రాజధాని తీర్మానం కొత్త డ్రామా.. 

కూటమి ప్రభుత్వంపై చిర్ల జగ్గిరెడ్డి ఫైర్ 

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: రాజధాని అంశంపై కూటమి ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టారు వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి. రావులపాలెంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాజధాని తీర్మానం చేసిన తీరు పిల్లలు పుట్టిన తర్వాత మళ్లీ పెళ్లి చూపులు ఏర్పాటు చేసినట్టుగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాజధాని పేరుతో పెద్ద ఎత్తున స్కామ్‌కు పాల్పడుతోందని ఆరోపించారు. పాత రైతులకు న్యాయం చేయకుండా కొత్త రైతులను కూడా మోసం చేసే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. 2014–2019 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతిని రాజధానిగా ఎందుకు బలంగా అమలు చేయలేదో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి పేరు వినిపించినా కూటమి నేతలకు భయం పట్టుకుంటోందని విమర్శించారు. వైయ‌స్ జగన్‌ను విమర్శించడమే లక్ష్యంగా కూట‌మి ప్ర‌భుత్వ‌ పాలన సాగుతోందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

 కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావుపై కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. “బండారు టాక్స్” పేరుతో నియోజకవర్గాన్ని అవినీతిమయం చేస్తున్నారని, బెల్ట్ షాపులు, లిక్కర్, ఇసుక మాఫియా వంటి అక్రమ కార్యకలాపాలు పెరిగిపోయాయని అన్నారు. బెల్ట్ షాపులు పెట్టేవారి పై కఠిన చర్యలు తీసుకుంటానని చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు ఆ మాట ఎప్పుడు నిలబెట్టుకుంటారో చెప్పాలని ప్రశ్నించారు. ఈ సమావేశంలో పలువురు ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to Top