రేపు ఒంగోలు పర్యటనకు సీఎం వైయ‌స్‌ జగన్‌

 ఒంగోలు: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఈనెల 22వ తేదీ శుక్రవారం ఒంగోలులో ప‌ర్య‌టించ‌నున్నారు.  వైయ‌స్ఆర్‌  సున్నా వడ్డీ మూడో విడత ప్రారంభ కార్యక్రమాన్ని ఒంగోలు నుంచి చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న ఈ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ పర్యటన వివరాలను తాడేపల్లి ముఖ్యమంత్రి కార్యాలయం ఖరారు చేసింది.

ముఖ్యమంత్రి అదనపు పీఎస్‌ కే.నాగేశ్వరరెడ్డి విడుదల చేసిన వివరాల ప్రకారం ఈ నెల 22వ తేదీ ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలో ముఖ్యమంత్రి నివాసం నుంచి రోడ్డు మార్గంలో తాడేపల్లిలోని హెలిప్యాడ్‌ వద్దకు వెళతారు. హెలిప్యాడ్‌ నుంచి 9.40 గంటలకు హెలిక్యాప్టర్‌లో ఒంగోలుకు బయలుదేరుతారు. ఉదయం 10.10 గంటలకు ఒంగోలు నగరంలోని రైల్వే స్టేషన్‌ సమీపంలో ఉన్న ఏబీఎం గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు హెలిక్యాప్టర్‌ చేరుకుంటుంది. 10.25 గంటల వరకు ఏబీఎం గ్రౌండ్‌లోనే స్థానిక నాయకులతో, అధికారులతో పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేశారు. 10.40కి ఏబీఎం నుంచి రోడ్డు మార్గం ద్వారా రంగారాయుడు చెరువు వద్ద ఉన్న పీవీఆర్‌ మున్సిపల్‌ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వద్దకు చేరుకుంటారు.

 
పది నిమిషాల పాటు ప్రాంగణంలోని డ్వాక్రా గ్రూపు సభ్యులు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. 10.55 గంటలకు పీవీఆర్‌ ప్రాంగణంలోని వేదిక మీదకు చేరుకుంటారు. సీఎం వైయ‌స్‌ జగన్‌ జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం దివంగత నేత డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. 11.05 నుంచి 11.10 గంటల మధ్య కలెక్టర్‌ ఏఎస్‌.దినేష్‌ కుమార్, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీలు సున్నా వడ్డీ కార్యక్రమం, జిల్లాలోని అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరిస్తారు. అనంతరం డ్వాక్రా గ్రూపులకు చెందిన సున్నా వడ్డీ లబ్ధిదారుల  పరిచయ కార్యక్రమం, వాళ్ల అనుభవాలు వివరిస్తారు. తరువాత 11.45 నుంచి 12.15 గంటల వరకు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12.15 గంటల తరువాత వైయ‌స్సార్‌ సున్నావడ్డీ మూడో విడత పంపిణీ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారు.

రాష్ట్ర వ్యాప్తంగా 2021–22 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ ల్యాప్‌టాప్‌లో బటన్‌ నొక్కటం ద్వారా నేరుగా డ్వాక్రా గ్రూపుల బ్యాంకు అకౌంట్లకు జమ చేయనున్నారు. 12.25 నుంచి 12.30 లోపు సెర్ప్‌ సీఈఓ ఇంతియాజ్‌ ఈ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యమంత్రి మొదలుకొని అధికారులకు, డ్వాక్రా గ్రూపు సభ్యులకు, కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతారు. సభా స్థలి నుంచి కొత్తపట్నం బస్టాండ్‌ సెంటర్‌లోని బందర్‌ రోడ్డులో ఉన్న రవిప్రియ మాల్‌ అధినేత కంది రవి శంకర్‌ నివాసానికి మధ్యాహ్నం 12.30 గంటలకు చేరుకుంటారు. అక్కడ రవి శంకర్‌ కుటుంబంలో ఇటీవల వివాహం అయిన నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. రవి శంకర్‌ నివాసం నుంచి 12.55కు ఏబీఎం గ్రౌండ్‌లోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి 1.05 కు హెలిక్యాప్టర్‌లో బయలుదేరి తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి వెళతారు.   
 

తాజా వీడియోలు

Back to Top