తాడేపల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో రాష్ట్రంలో మహిళల రక్షణ గాల్లో దీపంలా తయారైందని వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో రాజకీయ రాబంధులు స్వైరవిహారం చేస్తున్నాయని ఆమె మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అండతో ఏకంగా ఎమ్మెల్యేలే మహిళలపై వేధింపులకు పాల్పడ్డాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ఇంకా ఏమన్నారంటే... మహిళలపై వేధింపులు- రెడ్ బుక్ రాజ్యంగం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళామణులకే అగ్రతాంబూలం అంటూ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు చెప్పిన చమక్కులు చూశాం. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ప్రతి ఆడపిల్ల బాధ్యత నాదే అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగులు కూడా చూశాం. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 15 నెలలుగా రాష్ట్రంలో రాబందులు స్వైరవిహారం చేస్తున్నారు. పూర్తిగా పొలిటికల్ గవర్నెన్స్ నడుస్తోంది... రెడ్ బుక్ పేరుతో రాజ్యాంగ హక్కులను కూటమి సర్కారు కాలరాస్తోంది. ఉద్యోగులు, దళితులు, మహిళలపై చంద్రబాబు అండతో ఎమ్మెల్యేలు చేస్తున్న దాష్టీకాలకు అడ్డుఅదుపూ లేకుండా పోతుంది. ఏ అధికారం లేకున్నా ఉద్యోగులపై కూటమి ఎమ్మెల్యేలు అధికారం చెలాయిస్తున్నారు. తమ మాట వినని ఉద్యోగులపై వేధింపులు, బదిలీలు చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఏకంగా ఓ మహిళా ప్రిన్సిపాల్ ను వేధించారు. పనులు పేరుతో ఎమ్మెల్యే కూన రవికుమార్ రాత్రి పది గంటల తర్వాత కూడా పనుల సాకుతో కార్యాలయానికి పిలిపించుకుంటున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే అనుచరులను పంపించి బెదిరిస్తారు. అర్ధరాత్రి వీడియో కాల్ చేస్తూ వేధిస్తున్నారు. ఏ ప్రభుత్వం లోనూ ఇలాంటి ప్రజాప్రతినిధులను చూడలేదు. తమ మాట వినకపోతే, తమకు నచ్చినట్టు చేయకపోతే బదిలీలు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను ఎమ్మెల్యేల కాళ్ల కింద అణిగిమణిగి ఉండేలా పెట్టిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుంది. రేషన్ కార్డుల దగ్గర నుంచి ఏ అర్జీ పెట్టుకోవాలన్నా మహిళలు ఎమ్మెల్యేల దగ్గరకే వారి అనుచరుల దగ్గరకో వెళ్లి మొరపెట్టు కోవాల్సిన దుస్థితి రాష్ట్రంలో నెలకొంది. గతంలో ఈ పరిస్థితి ఎప్పుడూ లేదు. చివరకు ఉద్యోగులకు నిబంధల ప్రకారం, తమ హక్కుగా రావాల్సిన దాన్ని పై అధికారులు చేయాలన్నా కూడా.. ఎమ్మెల్యేల దగ్గరకు వెళ్లి అడుక్కునే పరిస్థితికి తీసుకొచ్చారు. ఉద్యోగ భయంతో తమ ప్రాణాలకు హాని తలపెడుతున్నారని పోలీసులకు మొరపెట్టుకున్నా కూడా పట్టించుకోని పరిస్థితి చూస్తున్నాం. నిందితులకు అండగా కూటమి ప్రభుత్వం: పల్నాడు జిల్లాకు చెందిన బాధితురాలు రోశమ్మ... టీడీపీ మహిళా నేత నుంచి కాపాడమంటూ అంబులెన్స్ లో వచ్చి కలెక్టర్, ఎస్పీలకు మొరపెట్టుకొంది. తనకున్న ఎకరమున్నర పొలాన్ని సదరు టీడీపీ మహిళా నేత దురాక్రమణకు పాల్పడుతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తే... అధికారులు కనీసం పట్టించుకున్న పాపానపోలేదు. బాధితురాలు ఆవేదన నిజం, జిల్లా కలెక్టర్, ఎస్పీలను కలిసిన మాట కూడా నిజం... అయినా సాక్షి మాత్రమే ఎందుకు నిస్సహాయుల పక్షాన నిలబడి ప్రశ్నిస్తోందన్న విషయం రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్యను ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధించిన ఘటనలు తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజూ కొకొల్లలు జరుగుతున్నాయి. అయినా దీనిపై ఎందుకు ఎల్లో మీడియా మాఫియా వార్తలు రాయడం లేదు..? అధికార పార్టీకి చెందిన నేతలు ఎన్ని అఘాయిత్యాలైనా చేయవచ్చు, కానీ ఎవరూ వాటిని ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే వారి నొంతు నొక్కే ప్రయత్నం చేస్తారు. నరసరావుపేటలో అధికారపార్టీ నేత