తెలుగు రాష్ట్రాలకు శకుని రామోజీరావు

దళితులతో వైయ‌స్ జగన్‌ది రక్త సంబంధం

బడుగుల పక్షాన నిలిచిన దళిత బంధు వైయ‌స్‌ జగన్‌

అసైన్డ్ భూములకు హక్కులు కల్పించిన ధీరోదాత్తుడు వైయ‌స్ జగన్

అసైన్డ్‌భూములను ఆక్రమించి రామోజీ ఫిల్మ్‌సిటీ కట్టలేదా..?

దళితులు కళ్లుతెరిస్తే ఫిల్మ్‌సిటీని దున్నేస్తారు

14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబును ప్రశ్నించావా..? 

తెలంగాణ పథకాలతో ఏపీకి సంబంధమేంటి..?

ఏపీలో అమలవుతున్న అమ్మ ఒడి తెలంగాణలో ఉందా..?

చేతనైతే బాబు పాలనతో వైయ‌స్‌ జగన్‌ పరిపాలనను పోల్చాలి..

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకర్‌ రావు 

తాడేప‌ల్లి: రాష్ట్రంలో ఒక నారదునిగా, శకుని పాత్రలు పోషిస్తున్న పత్రిక ఏదైనా ఉందంటే.. అది ఈనాడు దినపత్రిక అని రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు జూపూడి ప్ర‌భాక‌ర్‌రావు అన్నారు.  దళితులకు చంద్రబాబు ఏనాడైనా మంచి చేశారా? అసైన్డ్‌ భూముల్లో రామోజీరావు ఫిల్మ్‌సిటీ కట్టారని దుయ్యబట్టారు. ఈనాడు పత్రిక శకుని పాత్ర పోషిస్తోస్తూ ఏపీ, తెలంగాణ మధ్య గొడవలు పెట్టాలని చూస్తోంద‌న్నారు. దళితుల కోసం దివంగ‌త మహానేత వైయ‌స్ఆర్‌, సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని జూపూడి ప్ర‌భాక‌ర్‌రావు అన్నారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో జూపూడి ప్ర‌భాక‌ర్‌రావు విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఏం మాట్లాడారంటే..

నువ్వు దళితబంధువు ఎలా అవుతావంటూ ఆంధ్ర ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తూ ఈనాడు కథనం ఎలా రాస్తుంది..? ఏ ఉద్దేశంతో రాస్తుంది..? ఈ కథనంలో రామోజీరావు ఆంతర్యమేంటి..? అని ప్ర‌శ్నిస్తున్నాను. మరి, ఇదే ప్రశ్న మిగతా రాష్ట్రాలనూ అడగగలవా..? తెలంగాణలో కేసీఆర్‌ దళితబంధు పథకం అమలు చేస్తున్నంత మాత్రాన.. మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా దళిత వ్యతిరేకులని రామోజీ భావిస్తున్నారా..? లేదంటే, రాష్ట్రాల నడుమ ఘర్షణ వాతావరణానికి, రెచ్చగొట్టే విధంగా కథనాల్ని రాస్తూ  శకుని పాత్ర పోషిస్తున్నావా..? అని రామోజీని నేను నిలదీస్తున్నాను. 

దళితుల హృదయాల్లో చెరగని ముద్ర
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో దళితుల హృదయాల్లో అత్యంత ప్రేమపూరితంగా ఉన్న వ్యక్తి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి. దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి తాను బతికున్న రోజుల్లో కూడా దళితుల్ని అక్కున జేర్చుకుని ప్రేమించిన నాయకునిగా పేరొందారు. ఆయన తర్వాత అంతటి మహోన్నతమైన ప్రేమానురాగాలు దళితులకు పంచిపెడుతున్న నాయకుడెవరైనా ఉన్నారంటే.. ఆ ఘనత ఒక్క వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుంది. 

