అమరావతి పేరుతో మరోసారి నాటకం

భూములు కోల్పోయిన రైతులకే న్యాయం చేయని చంద్రబాబు

డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

స్పష్టం చేసిన వైయస్సార్సీపీ నేతలు

సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు అమలు చేయలేకే ఈ డ్రామాలు

టెండర్ల పేరుతో వేల కోట్ల అవినీతి.. బినామీలకు మేలు చేయడమే లక్ష్యం

మండిపడ్డ వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాధ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా

వైయ‌స్ఆర్ జిల్లా :  అమరావతి శాశ్వత రాజధాని తీర్మానం కోసం ఏర్పాటు చేసిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. చంద్రబాబు ప్రజల దృష్టిని మళ్లించడానికి ఆడుతున్న డ్రామా అని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు పి.రవీంద్రనాధ్ రెడ్డి, అంజాద్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్సార్ కడప జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, భూములిచ్చిన రైతులకే నేటికీ న్యాయం చేయని చంద్రబాబు, మరో 50 వేల ఎకరాల రెండో విడత ల్యాండ్ పూలింగ్ కోసం సిద్ధమవుతున్నారని ఆరోపించారు. వైయ‌స్ఆర్‌సీపీ అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదని, రాజధాని పేరుతో జరుగుతున్న వేల కోట్ల అవినీతికి మాత్రమే వ్యతిరేకమని తేల్చి చెప్పారు. టెండర్లు పిలిచి బినామీ కాంట్రాక్టర్లకు మేలు చేయడమే చంద్రబాబు లక్ష్యమని  స్పష్టం చేశారు. 
అమరావతి శాశ్వత రాజధాని తీర్మానం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని వారు తప్పుపట్టారు.

● డైవర్షన్ పాలిటిక్స్, వేల కోట్ల అవినీతి - పి. రవీంద్రనాధ్ రెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు.
 
రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడానికి చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ ను ఎంచుకున్నారు. 
అమరావతిని అడ్డుకున్నది ఎవరో చంద్రబాబు సమాధానం చెప్పాలి. రూ.52 వేల కోట్ల టెండర్లు పిలిచి, రూ.47 వేల కోట్ల అప్పులు చేసి, బినామీ కాంట్రాక్టర్లకు మొబలైజేషన్ అడ్వాన్సుల పేరుతో రూ.5 వేల కోట్లు దోచిపెట్టారు.చట్టబద్ధత కోసం కేవలం అసెంబ్లీలో తీర్మానం చేస్తే సరిపోదు, మండలిలో కూడా తీర్మానం చేయాలన్న కనీస అవగాహన కూడా లేకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ఐదు గంటల చర్చలో ప్రజలకు ఉపయోగపడే అంశమే లేదని, కేవలం తండ్రీ కొడుకుల డబ్బా కొట్టుకోవడం తప్ప మరొకటి లేదని అన్నారు.

- రెండో విడత ల్యాండ్ పూలింగ్ కు వ్యతిరేకత:

రెండో విడత ల్యాండ్ పూలింగ్ పేరుతో మరో 50వేల ఎకరాల భూమిని తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతుండగా, రైతులంతా వ్యతిరేకిస్తున్నారని రవీంద్రనాధ్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే తీసుకున్న భూముల్లో ఒక్క శాశ్వత నిర్మాణం కూడా చేపట్టలేదని, రైతులకు కేటాయించిన ప్లాట్లు చెరువుల్లో, కాలువల్లో ఇచ్చి రైతులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- అవినీతికే వ్యతిరేకం:

అమరావతి రాజధానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని, ఆ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అవినీతికి మాత్రమే తాము వ్యతిరేకమని రవీంద్రనాధ్ రెడ్డి స్పష్టం చేశారు. ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం, రైతులకు మద్ధతు ధరలు ఇవ్వడంలో విఫలమైన చంద్రబాబు, కేవలం అమరావతి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. లక్షలాది కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

● అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం -  అంజాద్ బాషా

మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతులు, ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతోందని విమర్శించారు.
రైతులకు ఎరువులు దొరకడం లేదు, పంటలకు గిట్టుబాటు ధర లేదు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు అమలు కావడం లేదు. ఐదు గంటల అసెంబ్లీ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు వైయస్.జగన్ ని తిడుతుంటే చంద్రబాబు శునకానందం పొందుతున్నారు. 

- అమరావతి అంటే తాత్కాలిక రాజధాని?:

2014-19 వరకు అన్ని తాత్కాలిక నిర్మాణాలే చేపట్టారని, అంటే అమరావతి తాత్కాలిక రాజధానా అన్నది చంద్రబాబు సమాధానం చెప్పాలి. ఇప్పుడు అధికారంలోకి వచ్చి రెండేళ్ల కావస్తున్నా ఒక్క శాశ్వత నిర్మాణం కూడా చేపట్టలేదు. 

- అడ్డగోలుగా నిర్మాణ వ్యయం:

మహానగరాల్లో చదరపు అడుగు రూ.5-6 వేలకే అందుబాటులో ఉంటే, అమరావతిలో మాత్రం రూ.12వేల పైగా చదరపు అడుగుకు ఖర్చుపెడుతున్నారు. వేల కోట్ల టెండర్లను కమిషన్ల కోసమే పిలుస్తున్నారు, మొబలైజేషన్ అడ్వాన్సుల పేరుతో కాంట్రాక్టర్లకు ఇచ్చి, తిరిగి వారి ద్వారా మంత్రి లోకేష్ కి చేరుతున్న పరిస్థితి ఉంది. వందలాది కోట్ల రూపాయలు కంపచెట్లు కొట్టడానికి, నీళ్లు తోడడానికే వినియోగించారు. 

- రైతులకు న్యాయం చేయాలి:

భూములిచ్చిన రైతులకు నేటికీ న్యాయం చేయలేదని, ముందు వాళ్లకు ప్లాట్లు కేటాయించాలని, సకాలంలో కౌలు చెల్లించాలి. తన అనుయాయులకు మేలు చేయడానికే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు, రాజధాని నిర్మాణం మీద చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు. పనులు చేపట్టకుండా నాన్చుతూ, 2029లో కూడా ఇదే అజెండాతో ప్రజల ముందుకు రావడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారన్న అంజాద్ బాషా... ప్రజలు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ గమనిస్తున్నారని స్పష్టం చేశారు.

Back to Top