విజయవాడ : ఏబీఎన్, ఆంధ్రజ్యోతి పై ఇచ్చిన ఫిర్యాదులపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై వైయస్ఆర్‌సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రులు జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీలు ఎండి. రూహుల్లా, మొండితోక అరుణ్ కుమార్, జగ్గయ్యపేట ఇంచార్జ్ తన్నీరు నాగేశ్వరరావు, నగర మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ, ఏబీఎన్ రాధాకృష్ణ వైయస్ఆర్‌సీపీ నేతల భార్యలపై అగౌరవంగా వ్యాఖ్యలు చేసి కించపరిచారని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేసినా ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు చేయకపోవడం పోలీసుల నిర్లక్ష్యాన్ని సూచిస్తోందన్నారు. వైయస్ఆర్‌సీపీపై మాత్రం తప్పుడు కేసులు నమోదు చేస్తున్న పోలీస్ వ్యవస్థ బండారం బయటపడిందని విమర్శించారు. పబ్లిక్‌గా మహిళలపై వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఫిర్యాదు తీసుకోవడానికే భయపడుతున్నారా? తాము ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్తే, లేఖ తీసుకోవడానికే పోలీసులు వెనుకాడుతున్నారని దేవినేని అవినాష్ తప్పుపట్టారు. టీడీపీ నేతల ఒత్తిడికి పోలీసులు భయపడుతున్నారా అని ప్రశ్నించారు. నిజంగా మహిళల గౌరవాన్ని కాపాడాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలపై తక్షణమే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్‌సీపీ నేతలు స్పష్టం చేశారు. లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.