అమరావతి: టీడీపీ నేతల అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన హోరు కొనసాగుతోంది. అన్ని నియోజకవర్గాల్లో వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో జనాగ్రహ దీక్షలు చేపడుతున్నారు. నెల్లూరులో భారీ ర్యాలీ, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రకాశం జిల్లాలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జనాగ్రహ దీక్ష చేపట్టారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో టీడీపీకి వ్యతిరేకంగా నిరసనలు హోరెత్తాయి. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారిని నోటితో చెప్పలేని భాషలో తిట్టడమే కాక రాష్ట్ర బంద్‌కు పిలుపిచ్చి, అది విఫలం కావడంతో 36 గంటల దీక్షకు దిగాలన్న చంద్రబాబు నిర్ణయం అప్రజాస్వామికమని ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. విశాఖలో చేపట్టిన జనాగ్రహ దీక్షలో ఎంపీ పాల్గొన్నారు. బూతు వ్యాఖ్యలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలనే డిమాండ్‌తో రెండ్రోజుల పాటు "జనాగ్రహ దీక్షలు"* నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
దుర్భాషలకు వ్యతిరేకంగా అనంతపురం జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు మిన్నంటాయి. శాంతి భద్రతలకు విఘాతం కలిగించి ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేయాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 నియోజకవర్గాల్లోనూ చంద్రబాబు, పట్టాభి దిష్టిబొమ్మలను దహనం చేయడంతో పాటు ప్రదర్శనలు, మానవహారాలు నిర్వహించారు. సీఎం జగన్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. టీడీపీ నేతల నోటి దురుసుపై కృష్ణా జిల్లాలో నిరసనాగ్రహం పెల్లుబికింది. టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని పలుచోట్ల పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. నల్ల జెండాలతో ప్రదర్శనలు చేపట్టారు. టీడీపీ నేతల తీరు పట్ల సిక్కోలులో వైయస్ఆర్‌సీపీ శ్రేణులు భగ్గుమన్నాయి.