శ్రీకాకుళం: కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను వ్యతిరేకించే వారు ఉత్తరాంధ్ర పాలిట ద్రోహులు గానే పరిగణించాల్సి ఉంటుందని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. వీరికి ప్రజా క్షేత్రంలోనే, ఉత్తరాంధ్ర ప్రజానీకం తగిన గుణపాఠం చెప్పక తప్పదని ఆయన హెచ్చరించారు. అభివృద్ధి వికేంద్రీకరణ, రాజధాని వికేంద్రీకరణ వంటి చర్యల ద్వారా పలు రాష్ట్రాలు అభివృద్ధిలో, ప్రగతిపథంలో పయనిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ఆదివారం శ్రీకాకుళంలోని రహదారులు, భవనాల శాఖ అతిథిగృహంలో సీతారాం మీడియాతో మాట్లాడారు.
రాజస్థాన్, కర్ణాటక, కేరళ, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వికేంద్రీకరణ వలన అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధికి నోచుకున్నాయన్నారు.ఆయా రాష్ట్రాల్లో రాజధానులు, హైకోర్టు లు, ఒకే చోట లేవనే విషయాన్ని విపక్షాలు తెలుసుకోవాలని కోరారు. కేంద్రీకృత అభివృధ్ధి ద్వారా వేర్పాటువాద ఉద్యమాలు పుట్టుకు వస్తున్నాయని పేర్కొన్నారు.గతంలో మద్రాస్, హైదరాబాద్ వంటి నగరాల అభివృద్ధి వలన రాష్ట్రాల విభజన తలెత్తిన పరిణామాలపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా గుర్తెరగాలని సూచించారు.మద్రాసు నుండి ఆంధ్ర రాష్ట్ర విభజన సమయంలో జరిగిన శ్రీ బాగ్ ఒప్పందంలో కూడా వికేంద్రీకరణ ప్రతిపాదన చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా కర్నూలులో రాజధాని, గుంటూరులో హైకోర్టు, విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రతిపాదనలు జరిగాయని గుర్తు చేశారు. 2014లో జరిగిన రాష్ట్ర విభజన సమయంలో ఏర్పటైన శివరామకృష్ణన్ కమిటీ కూడా భవిష్యత్తులో వేర్పాటువాదం తలెత్తకుండా ఉండేందుకు అనేక ప్రతిపాదనలు చేసిందన్నారు. ముఖ్యంగా అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెండటం లక్ష్యంగా రాజధాని ఏర్పాటు చేయాలని సూచించిందని తెలిపారు. అమరావతి లో లక్ష కోట్లతో ధన వ్యయం ద్వారా రాజధాని నిర్మాణం చేపట్టకూడదని స్పష్టం చేసిందన్నారు. 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ రాజధాని గా కొనసాగించాలని చెప్పినప్పటికీ, రాత్రికి రాత్రే పారిపోయి వచ్చి చంద్రబాబు అమరావతిని రాజధాని గా చేశారని స్పీకర్ మండిపడ్డారు.
మెట్రోపాలిటిన్ నగరాలకు దీటుగా ఉన్న విశాఖపట్నం ప్రాంతాన్ని రాజధానిగా అప్పటి ప్రభుత్వం ప్రకటించి ఉండాల్సిందన్నారు.దీని వలన వనరులు సృష్టిoచేoదుకు అవకాశాలు కలిగి ఉండేవన్నారు. ఒకే చోట సంపద, శ్రమ, మేధస్సు,విజ్ఞానం వంటివి వికేంద్రీకృతమై,అభివృద్ధి చెందితే,వేర్పాటువాద శక్తులు విజృంభించక తప్పదని ఆయన చెప్పారు.హైదరాబాద్ మహానగరాన్ని కొన్ని దశాబ్దాల పాటు గా అభివృద్ధి పరచడంలో ఆంధ్ర ప్రజానీకo కీలకంగా నిలిచారన్నారు.హైదరాబాద్ మినహాయిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి లేకపోవడం వల్లనే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ప్రారంభమైందన్నారు. ఇదే సమస్యను గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు వికేంద్రీకరణ అంశాన్ని తెర పైకి తీసుకువచ్చారన్నారు.దీనివలన అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయన్నారు.దీన్ని రాజకీయ కోణంలో చూడటం విపక్షాలకు తగదన్నారు. 2014 మునుపు, ఆ తరువాత రాష్ట్రం...అనే రెండు భాగాలుగా పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, అభివృద్ధి ఎంత భయానకంగా తిరోగమనంలో ఉందో వాస్తవికతతో చూడాలన్నారు.2014 అనంతరం రాష్ట్ర విభజన జరిగిన తరువాత అమరావతిని రాజధానిగా చేసి, అదే ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేయాలనుకోవడం అవివేకమైనదన్నారు.గతంలో మద్రాస్, హైదరాబాద్ లను పూర్తిగా అభివృద్ధి పరిచి,నష్టపోయిన ఆంధ్రుల యొక్క. ఆర్తనాదాలు ప్రతిపక్షాలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.29 గ్రామాలు అభివృద్ధి చెందడమే ఆంధ్ర ప్రదేశ్ యొక్క అసలైన అభివృద్ధి కాదన్నారు. 26 జిల్లాలు సమాంతరంగా అభివృద్ధి చెందేందుకు మూడు రాజధానులు ఏర్పాటు చక్కని పరిష్కారమని అన్నారు.
భవన కార్మిక రంగంలో దేశంలో ప్రతి నగరంలో ప్రతి పదిమందిలో ముగ్గురు ఉత్తరాంధ్రకు చెందిన కార్మికులు ఉండటం బాధాకరమన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని మూడు రాజధానులు అంశానికి ప్రతీ ఒక్క ఆంధ్రుడు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.దీని వలన ఉత్తరాంధ్ర జిల్లాలు పూర్తిస్థాయిలో అభివృద్ధి బాట పడతాయన్నారు. సుదూర ప్రాంతాల్లో బ్రతుకుతెరువు కోసం వెళ్లిన ఉత్తరాంధ్ర వాసులు తమ స్వస్థలాలకు చేరుకొని, పిల్లాపాపలతో జీవనం సాగించే వీలుందన్నారు.
ఉనికిని కాపాడుకునేoదుకే పవన్ కళ్యాణ్ పాట్లు
ప్రతీ రాజకీయ పార్టీకి నిర్దిష్టమైన లక్ష్యాలు, విధానాలు ఉంటాయని,వాటి సాధన కోసం ప్రజా క్షేత్రంలో ప్రజాభిమానం పొందేందుకు ప్రయత్నం చేయాల్సింది పోయి గందరగోళం సృష్టించేలా వ్యవహరించడం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తగదని స్పీకర్ అన్నారు.అయోమయం రాజకీయాలకు జనసేన పార్టీ అడ్రెస్ గా నిలిచిందని ఆయన ఎద్దేవా చేశారు. అవాకులు,చెవాకులు మాట్లాడటం తగదన్నారు.విమర్శలు అనేవి ప్రభుత్వ విధానాలు పై ఉండాలి కానీ, వ్యక్తులు పైన ఉండకూడదని అన్నారు.తెలుగుదేశం పార్టీ కి మేలు చేకూర్చేందుకే పవన్ కళ్యాణ్ పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు.
సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డ గారికి అఖిలాంధ్రుల మద్దతు ఉన్నంత కాలం.. పవన్ కళ్యాణ్ వంటి ఎంత మంది నేతలు వచ్చినా... వైయస్ఆర్ సీపీ కి ఏమి కాదని తేల్చి చెప్పారు.