విశాఖ పోలీస్ కమిషనర్‌ను కలిసిన వైయ‌స్ఆర్‌సీపీ నేతలు

ఏబీఎన్ రాధాకృష్ణపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ 

విశాఖపట్నం: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏబీఎన్ రాధాకృష్ణపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు విశాఖపట్నం పోలీస్ కమిషనర్‌ను కలిసి మరోసారి ఫిర్యాదు సమర్పించారు. ఈనెల 9వ తేదీన జరిగిన వ్యాఖ్యలపై ఇప్పటికే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేయడంలో ఆలస్యం చేయకుండా వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. విశాఖపట్నం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ కె.కె. రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్ కుమార్, తిప్పల దేవన్ రెడ్డి, మొల్లి అప్పారావు, సి.ఇ.సి సభ్యుడు కోలా గురువులు, నియోజకవర్గ పరిశీలకులు, మాజీ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, రొంగలి జగన్నాధం, జహీర్ అహ్మద్, సతీష్ వర్మ, పేడాడ రమణికుమారి తదితరులు పాల్గొన్నారు. 
మహిళల గౌరవాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన వారిని ఉపేక్షించరాదని, చట్టం ముందు అందరూ సమానమని నేతలు స్పష్టం చేశారు. పోలీసులు తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Back to Top