నాడు తండ్రి వైయ‌స్ఆర్‌, నేడు తనయుడు వైయ‌స్ జగన్... 

ఒకే చోట తుంగభద్రమ్మకు పూజలు!

 2008, డిసెంబర్ 11న సంకల్ భాగ్ ఘాట్ కు వైయ‌స్

నేడు అదే ఘాట్ లో పుష్కరాలకు రానున్న వైయ‌స్ జగన్

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

క‌ర్నూలు:  అది 2008 సంవత్సరం, డిసెంబర్ 11. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న మ‌హానేత‌ డాక్టర్ వైయ‌స్ రాజశేఖరరెడ్డి, తుంగభద్ర పుష్కరాల సందర్భంగా కర్నూలు నగరంలోని సంకల్ భాగ్ ఘాట్ కు వచ్చారు. నదీమతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి, హారతి ఇచ్చారు. పుష్కరాలు డిసెంబర్ 10న ప్రారంభం కాగా, 11న సీఎం హోదాలో ఆయన పర్యటించారు. ఆపై పుష్కరకాలం తరువాత మరోసారి తుంగభద్రమ్మకు మరోసారి పండగొచ్చింది.

నాడు తండ్రి పూజలు నిర్వహించిన సంకల్ భాగ్ ఘాట్ లోనే నేడు తనయుడు, ప్రస్తుత సీఎం వైయ‌స్ జగన్ పుష్కరాలను ప్రారంభించనున్నారు. ఈ మధ్యాహ్నం కర్నూలు చేరుకునే వైయ‌స్ జగన్, 1.10 గంటలకు పుష్కరాలను అధికారికంగా ప్రారంభిస్తారు. సీఎం వైయ‌స్ జగన్ పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

 
నేటి నుంచి తుంగభద్ర పుష్కరాలు 
 కర్నూలు : పవిత్రమైన తుంగభద్ర పుష్కరాలు నేడు (శుక్రవారం) ఘనంగా ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 1.21 గంటలకు పుష్కరుడు నదిలో ప్రవేశిస్తాడని, అప్పటి నుంచి పుణ్యఘడియలు ప్రారంభమవుతాయని పండితులు తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలులోని సంకల్‌భాగ్‌ ఘాట్‌లో ప్రత్యేక పూజలతో పుష్కరాలను ప్రారంభించనున్నారు. కోవిడ్‌ నేపథ్యంలో ప్రతికూల పరిస్థితులు నెలకొని ఉన్నా, భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ఆర్భాటాలు లేకుండా సంప్రదాయరీతిలో, శాస్త్రోక్తంగా నిర్వహించి పుష్కరాలను విజయవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 12 ఏళ్లకోసారి వచ్చే పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక జాగ్రత్తలతో అన్ని ఏర్పాట్లు చేసింది. ఐదు వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. ఘాట్ల వద్ద ప్రత్యేకంగా గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. 

కర్నూలు జిల్లాలో 23 ఘాట్లు..
తుంగభద్ర నది ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు జిల్లాలో మాత్రమే ప్రవహిస్తుంది. కర్ణాటకలో ప్రవహించిన అనంతరం మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలం మేళిగనూరు(నదిచాగి) వద్ద ఆంధ్రలో ప్రవేశిస్తుంది. 156 కిలోమీటర్ల మేర మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు, నందికొట్కూరు నియోజకవర్గాలలో ప్రవహించాక కొత్తపల్లి మండలం సంగమేశ్వరం వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. నది పరివాహక ప్రాంతంలో 23 పుష్కర ఘాట్లను ప్రభుత్వం నిర్మించింది. ఘాట్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పించింది.

ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పుష్కరాలకు అనుమతి ఇచ్చింది. కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పుష్కరఘాట్ల వరకూ 43 బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఘాట్ల వద్ద తాత్కాలిక బస్‌షెల్టర్‌లను ఏర్పాటు చేశారు. తుంగభద్ర నదిలో ప్రస్తుతం 5 వేల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. పుష్కరాల సమయంలో నీటి సమస్య లేకుండా చూసేందుకు అదనంగా రోజుకు 3 వేల క్యూసెక్కుల చొప్పున తుంగభద్ర డ్యాం నుంచి నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంది. 

స్నానాలకు అనుమతి లేదు..
కోవిడ్‌ ప్రభావం తీవ్రంగా ఉండటం, రెండో దశ మొదలవ్వడం, నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. భక్తులు నదిలో పుష్కరస్నానాలు ఆచరించేందుకు అనుమతి నిరాకరించింది. అయితే పిండప్రదానాలకు అవకాశం కల్పించింది. ఈ–టికెట్‌ ద్వారా స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారికి అనుమతి ఇచ్చింది. ఈ–టికెట్‌ వెబ్‌సైట్‌ (https://tungabhadrapushkaralu 2020.ap.gov.in)ను మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుమ్మనూరు జయరాం, జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్, ఎమ్మెల్యేలు గురువారం కర్నూలు జిల్లా కలెక్టరేట్‌లో ప్రారంభించారు.

వెబ్‌సైట్‌ ద్వారా భక్తులు తమకు నచ్చిన పుష్కర ఘాట్‌లలో స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు. సంప్రదాయ పూజలకు, పిండప్రదానాలకు 23 ఘాట్లలో 350 మంది పురోహితులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక్కో పురోహితుడు రోజుకు 16 స్లాట్ల చొప్పున (ఒక్కో స్లాట్‌లో ఇద్దరు) పూజలు చేస్తారు. ఈ టికెట్‌ బుక్‌ చేసుకోకుండా నేరుగా వస్తే పిండప్రదానాలకు అనుమతి ఉండదు. కృష్ణా, గోదావరి పుష్కరాల్లో నిర్వహించినట్లుగా ఇప్పుడు కూడా పుష్కరాలు జరిగే 12 రోజుల పాటు అన్ని ఘాట్లలో గంగాహారతి ఇవ్వనున్నారు. కాగా, సీఎం పర్యటన సందర్భంగా సంకల్‌భాగ్‌ వీఐపీ పుష్కర ఘాట్‌లో ఏర్పాట్లను మంత్రులు బుగ్గన, జయరాం, ఎమ్మెల్యేలు హఫీజ్‌ఖాన్, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, సుధాకర్, తొగురు ఆర్థర్‌ పరిశీలించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top