న్యూఢిల్లీ : రాష్ట్రాలు కోరితేనే కొత్త జవహర్ నవోదయ విద్యాలయాల (జేఎన్వీ) స్థాపన జరుగుతుందని కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి శ్రీమతి అన్నపూర్ణ దేవి తెలిపారు. రాజ్యసభలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి జవాబిస్తూ.. కొత్త నవోదయ విద్యాలయాల ఏర్పాటును కోరే రాష్ట్రాలు శాశ్వత భవన నిర్మాణాలకు తగిన భూమిని ఉచితంగా సమకూర్చాలి. శాశ్వత భవనాల నిర్మాణం జరిగే వరకు విద్యాలయం నిర్వహణకు అవసరమైన తాత్కాలిక భవనాలను రాష్ట్ర ప్రభుత్వమే అద్దె లేకుండా ఉచితంగా సమకూర్చాలన్నారు. అయితే కొత్త జవహర్ నవోదయ విద్యాలయాల మంజూరు, ప్రారంభం అనేది సంబంధింత ప్రాధికార సంస్థ అనుమతి, అందుకు తగిన నిధుల అందుబాటు ప్రాతిపదికపై మాత్రమే జరుగుతాయని మంత్రి చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2014 మే 31 నాటికి జేఎన్వీ పథకానికి సమ్మతి తెలిపిన అన్ని జిల్లాలు జవహర్ నవోదయ విద్యాలయం పరిధిలోకి వచ్చాయని మంత్రి వెల్లడించారు. 2018కు ముందుగా మంజూరైన 21 విద్యాలయాలు 2020 నాటికి ప్రారంభం అయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలు జవహర్ నవోదయ విద్యాలయం పథకం పరిధిలో ఉన్నాయి. అదనంగా ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్న ప్రకాశం జిల్లాలో ఒకటి, ఎస్టీ జనాభా అధికంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో ఒకటి చొప్పున స్థాపించినట్లు కేంద్రమంత్రి చెప్పారు. గ్రామీణ రోడ్ల నిర్వహణ రాష్ట్రాల బాధ్యతే.. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన కింద గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే రోడ్ల నిర్వహణ బాధ్యత ఆయా రాష్ట్రాల బాధ్యతేనని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ చెప్పారు. ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. ఈ పథకం కింద నిర్మించే గ్రామీణ రోడ్ల నిర్వహణకు అవసరమైన నిధులను గ్రాంట్ల రూపంలో ఆయా రాష్ట్రాలకు అందించవలసిందిగా 15వ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు. గ్రామీణ మంత్రిత్వ శాఖ రూపొందించిన మార్గదర్శకాలను అనుసరించి ఈ పథకం కింద రోడ్ల నిర్మాణం జరుగుతుంది. రోడ్ల నిర్వహణలో ఏకరూపత తీసుకువచ్చేందుకు తమ మంత్రిత్వ శాఖ కింద పని చేసే జాతీయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఎన్‌ఆర్‌ఐడీఏ) సాంకేతిక నైపుణ్యంతో రూపొందించిన విధివిధానాలను రూపొందించినట్లు మంత్రి చెప్పారు. దేశ వ్యాప్తంగా ప్రతి రాష్ట్రం రోడ్ల నిర్వహణలో ఈ విధివిధానాలకు అనుగుణంగా నిర్వహణ విధానాలను తయారు చేసుకోవలసి ఉంటుందని కేంద్రమంత్రి చెప్పారు.