విశాఖ: వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై ఓ చిన్నపాప ఆప్యాయత చూపిస్తే.. అది కూడా ఐటీడీపీ వాళ్లు ఓర్వలేక ట్రోల్ చేస్తున్నారని వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మండిపడ్డారు. మహిళలు, చిన్నారులను ట్రోల్ చేస్తే వారిని కఠినంగా శిక్షిస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బీరాలు పలికారు. మరి ఇప్పుడు చిన్నపాపను ట్రోల్ చేస్తున్న వారిపై ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. వైయస్ జగన్ ను కలిసిన విద్యార్థినిపై ఐటీడీపీ నేతలు సైకోల్లా వ్యవహరించడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు గురువారం వరుదు కళ్యాణి మీడియాతో మాట్లాడారు. కళ్యాణి ఏమన్నారంటే.. దేవిక అనే విద్యార్థిని మానసికంగా వేధిస్తున్నారు. అమ్మఒడి రాలేదు అన్నందుకు విద్యార్థినిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతోందంటూ పోస్టులు పెడుతున్నారు. చిన్న పిల్లలపై అసభ్యకరమైన పోస్టులు పెడితే తోలు తీస్తామన్న చంద్రబాబు పవన్ మాటలు ఏమయ్యాయి.. దేవికపై తప్పుడు ప్రచారం చేసిన ఐటీడీపీ నేతలపై కేసు నమోదు చేయాలి. గతంలో జగనన్న వలన తనకు ఇల్లు వచ్చిందన్న గీతాంజలి అనే మహిళను సోషల్ మీడియాలో వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారు.