కుడి ఎడమల దగా! 

పోలవరానికి మరో ద్రోహం 

కుడి కాలువ సామర్థ్యం 11 వేలు, ఎడమ కాలువ సామర్థ్యం 8 వేల క్యూసెక్కులే

ఈ సామర్థ్యంతో చేసిన పనులకే నిధులు ఇస్తామని తేల్చి చెప్పిన కేంద్రం

వాస్తవానికి కుడి కాలువ సామర్థ్యం 17,560, ఎడమ కాలువ సామర్థ్యం 17,580 క్యూసెక్కులు

రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకంతో ఖజానాపై రూ.4,753.98 కోట్ల భారం 

2017లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి పంపిన డీపీఆర్‌–2లో తప్పిదం ఫలితమిది

ఇప్పటికే ఎత్తును 45.72 నుంచి 41.15 మీటర్లకు తగ్గించి బ్యారేజ్‌గా మార్చేసిన వైనం

ఈ అంశాన్ని ఎత్తి చూపిన గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం

తాజాగా అయ్యే వ్యయం, విభాగాల వారీ పరిమితులు ఎత్తేసి నిధులివ్వాలని వినతి

ఆ నిధులు ఇస్తామని 2023 జూన్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అంగీకారం

తీరా ఇప్పుడు బాబు ప్రభుత్వ తప్పిదం మేరకే నిధులు ఇస్తామని స్పష్టీకరణ

నష్టపోతున్నా నోరు మెదపని రాష్ట్ర ప్రభుత్వం.. సర్వత్రా విస్మయం

అమరావతి: రాష్ట్రానికి జీవనాడిగా అభి­వర్ణిస్తున్న పోలవరం జాతీయ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ద్రోహం చేసింది. ఇప్పటికే నీటి నిల్వ మట్టాన్ని 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గిస్తూ ఆగస్టు 28న కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రప్రభుత్వం అంగీకరించడం ద్వారా పోలవరం రిజర్వాయర్‌ను బ్యారేజ్‌గా మార్చేసింది. తాజాగా కుడి కాలువ సామర్థ్యం 11 వేల క్యూసెక్కులు, ఎడమ కాలువ సామర్థ్యం 8 వేల క్యూసెక్కులతో చేపట్టిన పనులకే బిల్లులు ఇస్తామని కేంద్ర జల్‌ శక్తి శాఖ తేల్చి చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపక పోవడం విస్తుగొ­లుపుతోంది. 

దివంగత సీఎం వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు 8 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా 17,580 క్యూసెక్కుల సామర్థ్యంతో పోలవరం ఎడమ కాలువను, కృష్ణా డెల్టాకు నీటి కరువన్నదే లేకుండా చేసేందుకు 17,560 క్యూసెక్కుల సామర్థ్యంతో కుడి కాలువను 2004లో చేపట్టారు. విభజన నేపథ్యంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం.. తాజా ధరల మేరకు సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

ఈ మేరకు 2017 ఆగస్టు 17న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించిన రెండో సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదన(డీపీఆర్‌–2)లో కుడి కాలువ సామర్థ్యాన్ని 11 వేలు, ఎడమ కాలువ సామర్థ్యాన్ని 8 వేల క్యూసెక్కులుగా తప్పుగా పేర్కొంది. దాని ఫలితంగానే కేంద్ర జల్‌ శక్తి శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.4,753.93 కోట్ల భారం పడుతుందని జల వనరుల శాఖ అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

చిరకాల స్వప్నం సాకారమైన వేళ.. 
గోదావరిపై పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రతిపాదన 1941లో చేసినా, 2004 వరకు ఆ ప్రాజెక్టు పనులు చేపట్టే సాహసం ఏ ముఖ్యమంత్రి చేయలేదు.  అయితే వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో జలయజ్ఞంలో భాగంగా ఈ ప్రాజెక్టును సాకారం చేస్తూ నిర్మాణ పనులు చేపట్టారు. కొత్తగా 3.2 లక్షల ఎకరాలకు నీళ్లందించడంతోపాటు 80 టీఎంసీలను మళ్లించి కృష్ణా డెల్టాలో 13.06 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించేలా 17,560 క్యూసెక్కుల సామర్థ్యంతో కుడి కాలువను చేపట్టారు. 

కొత్తగా 4 లక్షల ఎకరాలకు నీళ్లందించడం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి 63.2 టీఎంసీను మళ్లించి 8 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా 17,580 క్యూసెక్కుల సామర్థ్యంతో ఎడమ కాలువను చేపట్టారు. గోదావరి ట్రిబ్యునల్‌ అనుమతి ఇచ్చిన మేరకు 45.72 మీటర్లు (150 అడుగులు) గరిష్ట నీటి మట్టంతో 194.6 టీఎంసీల నీటి నిల్వ.. 960 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్కేంద్రం.. 449.78 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారు. 

ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి డెల్టాలో 10.5 లక్షల ఎకరాలను స్థిరీకరించడంతోపాటు విశాఖపట్నం పారిశ్రామిక, తాగునీటి అవసరాలకు 23.44 టీఎంసీలు.. కుడి, ఎడమ కాలువల సమీపంలోని 540 గ్రామాల్లోని 28.50 లక్షల మంది దాహార్తి తీర్చేలా ఈ ప్రాజెక్టును చేపట్టారు.

డీపీఆర్‌–2లో తప్పుల పర్యవసానమే.. 
విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం.. అంతర్రాష్ట్ర వివాదాలను పరిష్కరించడంతోపాటు అన్ని రకాల అనుమతులు తీసుకుని, వంద శాతం వ్యయంతో తామే నిర్మించి ఇస్తామని రాష్ట్రానికి హామీ ఇచ్చింది. ఆ మేరకు విభజన చట్టంలో సెక్షన్‌–90లో స్పష్టం చేసింది. ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టడం కోసం పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ)ని 2014 మే 28న ఏర్పాటు చేసింది. 2015 మార్చి 12న నిర్వహించిన తొలి సర్వసభ్య సమావేశంలోనే.. తాజా ధరల మేరకు పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలు ఇవ్వాలని అప్పటి పీపీఏ సీఈవో దినేష్‌కుమార్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. 

కానీ.. సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనను సమర్పించడంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర జాప్యం చేసింది. ఎట్టికేలకు 2017 ఆగస్టు 17న రెండో సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను పీపీఏకు సమర్పించింది. ఆ ప్రతిపాదనల్లో కుడి, ఎడమ కాలువ సామర్థ్యాన్ని తప్పుగా పేర్కొంది. ఇదే అంశాన్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎత్తిచూపి.. తాజా పరిమాణాల ఆధారంగా ప్రాజెక్టు పనులకు అయ్యే వ్యయాన్ని, విభాగాల వారీగా విధించిన పరిమితులను ఎత్తేసి రీయింబర్స్‌ చేయాలని చేసిన విజ్ఞప్తికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అంగీకరించారు. 

ఆ మేరకు నిధులు ఇస్తామని స్పష్టం చేస్తూ 2023 జూన్‌ 5న నోట్‌ జారీ చేశారు. కానీ.. ఇప్పుడు కుడి కాలువ సామర్థ్యం 11 వేలు, ఎడమ కాలువ సామర్థ్యం 8 వేల క్యూసెక్కులతో చేపట్టిన పనులకే బిల్లులు ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది.

కళ్ల ముందు కరిగిపోతున్న స్వప్నం 
నీటి నిల్వ చేసే ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించడం వల్ల పోలవరం రిజర్వాయర్‌ బ్యారేజ్‌గా మారిపోయింది. గోదావరికి వరద వచ్చే రోజుల్లో మాత్రమే కుడి, ఎడమ కాలువలు.. పుష్కర, తాడిపూడి ఎత్తిపోతల కింద ఉన్న 1.58 లక్షల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే నీళ్లందించడానికి అవకాశం ఉంటుంది. 

పోలవరం ప్రాజెక్టు కింద మిగతా 5.62 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యం కాదు. కృష్ణా డెల్టాలో 13.06 లక్షల ఎకరాలు, గోదావరి డెల్టాలో 10.50 లక్షల ఎకరాల స్థిరీకరణ అసాధ్యమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం, విశాఖ పారిశ్రామిక, తాగు నీటి అవసరాలకు నీళ్లందించడం వీలు కాదని స్పష్టం చేస్తున్నారు. 

జల విద్యుదుత్పత్తి పూర్తి స్థాయిలో చేపట్టడమూ అసాధ్యమే. అంటే కళ్ల ముందే చిరకాల స్వప్నం కరిగి పోతుండటంతో రైతులు, సాగు నీటి రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ఎత్తును తగ్గించడం ద్వారా  భూసేకరణ, పునరావాసం వ్యయం రూపంలో ఇప్పటికే రూ.23,622 కోట్లను కేంద్రం మిగుల్చుకుంది. తాజాగా కుడి, ఎడమ కాలువ పనుల పరిమాణాన్ని తగ్గించడం ద్వారా మరో రూ.4,753.98 కోట్లనూ మిగుల్చుకుందని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.  

Back to Top