనూ ఒంటిమిట్ట రైల్వే స్టేషన్‌లో సరైన సిబ్బంది ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 
ఇక నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో ఒంటిమిట్టను కేంద్రంగా చేసుకుని కొత్త నియోజకవర్గం ఏర్పాటు చేయాలని సూచించారు. ఒంటిమిట్టకు ఉన్న చారిత్రక ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై ఆలోచించాలన్నారు.
 

Back to Top