చిత్తూరు జిల్లా: పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీ ఇంచార్జి చల్లా బాబు అనుచరులు వీరంగం సృష్టించారు. రొంపిచెర్ల మండలం పెద్దగొట్టిగాళ్ళు పంచాయతీ గడిచెరువుపల్లెకు చెందిన వైయస్ఆర్‌సీపీ కార్యకర్త సుబ్రమణ్యం పై హత్యాయత్నం చేయడంతో పాటు, ఆయన కుటుంబ సభ్యులపై దాడి చేశారు. బాధితుడు సుబ్రమణ్యం తెలిపిన వివరాల ప్రకారం, టిడిపి మండల కన్వీనర్ ఓబులేశ్వర రెడ్డి, రామకృష్ణ రెడ్డి , వారి అనుచరులు కలిసి తన ఇంటికి వచ్చి దాడికి దిగారని తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్త విజయ్ కుమార్ రెడ్డి కత్తితో వీరంగం సృష్టిస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు. అంతేకాకుండా రాత్రి సమయంలో కత్తులతో ఇంటిపై దాడి చేసి, పెట్రోల్‌తో తగలబెట్టేందుకు కుట్ర పన్నారని సుబ్రమణ్యం పేర్కొన్నారు. జేసీబీతో ఇల్లు కూల్చేస్తామని బెదిరింపులకు దిగారని తెలిపారు. “ఓబులేశ్వర రెడ్డి కు వ్యతిరేకంగా పనిచేస్తారా… చంపేస్తాం” అంటూ కత్తులతో బెదిరించినట్లు బాధితుడు వెల్లడించారు. ఈ ఘటనపై సుబ్రమణ్యం రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓబులేశ్వర రెడ్డి, రామకృష్ణ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొనగా, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వైయస్ఆర్‌సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు తక్షణమే జోక్యం చేసుకుని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.