దళితులతో వైయ‌స్‌ జగన్‌ది రక్తసంబంధం
దళితబంధు ఎలా అవుతారని మా నాయకులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అడుగుతున్నారు కదా..? మరి, ఇదే ప్రశ్న చంద్రబాబు నాయుడునో.. లేదంటే, తనకు తానుగా రామోజీరావు వేసుకున్నా .. ఆ ప్రశ్నకు సమాధానం రాదు. ఎందుకంటే, వాళ్లకు డెభ్భై ఎనభైఏళ్లు వచ్చినా.. మంత్రులు, ముఖ్యమంత్రులైనా.. రాష్ట్రాల్ని, రాజ్యాంగాల్ని శాసించే పత్రికలకు యాజమానులైనా.. వాళ్ల ఇళ్లల్లో కులాంతర వివాహాలేమీ చేసుకోలేదు. కానీ, వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ఇంట్లో వారి మేనత్తలంతా ఎస్సీ కులస్తుల్నే వివాహాలు చేసుకున్న పరిస్థితులున్నాయి. ఇది రక్తసంబంధంతో ముడివేసుకున్న బంధమిది. 
దళితుల్ని ఈరోజు కొత్తగా మా నాయకుడు  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నా మేనల్లుళ్లు, నా తోడబుట్టిన సోదరులని గొప్పలు చెప్పుకోవడం లేదు. వారితో రక్తసంబంధం ముడివేసుకున్న బంధం ఉంది కనుకనే దళితుల్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. దీన్ని  గుర్తు పెట్టుకోవాలని రామోజీరావుకు చెబుతున్నాను. 

ఓ నారదమహర్షీ.. విను..
మరి, నువ్వేదో పక్కరాష్ట్రంలో దళితబంధు అనే పేరుతో ఒక స్కీమ్‌ను చూపెట్టి అడుగుతున్నావే .. ఓ నారద మహర్షీ.. ఓ ముసలాయనా.. దీనికి నువ్వు నీ పత్రికలో ఏం సమాధానం చెబుతావు..? అని రామోజీరావును అడుగుతున్నాను. రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం, 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా చేశానని డబ్బాలు కొట్టుకునే చరిత్ర ఉన్న చంద్రబాబును నువ్వు ఒక ప్రశ్న అడుగుతావా..? నీ రాజకీయ అనుభవం, నీ పాలనలో దళితులను ఉద్దరించడానికి ఏమైనా ఒక సంక్షేమ పథకాన్ని కొత్తగా తెచ్చి అమలు చేశావా..? అని నిలదీయగలవా రామోజీ..?

అసైన్డ్‌భూములపై దళితులకు హక్కులు
 1954 తర్వాత ప్రభుత్వ అసైన్డ్‌ భూముల్ని కులాధిపత్యంతో ఆక్రమించుకుని దళితుల్ని నిలువ నీడలేకుండా చేసింది ఎవరు..? అదే అసైన్డ్‌భూముల్లో రామోజీ ఫిల్మ్‌సిటీ కట్టలేదా..? అదే మా నాయకుడు వైయ‌స్‌ జగన్‌ ఎక్కడా సెంటు అసైన్డ్‌ భూమిని తీసుకోకపోగా.. 1954 తర్వాత ప్రభుత్వమిచ్చిన అసైన్డ్‌భూములపై, 20 ఏళ్లపాటు అనుభవంలో ఉన్న భూములపై అసలైన లబ్ధిదారులకు, అంటే బడుగు, బలహీన వర్గాలకు పూర్తి హక్కులిచ్చిన మహనీయులు వైయ‌స్ జగన్‌. పేదలకు నివాసానికి, వ్యవసాయానికంటూ ప్రభుత్వం అసైన్డ్‌ భూములనిస్తే.. వారిని బెదిరించి భయపెట్టి ఎవరో ఆధిపత్య కులాలు వాటిని తమ కబంధహస్తాల్లో ఉంచుకుని రాజ్యమేలుతుంటే.. అలా జరగకూడదంటూ వాటన్నింటినీ మరలా అర్హులైన లబ్ధిదారులకే ఇవ్వాలని సీఎం వైయ‌స్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయం చరిత్రలో చెరిపివేయలేనిది. ఏళ్లతరబడి అనుభవ సాగులో ఉన్న అసైన్డ్‌భూములపై హక్కులు తెచ్చుకున్న లబ్ధిదారుల్లో దళితులే అధికంగా ఉన్నారు. కావాలంటే, రామోజీరావు, చంద్రబాబు ప్రభుత్వకార్యాలయాల్లో రికార్డులు తెప్పించుకుని చూసుకోవచ్చు. ఈరోజు రాష్ట్రంలో కొన్ని లక్షల ఎకరాల్లో అసైన్డ్‌ పట్టాదారులుగా ఉన్న దళిత ఆసాములంతా  వైయ‌స్ జగన్‌కి బంధువులవుతారు. దీన్ని రెండోపాయింట్‌గా గుర్తు పెట్టుకోవాలని రామోజీరావుకు చెబుతున్నాను. 

