శ్రీ‌వారి మెట్టు మార్గం పునఃప్రారంభం

శాస్త్రోక్తంగా పూజ‌లు నిర్వ‌హించి ప్రారంభించిన టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి

రూ.3.60 కోట్ల‌తో మ‌ర‌మ్మ‌తు ప‌నులు పూర్తి చేసి భ‌క్తుల‌కు అనుమ‌తి

తిరుమ‌ల‌: శ్రీ‌వారి మెట్టు న‌డ‌క మార్గాన్ని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి శాస్త్రోక్తంగా పూజ‌లు నిర్వ‌హించి పునఃప్రారంభించారు. మెట్టు మార్గంలో భ‌క్తుల‌ను తిరుమలకు అనుమ‌తించారు.    అనంత‌రం టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. గ‌తేడాది నవంబ‌రు 18, 19వ తేదీల్లో కురిసిన భారీ వ‌ర్షాల‌కు శ్రీ‌వారి మెట్టు మార్గంలో పెద్ద బండ‌రాళ్లు ప‌డి రోడ్డు, మెట్లు, ఫుట్‌పాత్‌లు, మ‌రుగుదొడ్లు దెబ్బ‌తిన్నాయ‌న్నారు. శ్రీ‌వారి మెట్టు మార్గం మ‌ర‌మ్మ‌తుల‌కు రూ.3.60 కోట్లు వెచ్చించామ‌ని చెప్పారు.  కేవ‌లం నాలుగు నెల‌ల వ్య‌వ‌ధిలో ఇంజినీరింగ్ అధికారులు యుద్ధ ప్రాతిపాదిక‌న శ్రీ‌వారి మెట్టు మార్గంలో మ‌ర‌మ్మ‌తులు పూర్తిచేశార‌ని వివ‌రించారు. ఈ మేర‌కు ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది, కాంట్రాక్ట‌ర్ల‌ను చైర్మ‌న్ అభినందించారు. శ్రీ‌వారి మెట్టు మార్గం గుండా ప్ర‌తి రోజు ఆరు వేల మంది, ప్ర‌త్యేక ప‌ర్వ‌దినాల్లో 15 వేల మంది భ‌క్తులు తిరుమ‌ల‌కు చేరుకుంటార‌న్నారు. శ్రీ‌వారి మెట్టు మార్గంలోనే సాక్షాత్తు శ్రీ‌నివాసుడు తిరుమ‌ల‌కు చేరుకున్న‌ట్లు, శ్రీ కృష్ణ‌దేవ‌రాయులు శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న‌ట్లు శాస‌నాల ద్వారా తెలుస్తోంద‌ని వివ‌రించారు.

Back to Top