వీజీఎఫ్‌ సర్దుబాటు చేస్తేనే పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌

రాజ్య‌స‌భ‌లో ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌శ్న‌కు కేంద్ర‌మంత్రి జ‌వాబు

న్యూఢిల్లీ : వయబులిటీ గ్యాప్‌ ఫండింగ్‌ (వీజీఎఫ్‌) సర్దుబాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముందుకు వస్తేనే కాకినాడలో పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ నిర్మాణం సాధ్యమవుతుందని పెట్రోలియ శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి స్పష్టం చేశారు. రాజ్యసభలో సోమవారం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర‌మంత్రి జవాబిచ్చారు. కాకినాడలో 32 వేల 901 కోట్ల రూపాయల వ్యయంతో పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ ఏర్పాటు కోసం 2017 జనవరి 27న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గెయిల్‌, హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌తో ఎంవోయూ కుదుర్చుకున్నట్లు చెప్పారు. తదనంతరం ప్రాజెక్ట్‌ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరిగింది. ఈ ప్రాజెక్ట్‌ కార్యరూపం దాల్చాలంటే వయబులిటీ గ్యాప్‌ ఫండింగ్‌ను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే భరించాలని ఆయిల్‌ కంపెనీలు స్పష్టం చేశాయి. అనంతరం వీజీఎఫ్‌ను సమకూర్చవలసిందిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. పెట్రోకెమికల్‌ ప్రాజెక్ట్‌ ఏర్పాటుకు భారీ మూలధన వ్యయం, పెట్టుబడుల అవసరం ఉంటుంది. ఈ ప్రాజెక్ట్‌ కార్యరూపం దాలిస్తే ప్రత్యక్షంగాను, పరోక్షంగాను అది ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. పారిశ్రామీకరణతోపాటు రాష్ట్రానికి పన్నుల రూపంలో రాబడి పెరగడమే కాకుండా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. అందువలన రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వమే దీనిపై తగిన నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని కేంద్ర‌మంత్రి తన జవాబులో స్పష్టం చేశారు.

ఖరగపూర్-విజయవాడ మధ్య డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌
ఖరగపూర్‌, విజయవాడ (1,115 కి.మీ), విజయవాడ-నాగపూర్ (975కి.మీ)ల మధ్య డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌ నిర్మాణం కోసం రైల్వే శాఖ డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నట్లు గనుల శాఖ మంత్రి ప్రల్హాద్‌ జోషి వెల్లడించారు. రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర‌మంత్రి జవాబిస్తూ నేషనల్‌ మినరల్‌ పాలసీ కింద డెడికేటెడ్‌ మినరల్‌ కారిడార్లు కల్పించాలని నిర్ణయించినట్లు చెప్పారు. మైనింగ్‌ చేసే ప్రాంతాల నుంచి ఖనిజాలను ఇతర ప్రాంతాలకు తరలించడానికి ఈ కారిడార్లు ఉపయుక్తంగా ఉంటాయని అన్నారు. మినరల్‌ కారిడార్లకు అనుబంధంగా ఖనిజ రవాణా కోసం స్థానికంగా సమగ్రమైన రీతిలో నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్లు అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా భారీ సరకులతో పొడవాటి ట్రైన్ల ద్వారా రవాణా చేసేలా రూపుదిద్దుకుంటాయని మంత్రి చెప్పారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top