దళితుల భూముల్ని తిరిగివ్వమని వార్త రాసే దమ్ముందా..?
దళితుల దగ్గరున్న భూముల్ని లాక్కున్నవారు, కబ్జాకు గురైన భూముల్ని తిరిగి అదే దళితులకు ఇవ్వాలని ఈనాడు పత్రికలో ఏనాడైనా ఒక్క వార్త రాశారా.. రామోజీ..? అని నిలదీస్తున్నాను. పోనీ, మీ మిత్రుడు చంద్రబాబుకు ఏనాడైనా దళితుల భూములు మనకొద్దయ్యా.. వారి భూములు వారికి ఇవ్వండని చెప్పారా..? మీ కులస్తులకు అలాంటి సూచనలు, సలహాలిస్తే వాటిని వార్తల ద్వారా బయటి సమాజానికి తెలియపరిచే దమ్ముందా..? అని రామోజీని ప్రశ్నిస్తున్నాను. 

డీబీటీ ద్వారా రూ.2.31 లక్షల కోట్లు పేదలకు
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణాల్లోని పేదలు సైతం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పట్ల ఆదరణ చూపుతున్నారు. ఎందుకంటే, కులం, మతం, ప్రాంతం, రాజకీయం లేకుండా పేదల్ని అక్కునజేర్చుకుని సంక్షేమ పథకాల్ని అందించే ముఖ్యమంత్రిని చూస్తున్నామనే సంతోషంలో ఉన్నారు. డీబీటీ ద్వారా రూ.2.31 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసిన ఏకైక ప్రభుత్వం ఇది. సంక్షేమాన్ని అందుకున్న లబ్ధిదారుల్లో అధికంగా దళితులే ఉన్నారనడంలో సందేహమేదీలేదు. ఇది మూడో పాయింట్‌గా గుర్తుపెట్టుకోవాలని రామోజీకి చెబుతున్నాను. అదే చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయంలో తన కులస్తులకే కాంట్రాక్టర్ల పేరిట డబ్బులు చెల్లించాడు మినహా ఏ ఒక్క దళితుడికైనా రూపాయి బిళ్ల పంచాడా..? అని అడుగుతున్నాను. 

