రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధ‌న‌కు పోరాటం అవ‌స‌రం

తిరుపతి ఎంపీ గురుమూర్తి పిలుపు

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తిరుపతిలో రౌండ్‌టేబుల్ స‌మావేశం

  తిరుపతి:  రాయలసీమకు తాగునీరు, సాగునీటి భద్రత కల్పించాలంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధన కోసం సమిష్టి పోరాటం తప్పనిసరిగా అవసరమని తిరుపతి ఎంపీ గురుమూర్తి స్పష్టం చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తిరుపతి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో, రాయలసీమ అధ్యయనాలు సంస్థ అధ్యక్షుడు భూమన సుబ్రమణ్యం రెడ్డి నేతృత్వంలో తిరుపతిలో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ, నీరు, ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్లే రాయలసీమ ప్రాంతం నుంచి లక్షలాది మంది గల్ఫ్ దేశాలకు వలస వెళ్లాల్సి వచ్చిందన్నారు. భవిష్యత్తులో నీటి కొరత కారణంగా ఘర్షణలు జరుగుతాయని నిపుణులు ముందే హెచ్చరించారని గుర్తు చేశారు. రాయలసీమ అభివృద్ధికి నీటే కీలకమని, ఆ దిశగా ఎత్తిపోతల పథకం అత్యంత అవసరమన్నారు. నిజమైన విజనరీలు వైయ‌స్ రాజశేఖర్ రెడ్డి, వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డేనని పేర్కొంటూ, భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వారు తీసుకున్న నిర్ణయాలే రాయలసీమకు మేలు చేశాయన్నారు. ప్రస్తుతం పాలకులు వ్యక్తిగత లాభాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై రాజకీయాలకు అతీతంగా అందరూ ఏకమై పోరాటం చేయాలని, ఈ అంశాన్ని పార్లమెంట్‌లో కూడా బలంగా లేవనెత్తుతామని ఎంపీ గురుమూర్తి స్పష్టం చేశారు.

భూమన సుబ్రమణ్యం రెడ్డి మాట్లాడుతూ, శ్రీశైలం రిజర్వాయర్‌ సామర్థ్యం పూడిక వల్ల 302 టీఎంసీల నుంచి 202 టీఎంసీలకు పడిపోయిందని తెలిపారు. జీవో–69ను చంద్రబాబు నాయుడు చీకటి జీవోగా అభివర్ణిస్తూ, 834 అడుగుల వద్ద నీరు ఉన్నా పోతిరెడ్డిపాడుకు చుక్క నీరు రాకుండా చేశారని విమర్శించారు. వైయ‌స్ రాజశేఖర్ రెడ్డి 854 అడుగుల జీవో తీసుకువచ్చినా రాజకీయాల కారణంగా దాన్ని నిలిపివేశారని అన్నారు. వైయ‌స్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాకే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టి రూ.7 వేల కోట్ల నిధులు కేటాయించి ఖర్చు చేశారని గుర్తు చేశారు. 

ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం మాట్లాడుతూ, వైయ‌స్ కుటుంబమే రాయలసీమకు ఎక్కువ మేలు చేసిందని, కూటమి ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం రాయలసీమకు తీరని అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. సాగునీరు, తాగునీటి హక్కుల కోసం ప్రజలు ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ చర్చా కార్యక్రమంలో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పునఃప్రారంభించాలనే డిమాండ్‌తో పాటు, ప్రాంతానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగించాలని నేతలు పిలుపునిచ్చారు.

Back to Top