ఏపీలో 15 వేల హెక్టార్లలో జీడి మామిడి సాగు

రాజ్యసభలో వైయ‌స్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్ర‌మంత్రి జవాబు

న్యూఢిల్లీ: జీడి పొట్టు ఆయిల్ ఉత్పత్తి, ఎగుమతులు పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హార్టికల్చర్ (ఉద్యానవన పంటల సమగ్ర అభివృద్ధి మిషన్), రాష్ట్రీయ క్రిషి వికాస్ యోజన పథకం కింద ఆంధ్రప్రదేశ్ లో 2005-06 నుంచి 2021-22 వరకు 15006 హెక్టార్లలో జీడిమామిడి సాగును అభివృద్ధి చేసిందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ థోమర్ వెల్లడించారు. రాజ్యసభలో శుక్రవారం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర‌మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో 12 ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా జీడి పొట్టు ఆయిల్ ఉత్పత్తి జరుగుతోందని అన్నారు. జీడిపిక్కల సాగు విస్తరించడం ద్వారా మాత్రమే జీడి పొట్టు ఆయిల్ ఉత్పత్తి వృద్ధి చెందుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 2016-17లో 111.4 మెట్రిక్ టన్నులు, 2017-18లో 116.9 మెట్రిక్ టన్నులు, 2018-19లో 109.9 మెట్రిక్ టన్నులు, 2019-20లో 115.4 మెట్రిక్ టన్నులు, 2020-21లో 121.2 మెట్రిక్ టన్నులు, 2021-22 లో 127.2 మెట్రిక్ టన్నులు జీడి పిక్కలు ఉత్పత్తి చేసినట్లు తెలిపారు.

2022-23లో భారతదేశం నుంచి వివిధ దేశాలకు 4,944 మెట్రిక్ టన్నులు జీడి పొట్టు ఆయిల్ ఎగుమతి చేసి తద్వారా 32.50 కోట్ల విదేశీ మారకద్రవ్యం ఆర్జించినట్లు కేంద్ర‌మంత్రి వెల్లడించారు. జీడి పొట్టు నుంచి ఉత్పత్తి చేసే ఆయిల్ కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిమాండ్ 2020 నుంచి మరింత పెరిగిందని, వివిధ పరిశ్రమల్లో దీనిని ఫర్నేస్ ఆయిల్‌గా వినియోగిస్తున్నారని తెలిపారు. గడిచిన 5 ఏళ్లలో భారత్ నుంచి వివిధ దేశాలకు 26,909 మెట్రిక్ టన్నులు జీడి పొట్టు ఆయిల్ ఎగుమతి చేసినట్లు తెలిపారు. జీడి పొట్టు ఆయిల్ ఉత్పత్తిని విస్తరించడం ద్వారా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని కేంద్ర‌మంత్రి పేర్కొన్నారు.

తాజా వీడియోలు

Back to Top