పేదవాడి బాగే సీఎం వైయ‌స్‌ జగన్‌ సిద్ధాంతం
ప్రభుత్వమంటే ప్రజలు. ప్రజల్లోనూ పేదలకు ప్రాధాన్యం ఇవ్వడం. పేదవాడి బతుకుకు అండగా ఉంటేనే ప్రభుత్వం తాలూకూ నిజమైన అభివృద్ధిని చూస్తామన్న సిద్ధాంతాన్ని గౌరవ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నమ్మారు. కనుకనే, పేదలకు ప్రాధాన్యమిస్తూ నాలుగేళ్ల ప్రభుత్వ కాలంలో రూ.2.31 లక్షల కోట్లు డీబీటీ ద్వారా అందించారు. ఈ విధంగా సీఎం వైయ‌స్ జగన్‌ దళితబంధువు అవుతారు. ఈ ప్రక్రియలో చంద్రబాబు హయాంలో ఉన్నట్లు జన్మభూమి కమిటీలు లాంటి దళారులు లేరు. నావోడు.. పరాయి పార్టీకి చెందినోడనే తారతమ్యం లేకుండా అంతా పారదర్శకంగా లబ్ధిని అందించే ప్రభుత్వం వైయ‌స్‌ఆర్‌ సీపీది అని మేం గర్వంగా చెప్పుకుంటున్నాం. ఇక, గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా 1.5 లక్షల శాశ్వత ఉద్యోగాలు ఇచ్చిన మేటి ప్రభుత్వం మాది. ఏపీపీఎస్సీ ద్వారా మెరిటోరియస్‌ పద్ధతిన వారికి ఉద్యోగాలు కల్పిస్తే.. ప్రయోజకుల్లో దాదాపు 62 శాతం మంది దళితులే ఉన్నారు. అదే గత ప్రభుత్వాలు ఎస్సీలకు ఉద్యోగాలు కల్పించడంలో ఏం చేశారు..? కేవలం 18 శాతమే ఎస్సీలకు కేటాయించి.. మిగతావన్నీ అగ్రకులస్తులకు కట్టబెట్టేవారు. అలాంటిది, గౌరవ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ తీసుకున్న సంకల్పంతో 62 శాతం మంది దళిత యువత ఉద్యోగాలు పొందారు. ఈ విధంగా వైయ‌స్‌ జగన్‌ దళిత బంధువు అవుతారు. ఇది నాల్గో పాయింట్‌గా గుర్తుపెట్టుకోవాలని రామోజీకి చెబుతున్నాను. 

దళితుల పిల్లలకు ఇంగ్లీషు విద్యను అందిస్తూ..
అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం అమలు చేసి.. పేదోడి బిడ్డ కూడా ఇంగ్లీషు నేర్చుకోవాలని వైయ‌స్‌ జగన్‌ తలంపు చేశారు. ఓ మహానుభావుడు చెప్పినట్టు ‘లింక్‌ ఇన్‌ లాంగ్వేజ్‌ టూ ద గ్లోబ్‌’ అన్నవిధంగా దళిత విద్యార్థులు చిన్నతనం నుంచే ఇంగ్లీషు మీడియంలో చదివితే విదేశాల్లో కూడా భవిష్యత్‌ ఉద్యోగవకాశాలు పొందవచ్చని వైయ‌స్‌ జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ చెప్పినట్లుగా..  ఇంగ్లీషు భాష నేర్చుకున్న విద్యావంతునికి పులి పాలు తాగినంత శక్తి ఉంటుంది.. అన్న సూత్రాన్ని సీఎం వైయ‌స్‌ జగన్‌ ఆదర్శంగా తీసుకున్నారు. ఆమేరకే పేద దళిత బిడ్డలకు ఇంగ్లీషు విద్య ప్రాధాన్యాన్ని గుర్తించారు. దానికి ఈ చంద్రబాబు అండ్‌ కో ఏం చేసింది..? ఎట్టి పరిస్థితుల్లో పేదల పిల్లలు ఇంగ్లీషు భాషలో చదవరాదని హైకోర్టు మెట్లు ఎక్కింది. ఇది ఐదో పాయింట్‌గా రామోజీ గుర్తించాలి. 

సంక్షేమాంధ్రగా కేంద్రమే మెచ్చుకుంది
ఇటీవల కేంద్రప్రభుత్వం ఒక సర్వే చేసి ఆంధ్రప్రదేశ్‌ను గుర్తించి మెచ్చుకుంది. దేశవ్యాప్తంగా ఒక ఐదులక్షల కుటుంబాల్ని ఆర్థికంగా, సామాజికంగా అన్నివిధాలుగా సంక్షేమ పథకాల ద్వారా మెరుగైన స్థితికి తెచ్చిన రాష్ట్రప్రభుత్వం ఏదైనా ఉందంటే.. అది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమేనని కేంద్రమే గుర్తించింది. ఇది ఆరో పాయింట్‌గా రామోజీ గుర్తించాల్సిందే. మరి, ఈ పాయింట్‌ లను పరిగణలోకి తీసుకుని దేశంలోని ప్రధానితో పాటు మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ఇక్కడున్న చంద్రబాబును మీరెందుకు ఈ విధమైన సంక్షేమాన్ని పేదలకివ్వలేదని అడగొచ్చు కదా.? లేదా.. వార్తల రూపంలో ప్రశ్నించవచ్చు కదా..? 