మరో దారుణాన్ని చూస్తే... లైంగిక దాడికి ప్రయత్నించిన మొక్కపాటి వెంకటేశ్వర్లు అనే వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. కనీసం కేసు కూడా నమోదు చేయలేదు సరికదా తిరిగి బాధితురాలని రాజీకి రమ్మని సలహా ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు నిందితుల పక్షానే ప్రభుత్వం నిలబడిందే తప్ప బాధితులకు ఏనాడూ అండగా నిలబడలేదు. మహిళలపై ఇంత అన్యాయాలు జరుగుతున్నా డిప్యూటీ సీఎం ఎందుకు బయటకు వచ్చి స్పందించడం లేదు. కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధుల అఘాయిత్యాలను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ఆ పార్టీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వ్యవహారం కలకలం రేపగా... ఇవాళ గుంటూరు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ల ఉదంతాలు మహిళలపై వీరి దాష్టీకాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. గుంటూరుకు చెందిన టీడీపీ నేత షేక్ సోఫియా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. కారణం గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ వేధింపుల తట్టుకోలేక ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలు తెలిపింది. కూటమి పాలనలో మహిళల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైందనడానికి ఇదే నిదర్శనం. ఎమ్మెల్యే నజీర్ ఫోన్ లో గతంలో టీడీపీ కార్పొరేటర్ పదవికి పోటీ చేసిన మహిళతో వీడియ్ కాల్ లో చెప్పలేని రీతిలో సైగలు చేస్తూ మాట్లాడిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉంది. గౌరవప్రదమైన ఎమ్మెల్యే స్ధానంలో ఉండి ఇలా మాట్లాడ్డం నిజంగా సిగ్గుచేటు. ఆడబిడ్డలకు అండగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి: మహిళల రక్షణ విషయంలో గత ప్రభుత్వానికి,ఈ ప్రభుత్వానికి తేడా చూస్తే... వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో మహిళల భద్రతకు పెద్ద పీటవేశారు. స్కూలుకెళ్లే చిన్నారి నుంచి, ఉద్యోగం చేసుకున్న మహిళ, ఇంట్లో ఉండే అక్కచెల్లెమ్మల వరకు ఎవరికి కష్టం వచ్చినా, వారి ఫోన్ లో దిశయాప్ ఉంటే దానికి ఫోన్ చేసినా, లేదంటే కనీసం పోన్ ను అటూ ఇటూ ఊపినా చాలు పోలీసులు వచ్చి చర్య తీసుకునే రోజులు చూశాం. అలాంటి దిశ యాప్ ను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. కొత్తగా శక్తి యాప్ ను తీసుకొచ్చినా... అది పనిచేసిన పాపాన పోలేదు. కేవలం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలను కాపీ చేస్తే సరిపోదు.. వాటిని ఆచరించే దమ్ము, సత్తా ఉండాలి. కానీ ఈ ప్రభుత్వానికి ఆ సత్తా లేదు. మహిళల వ్యక్తిత్వ హననం టీడీపీ లక్షణం: మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచి, బురదజల్లడం చంద్రబాబుకు ఇవాళ కొత్తకాదు. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచినప్పటి నుంచి నేటి వరకూ మహిళల వ్యక్తిత్వ హననం చేయడం బాబుకు అలవాటే. ఆ రోజు ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి వ్యక్తిత్వాన్ని కించపరిచారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అదే పని. 2019లో ఇసుక అక్రమ రవాణా వ్యవహారంలో ఎమ్మార్వో వనజాక్షి మీద అప్పటి టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడిచేస్తే... చర్యలు తీసుకోవాల్సిన చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కూడా పంచాయతీ చేసి చింతమనేనిని కాపాడి, మహిళా అధికారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ గతంలో వేదిక మీద మహిళల గురించి మాట్లాడుతూ.. ఆడది కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, తల్లినైనా చేయాలన్న మాటలను కూటమి నేతలు సీరియస్ గా తీసుకున్నట్టు కనిపిస్తోంది. కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు అదే పనిలో ఉంటూ అరాచకాలకు పాల్పడుతున్నారు. అందులో భాగంగానే ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలే మహిళలను, మహిళా ఉద్యోగులను దారుణంగా వేధింపులకు గురిచేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 22-07-2025 నాడు ఇబ్రహీంపట్నం దళిత మహిళపై టీడీపీ నేత, కాటేపల్లి సుబ్బారావు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. దీంతో బాధితురాలు ఆవేదనతో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేస్తే.. ఈ ఘటన ఏడాది తర్వాత బయటకు వచ్చింది. 