థాంక్యూ సీఎం సర్  

ఇచ్చిన  మాట నిలబెట్టుకున్నందుకు ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ కృతజ్ఞతలు తెలిపిన అగ్రిగోల్డ్ బాధితులు

దేశంలో ప్రైవేటు సంస్ధ మోసం చేసినా కూడా బాధితులకు ప్రభుత్వం తరపున న్యాయం చేసిన సిఎంగా శ్రీ వైయస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారు.

 అగ్రిగోల్డ్ బాధితుల  సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి

తాడేప‌ల్లి:   అమాయక ప్రజలను ప్రైవేటు సంస్ధ (అగ్రిగోల్డ్) మోసం చేస్తే, బాధితులకు (20 వేల రూపాయలలోపు డిపాజిట్ చేసినవారు)  ప్రభుత్వం తరపున 905 కోట్ల రూపాయల మేర సహాయం అందించిన ముఖ్యమంత్రిగా శ్రీ వైయస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారని అగ్రిగోల్డ్ బాధితులు అన్నారు. అప్పటి ప్రతిపక్షనేతగా ఉన్న శ్రీ వైయస్ జగన్ ను పాదయాత్రలో కలసి అగ్రిగోల్డ్ సంస్ధ వల్ల నష్టపోయిన ఏజంట్లు,ఖాతాదారులు తాము ఆర్ధికంగా ఏ విధంగా నష్టపోయింది తెలియచేస్తే,తాను అధికారంలోకి వస్తే తప్పక న్యాయం చేస్తానని మాట ఇచ్చి నేడు ఆ మాట నిలుపుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ అని వారు కొనియాడారు.

 తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్రంలోని 13 జిల్లాలనుంచి అగ్రిగోల్డ్ సంస్ధ వల్ల నష్టపోయిన ఖాతాదారులు, ఏజంట్లు పలువురు ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ కు కృతజ్ఞతలు తెలియచేసేందుకు విచ్చేశారు. వారు థాంక్యూ సిఎం సార్ అంటూ సభ నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సభలో పలువురు అగ్రిగోల్డ్ బాధితులు, వారిసంఘ నేతలు మాట్లాడుతూ ..అగ్రిగోల్డ్ సంస్ధ వల్ల దేశంలో దాదాపు 8 రాష్ట్రాల‌లో లక్షలాదిమంది నష్టపోయారన్నారు. లక్షలాది మంది, వేలాది కోట్ల రూపాయల మేర డిపాజిట్లు కట్టి అవి రాకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ఆరు సంవత్సరాల క్రితం సంస్ధ మూసివేయడంతో వేలాదిమంది తమ డబ్బు కోసం రోడ్డెక్కి ఆందోళనలు,నిరాహారదీక్షలు,నిరసన దీక్షలు,రాస్తారోకోలు వంటివి చేయడం జరిగింది. తమ డబ్బుతో ఆ సంస్ధ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల‌లో ఆస్తులు కొనుగోలు చేసింది. అవి విక్రయించడం ద్వారా తమకు న్యాయం చేయవచ్చని ఆనాటి ప్రజాప్రతినిధులు సర్పంచ్ మొదలుకుని ఎంఎల్ ఏలు ,మంత్రులు, ఎంపీలు చివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సైతం కన్నీళ్లతో వినతిపత్రాలు అందచేసినా కనికరం చూపలేదన్నారు. పైగా పోలీసుల లాఠీఛార్జ్ లు,కేసులు,అవమానాలు,జైళ్లలో పెట్టించడాలు ఇలా అనేక రకాలుగా నరకం చూపి ఇబ్బందుల పాల్జేశారన్నారు. ఆ సమయంలో పాదయాత్రలో ప్రతిపక్షనేత శ్రీ వైయస్ జగన్ ను కలిస్తే ఆయన తాను అధికారంలోకి వస్తే బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చి దానిలో భాగంగా ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి నేతృత్వంలో అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీని ఏర్పాటుచేయడం జరిగిందన్నారు.

 ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారు ఆయన ఇచ్చిన మాట ప్రకారం 20 వేల రూపాయల లోపు డిపాజిట్ దార్లకు దాదాపు 10 లక్షల 40 వేల మంది బాధితులను 905 కోట్ల రూపాయల మేర ఆదుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుతం పలువురు బాధితులు న్యాయ,సాంకేతిక సమస్యల వల్ల స్పల్ప సంఖ్యలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారి సమస్యలను పరిష్కరించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డికి వినతిపత్రం అందచేశారు.
 
     ఈ సంద‌ర్భంగా  లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ.. రోజు కష్టం చేసి, కూలిపనులు చేసి సంపాదించిన మొత్తాలు...చిరుద్యోగులు,మహిళలు పొదుపు చేసి ఆ డబ్బును దాచుకుందామని అగ్రిగోల్డ్ సంస్దలో డిపాజిట్లు చేసి నష్టపోయిన విధానం తెలుసుకుని వారికి న్యాయం చేయాలని ధృడసంకల్పంతో శ్రీ వైయస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని తెలియచేశారు. శ్రీ వైయస్ జగన్ మానవత్వంతో ఆలోచించే వ్యక్తి అని అందుకే ఆయన వారందరికి ఇచ్చిన మాట నెరవేర్చేందుకు ప్రభుత్వం నుంచి ఆర్ధికంగా ఆదుకున్నారన్నారు. అగ్రిగోల్డ్ బాధిత బాసట కమిటికి నన్ను కన్వీనర్ గా నియమించినందుకు వారి సమస్య పరిష్కారంలో తనను భాగం చేసినందుకు ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని అన్నారు. గతంలో అధికారంలో ఉన్న చంద్రబాబు బాధితులకు సహాయం చేయకపోగా వారిపై పోలీసు కేసులు పెట్టించి దుర్మార్గంగా వ్యవహరించారని అన్నారు. అగ్రిగోల్డ్ ఆస్దులు కాజేసేందుకు ప్రయత్నించారన్నారు. అధికారంలో ఉండి చంద్రబాబు అలా వ్యవహరిస్తే ప్రతిపక్షనేతగా జగన్ అగ్రిగోల్డ్ బాధిత బాసట కమిటిని ఏర్పాటు చేసి తన దూరదృష్టిని చాటుకున్నారన్నారు. అందుకే ఈరోజు లక్షలాదిమంది అగ్రిగోల్డ్ బాధితులు శ్రీ వైయస్ జగన్ ను మెచ్చుకుంటున్నారని,కృతజ్ఞతలు చెబుతున్నారని అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులు ఇప్పుడు కొన్ని సమస్యలను తన దృష్టికి తెచ్చారని వాటిని శ్రీ వైయస్ జగన్ దృష్టికి తీసుకువెెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలియచేశారు.

     ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ బాధితులు తమ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేసిన  లేళ్ళ అప్పిరెడ్డిని సన్మానించేందుకు ప్రయత్నించారు. అందుకు అప్పిరెడ్డి నిరాకరిస్తూ ఈ సన్మానానికి ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మాత్రమే అర్హులని తిరస్కరించారు.ఇది ఈ ప్రభుత్వంలో పోరాడటం వల్ల సాధించింది కాదని శ్రీ వైఎస్ జగన్ బాధితులకు న్యాయం చేయాలనే మానవతాదృక్పధంతో తీసుకున్న నిర్ణయం వల్ల జరిగిన మేలనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు.ఈ క్రెడిట్ ముఖ్య మంత్రి శ్రీ వైయ‌స్ జగన్ కే దక్కుతుంది అని అన్నారు . సభలో అగ్రిగోల్డ్ బాధితుల సంఘ నేతలు రత్నాచారి,మోజెస్, జడ్ సన్,రాము,నవరత్నాల ప్రోగ్రామ్ వైస్ ఛైర్మన్ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
 

Back to Top