31 లక్షల ఇళ్లస్థలాల లబ్ధిదారుల్లో దళితులే అధికం
నిలువ నీడలేక, సొంతిల్లు కట్టుకోవడమనే కలను నెరవేర్చుకోలేక అల్లాడిన పేద అక్కచెల్లెమ్మలకు తోడబుట్టిన వాడిలా సీఎం వైయ‌స్ జగన్‌ రాష్ట్రంలో 31 లక్షల ఇళ్ల స్థలాలిచ్చారు. వాటిల్లో 22 లక్షల గృహాలు కూడా అక్కచెల్లెమ్మల పేరుతోనే నిర్మిస్తున్నారు. మరి, ఆ లబ్ధిదారుల్లో దళిత కుటుంబాలే అధికంగా ఉన్నాయి. ఈ విధంగా వైయ‌స్ జగన్‌ దళిత బంధువు అవుతారు. 

125 అడుగుల ఎత్తులో అంబేద్కర్‌ మహాశయుని విగ్రహం
దళితుల ఆత్మగౌరవం, ప్రశ్నించేతత్వానికి నిలువెత్తు మార్గదర్శి బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ 125 అడుగుల విగ్రహాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడ నడిబొడ్డులో ఏర్పాటు చేస్తున్నారు. మీ ఫిల్మ్‌సిటీలో ఉన్న ఆరంతస్తుల మేడపైకి ఎక్కి చూసినా.. నిలువెత్తు ఆత్మగౌరవంలా మా అంబేద్కర్‌ కనిపిస్తారు. మరి, నీ చంద్రబాబు ఏనాడైనా ఇలాంటి మంచి ఆలోచన చేశాడా..? మీరు పచ్చళ్లు అమ్ముకుంటూ జర్నలిజంను కూడా అలానే తయారు చేయాలనుకున్నారు.. కూరగాయలు పండించి అమ్ముకోవాలనుకున్నారు గానీ.. ఏనాడైనా బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం పెట్టాలనుకున్నారా..? అదే మా వైయ‌స్‌ జగన్‌ సమర్ధత. నీతి, నిజాయితి అని గర్వంగా చెప్పుకుంటున్నాం. ఆయన దళితుల బంధువు అని చెప్పడానికి ఇన్ని అర్హతలున్నాయి. చంద్రబాబు, రామోజీరావుకు ఏ అర్హత ఉంది..? అని ప్రశ్నిస్తున్నాను. 

దళితులు కళ్లుతెరిస్తే ఫిల్మ్‌సిటీని దున్నేస్తారు
మీ కుటుంబాల్లో దళితులతో వివాహాలు జరిగిన దాఖలాల్లేవు. నువ్వు భుజాలపై మోసే చంద్రబాబు హయాంలో దళితులకు జరిగిన మేలు లేదు. సంక్షేమం పేరుతో దళారుల్లేకుండా ఏ ఒక్క దళిత కుటుంబానికి చిల్లిగవ్వ ఇవ్వలేదు. అలాంటిది, ఈరోజు ఏపీలో ఎస్సీ, ఎస్టీలంతా ఆత్మగౌరవంతో బతుకుతుంటే.. సీఎం వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డిని దేవుడిగా ఆరాదిస్తుంటే నీకు, చంద్రబాబు అండ్‌ కో కు కన్ను కుట్టిపోతుంది. నిజానికి దళితుల అసైన్డ్‌భూముల్ని ఆక్రమించుకుని రామోజీ ఫిల్మ్‌సిటీ కట్టుకున్నావు కదా..? ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిలా తెలంగాణలో కూడా అసైన్డ్‌భూముల్ని దళితులకు తిరిగిచ్చేయాలని నిర్ణయిస్తే.. అప్పుడు దళితులు కన్నెర్ర చేస్తే నీ రామోజీ ఫిల్మ్‌సిటీని లక్ష నాగళ్లుతో దున్నేయడం ఖాయమని హెచ్చరిస్తున్నాను. 

తాజా వీడియోలు

Back to Top