21-07-2025 తేదీన భర్తను కోల్పోయిన ఒంటరి మహిళ తన కుమార్తె కోసం కేజీబీవీలో హాస్టల్ సీటు ఇప్పంచమని అడిగితే... తన కోరిక తీర్చితే సీటు ఇప్పిస్తానని టీడీపీ నేత వేధింపులకు దిగారు. అంటే ఒంటరి మహిళలు టీడీపీ నేతలు ఎలాంటి రక్షణ ఇస్తున్నారో ఇలాంటి ఘటనలే నిదర్శనం. ఇలాంటి వేధింపులకు పాల్పడ్డ వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే సత్యసాయి జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే శానిటేషన్ వర్కర్ తో టీడీపీ కార్యకర్త 21-07-2025 నాడు ఉద్యోగం కోసం కమిట్ మెంట్ ఇవ్వాలని వేధించాడు. ఆ కాల్ వాయిస్ కూడా వైరల్ అయింది. 03-07-2025 నాడు తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఓ యువతిపై టీడీపీ కార్యకర్త ఉదయ్ లైంగిక దాడికి యత్నించాడు. ఆగష్టు 1 న యువతిని మోసం చేసిన కేసులో మచిలీపట్నం టీడీపీ నేత పల్లపాటి సుబ్రమణ్యం తనయుడిని అరెస్టు చేశారు. అది కూడా బాధితురాలి పక్షాన వైయస్ఆర్సీపీ నేత పేర్ని కిట్టు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే అప్పుడు అరెస్టు చేశారు. అంటే వైయస్ఆర్సీపీ నేతలు బాధితుల పక్షాన పోరాటం చేస్తే తప్ప వారికి న్యాయం జరగడం లేదు. అదే విధంగా 15-06-2025 లో ప్రేమ పేరుతో రాజమండ్రి టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అనుచరుడు యువతిని మోసం చేశాడు. ఇక అనంతపురం జిల్లాలో 05-06-2025 అయితే దళిత మైనర్ బాలికపై టీడీపీకి చెందిన కార్యకర్తలు ఆరు నెలలుగా అత్యాచారం చేశారు. 03-06-2025 నా టీడీపీ కార్యకర్త పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన మైనర్ బాలికపై అత్యాచారం చేశాడని.. పోలీసులకు మొరపెట్టుకుంటే నేటికీ వారికి న్యాయం జరగలేదు. 06-04-2025 పల్నాడు జిల్లాలో దళిత అంగన్వాడీ ఉద్యోగిపై లైంగికంగా టీడీపీ నేత వేధిస్తే.. అతనిపై చర్యలు లేవు. 31-06-2024లో హోంమంత్రి అనిత సొంత నియోజకవర్గం పాయకరావుపేటలో వరలక్ష్మి, లక్ష్మి అనే ఇద్దరు మహిళల దుస్తులు చింపి, జుత్తు పట్టుకుని వారిని కొడుతూ టీడీపీ నేతలు దాష్టీకానికి పాల్పడ్డారు. 17-10-2024 టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చంద్రబాబు కుప్పం పార్టీ పరిశీలకుడు గాజుల ఖాజర్ భాషా రాసలీలలు బయటపడితే ఎలాంటి చర్యలు లేవు. చివరకు బిల్లులు పాస్ కావాలన్నా కూడా వేధింపులకు గురిచేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. 19-10-2024లో విద్యార్థినులపై టీడీపీ కుటుంబాలకు చెందిన యువకులు గ్యాంగ్ రేప్ చేస్తే... ఎవరూ దీనిపై మాట్లాడలేదు. పాలనపై అన్ని వర్గాల్లోనూ అసంతృప్తి: గత ఏడాది కాలంగా రాష్ట్రంలో ఏ వర్గానికి చెందిన ప్రజలు కూడా కూటమి పాలనపై సంతోషంగా లేరు. కూటమి ప్రభుత్వం మహిళల కోసం స్త్రీ శక్తి పేరుతో ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. తీరా ఏ బస్సు చూసినా ఇది స్త్రీ శక్తి పథకం వర్తించదు అనే బోర్డు కనిపిస్తోంది. హామీలు అందరూ ఇస్తారు.. కొంతమందే వాటిని కార్యరూపం దాల్చేలా చేస్తారు. కూటమి ప్రభుత్వానికి అస్సలు చిత్తశుద్ధి లేదు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలను అమలు దిశగా కూటమి ప్రభుత్వం పనిచేయాలి. లేని పక్షంలో హామీల అమలు, అధికార పార్టీ ఆగడాలు, మహిళలకు జరుగుతున్న అన్యాయాల మీద బాధితుల తరపున వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా పోరాటం చేస్తుందని... బాధితులకు అండగా నిలుస్తుందని శ్యామల హెచ్చరించారు.