పోటెత్తిన మూలపేట పోర్టు ఉద్యమం.. 

వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో `మ‌న మూల‌పేట‌కు పోదాం` కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం

వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణుల‌ను అడ్డుకునేందుకు భారీగా పోలీసుల మోహ‌రింపు  

శ్రీకాకుళం: రాష్ట్రంలో వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న మూలపేట పోర్టు ప‌నుల‌ను కూట‌మి ప్ర‌భుత్వం అడ్డుకోవ‌డంతో వైయ‌స్ఆర్‌సీపీ ఉద్య‌మ‌బాట ప‌ట్టింది. ఈ మేర‌కు సోమ‌వారం వైయ‌స్ఆర్‌సీపీ అధినేత శ్రీ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు చేపట్టిన ‘మన మూలపేటకు పోదాం’ కార్యక్రమానికి ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌లు, వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు క‌దం తొక్కి పోర్టు వ‌ద్ద‌కు త‌ర‌లివ‌చ్చారు. ప్రభుత్వ ఆంక్షలు, పోలీసుల అడ్డంకులు ఉన్నప్పటికీ పార్టీ శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చి తమ నిరసనను తెలియజేశాయి.

శ్రీ‌కాకుళం జిల్లా అభివృద్ధికి వైయ‌స్ జ‌గ‌న్ శ్రీ‌కారం
2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిపై దృష్టి సారించి, సంతబొమ్మాళి మండలం మూలపేట తీరంలో సుమారు రూ.4,361.91 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2023 ఏప్రిల్ 19న శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్ట్‌లో మూలపేట, విష్ణుచక్రం గ్రామాలకు చెందిన 596 కుటుంబాలకు పునరావాసం కోసం రూ.149 కోట్లు ఖర్చు చేశారు. టెక్కలి జాతీయ రహదారి నుంచి పోర్టు వరకు రోడ్డు కోసం 327.75 ఎకరాలు, రైల్వే మార్గం కోసం 100.71 ఎకరాలు సేకరించారు.

వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలోనే 70 శాతం ప‌నులు పూర్తి
వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం హయాంలోనే పోర్టు పనుల్లో సుమారు 70 శాతం పూర్తి అయ్యాయి. అయితే తరువాత వచ్చిన కూట‌మి ప్రభుత్వంలో మిగిలిన పనులు నిలిచిపోయాయి. క్రెడిట్ కోసం టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు మళ్లీ భూములు అవసరమంటూ అధికారుల ప్రకటనలతో రైతుల్లో ఆందోళన నెలకొంది. కూట‌మి తీరును నిర‌సిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ మ‌న మూల‌పేట‌కు పోదాం కార్య‌క్ర‌మానికి పిలుపునిచ్చింది.  

భారీ పోలీస్ బందోబస్తు.. అడ్డంకులు 
‘మన మూలపేటకు పోదాం’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు నౌపాడ జంక్షన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ముల్లకంచెలతో కేట్లు ఏర్పాటు చేసి, మూలపేటకు వచ్చే ప్రధాన రహదారులను బ్లాక్ చేశారు. పోర్టు రోడ్డును టిప్పర్లతో మూసివేసి నాయకులు, కార్యకర్తలు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అరెస్టులకు సిద్ధమయ్యారు. అయినప్పటికీ వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు వెనుకడుగు వేయకుండా పెద్దఎత్తున తరలివచ్చాయి. 
ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పలువురు నాయకులు పాల్గొన్నారు.  వైయ‌స్ఆర్‌సీపీ శ్రీ‌కాకుళం జిల్లా అధ్య‌క్షుడు ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, వైయ‌స్ఆర్‌సీపీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్ బూడి ముత్యాల నాయుడు, మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి, మాజీ మంత్రి సీదిరి  అప్పలరాజు, ఎమ్మెల్సీలు కుంభ రవిబాబు, వ‌రుదు క‌ళ్యాణి, పేరాడ తిలక్, కేకే రాజు తదితరులు హాజరయ్యారు.

 పోర్టు క‌ల‌ను వైయ‌స్ జ‌గ‌న్ నిజం చేశారు: ధర్మాన కృష్ణదాస్  
దశాబ్దాలుగా ఉన్న మూలపేట పోర్టు కలను వైయ‌స్ జగన్ నిజం చేశారు. భావనపాడు పోర్టు పేరుతో టీడీపీ ప్రజలను మోసం చేసింది. ఉత్తరాంధ్ర ప్రజలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూసారు. ఈ పోర్టుతో చదువుకున్న యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మూలపేట పోర్టుతో పాటు భోగాపురం ఎయిర్‌పోర్ట్, ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ వంటి ప్రాజెక్టులు ప్రాంత అభివృద్ధికి దోహదం చేస్తాయి.

ఉత్తరాంధ్ర అభివృద్ధిలో వైయ‌స్ జగన్ పెద్దన్న పాత్ర: పాముల పుష్పశ్రీవాణి 
మూలపేట పోర్టు దశాబ్దాల కల, ఆ కలను వైయ‌స్ జగన్ నెరవేర్చారు. తమ ప్రభుత్వం హయాంలో 70 శాతం పనులు పూర్తి చేశాం, ఇప్పుడు 30 శాతం పనులు కూడా పూర్తిచేయలేని ప్రభుత్వం అధికారంలో ఉంది. వైయ‌స్ జగన్‌కు మంచి పేరు వస్తుందనే భయంతో పనులు నిలిపివేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో వైయ‌స్ జగన్ పెద్దన్న పాత్ర పోషించారు.

 క్రెడిట్ చోరీలో చంద్ర‌బాబు స్థాయి పెరిగింది: కురసాల కన్నబాబు 
క్రెడిట్ చోరీలో చంద్రబాబు స్థాయి పెరిగింది. ఇప్పుడే కాదు ఎప్పుడూ ఇతరుల పనులను తన పేరుతో చెప్పుకోవడమే ఆయన రాజకీయం. ఒక పోర్టు కూడా నిర్మించని చంద్రబాబు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏం చేశారో స‌మాధానం చెప్పాలి. వైయ‌స్ జగన్‌కు పేరు రాకూడదనే ఉద్దేశంతో పనులు నిలిపివేశారు.

మూల‌పేట‌ పోర్టు ఘనత జగన్నదే: ఎమ్మెల్సీ వరుదు కల్యాణి 

మూలపేట పోర్టు వైయ‌స్ జగన్ సంకల్పంతో ప్రారంభమైంది. తమ హయాంలో 70 శాతం పనులు పూర్తిచేశాం, మిగిలిన పనులు పూర్తి చేయకుండా క్రెడిట్ తీసుకునే ప్రయత్నం జరుగుతోంది. వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందడం కొందరికి ఇష్టం లేదు. ఎన్ని అడ్డంకులు వచ్చినా పోర్టు ఘనత జగన్నదే. ఉత్తరాంధ్రలో వలసలను అరికట్టాలని వైయ‌స్ జగన్ సంకల్పించారు. ఈ ప్రాంతానికి ఆయన ఊపిరి పోశారు. ఉత్తరాంధ్ర ఉద్యమాల గడ్డ , మూలపేట పోర్టు కోసం పోరాటం కొనసాగిస్తాం. అమరావతిపై చూపిన శ్రద్ధను ఉత్తరాంధ్రపై ఎందుకు చూపడం లేదు.

Back to Top