తిరుమలకు మోనో రైలు..!

టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

 తిరుపతి: తిరుమలకు లైట్‌ మెట్రో, మోనో రైలు ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. దీనిపై హైదరాబాద్‌ మెట్రో ఎండీతో చర్చించి, నివేదిక అడిగామని చెప్పారు. భక్తులకు సౌకర్యంగా ఉండేలా చూడాలని మెట్రో ఎండీని కోరామన్నారు. నివేదిక వచ్చిన తర్వాత ఆగమ పండితులతో చర్చిస్తామని చెప్పారు. ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ఏడుకొండల్లో టన్నెల్‌ తవ్వకుండా ఉన్న మార్గాల్లోనే మోనో రైలు నిర్మాణానికి పరిశీలించమని కోరినట్లు చెప్పారు. భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు యత్నిస్తున్నామని పేర్కొన్నారు. రోప్‌వేలు, కేబుల్‌ కార్లు లాంటివి వద్దని చెప్పామన్నారు. తిరుమల పర్యావరణ పరిరక్షణకు మోనో రైలు ప్రతిపాదన ఉపయోగపడుతుందన్నారు. ఆస్ట్రియాలో ఎత్తైన కొండపై మోనో రైలు వెళుతోందని.. దాన్ని మోడల్‌గా తీసుకుని తిరుమలకు రైలు ఏర్పాటును పరిశీలిస్తున్నామని ఆయన వెల్లడించారు. 

వారిపై క్రిమినల్‌ కేసులు పెడతాం...
ట్విట్టర్‌లో టీటీడీపై దుష్ప్రచారాన్ని వైవీ సుబ్బారెడ్డి ఖండించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ పేరుతో నకిలీ ఖాతా సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ట్విట్టర్‌ ఖాతా అజిత్‌ దోవల్‌ది కాదని పేర్కొన్నారు. అది ఫేక్‌ అని తమ పరిశీలనలో తేలిందన్నారు. టీటీడీకి చెందిన రూ.2,300 కోట్లను ప్రభుత్వ ఖజానాకు బదిలీ చేస్తున్నామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై క్రిమినల్‌ కేసులు పెడతామని.. త్వరలోనే సైబర్‌ క్రైం విభాగం ఏర్పాటు చేయనున్నట్లు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

Back to Top