అంబటి రాంబాబుపై టీడీపీ నేతలు, రౌడీల హత్యాయత్నం

పోలీసుల సమక్షంలోనే అంబటి ఇంటిపై దాడి

గుంటూరు: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ నేతలు, రౌడీలు హత్యాయత్నానికి పాల్పడిన ఘటన గుంటూరులో తీవ్ర కలకలం రేపింది. పోలీసుల సమక్షంలోనే వందల మంది టీడీపీ నేతలు, కార్యకర్తలు కర్రలు, రాడ్లు పట్టుకుని అంబటి రాంబాబు నివాసంపై దాడికి దిగడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. టీడీపీ మూకలు అంబటి రాంబాబును లక్ష్యంగా చేసుకుని పచ్చిబూతులు తిడుతూ, పరుష పదజాలంతో దూషణలకు దిగిన అనంతరం ఆయన్ను శారీరకంగా హానిచేయాలన్న ఉద్దేశంతో దాడికి ప్రయత్నించారు. కర్రలు, రాడ్లతో గుంపుగా చేరిన టీడీపీ నేతలు అంబటి ఇంటిపై దాడి చేయడం ద్వారా భయానక వాతావరణాన్ని సృష్టించారు.

అత్యంత ఆందోళనకర విషయం ఏమిటంటే, ఈ దాడి ఘటన జరుగుతున్న సమయంలో అక్కడ పోలీసులు ఉన్నప్పటికీ టీడీపీ మూకలను అడ్డుకునేందుకు సరైన చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల సమక్షంలోనే మాజీ మంత్రి ఇంటిపై దాడి జరగడం రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయనడానికి నిదర్శనమని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఇంటి ఆవ‌ర‌ణ‌లో పార్క్ చేసిన మూడు కార్లు, ఇంటి అద్దాలు, పూల‌కుండీల‌ను ప‌చ్చ‌మూక‌లు ధ్వంసం చేశారు.

ఈ దాడికి టీడీపీకి చెందిన కొందరు నేతలు ప్రత్యక్షంగా నాయకత్వం వహించారని, ముఖ్యంగా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ వందన దేవి పచ్చిబూతులతో రెచ్చగొట్టి రౌడీలను దాడికి ఉసిగొల్పారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ప్రజాప్రతినిధి హోదాలో ఉండి ఇలాంటి అసభ్య, హింసాత్మక ప్రవర్తనకు పాల్పడటం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని తీవ్రంగా విమర్శించారు. ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించినప్పుడల్లా అంబటి రాంబాబుపై టీడీపీ నాయకులు దాడులకు దిగుతున్నారని, ఇది వ్యక్తిగత దాడి కాదని ప్రతిపక్ష గొంతును నొక్కే ప్రయత్నమని తెలిపారు. ఈ ఘటన ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది. ఈ ఘటనపై తక్షణమే కేసులు నమోదు చేసి, అంబటి రాంబాబుపై హత్యాయత్నానికి పాల్పడిన టీడీపీ నేతలు, రౌడీలందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రాణాలకు ఏవైనా హానులు జరిగితే దానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని పార్టీ స్పష్టం చేసింది.

Back to Top