వైభవంగా శ్రీ‌వారి బ్రహ్మోత్సవాలు

టీటీడీ చైర్మ‌న్‌ వైవీ సుబ్బారెడ్డి  

సాయంత్రం ధ్వజావరోహణంతో ముగియనున్న బ్రహ్మోత్సవాలు

తిరుమ‌ల‌:  కోవిడ్ కారణంగా ఈసారి తిరుమ‌ల తిరుప‌తి బ్ర‌హ్మోత్స‌వాలు ఏకాంతంగా నిర్వహించినా, ఎక్కడ లోపం లేకుండా వైభవంగా నిర్వహించామని టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన ఆది‌వారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య శ్రీ‌వారి ఆల‌యంలోని ‘అయినా మ‌హ‌ల్’ ముఖ మండ‌పంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం శాస్త్రో‌క్తంగా నిర్వహించారు. అనంత‌రం ‘అయినా మ‌హ‌ల్’ ముఖ మండ‌పం ప్రాంగ‌ణంలో ప్ర‌త్యేకంగా నిర్మించిన చిన్న పుష్క‌రిణిలో ఉద‌యం 8.15 గంట‌ల‌కు సుదర్శన చక్రాన్ని పవిత్ర పుష్కరిణీ జలంలో ముంచి స్నానం చేయించారు.  
ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ఏకాంతంగా నిర్వహించామని తెలిపారు. చక్రస్నానం ఏకాంతంగానే నిర్వహించామని చెప్పారు. సాయంత్రం ధ్వజాఅవరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.   ఈ కార్యక్రమాల్లో టీటీడీ  కార్యనిర్వహణాధికారి అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అద‌న‌పు ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి, ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు శేఖ‌ర్ ‌రెడ్డి, డా.నిశ్చిత‌, శివ‌కుమార్‌, డీపీ అనంత, అర్బ‌న్ ఎస్పీ ర‌మేష్‌రెడ్డి, సిఇ ర‌మేష్‌ రెడ్డి పాల్గొన్నారు.

 

Back to Top