విశాఖ జిల్లా: పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని పెందుర్తి జంక్షన్ వద్ద “రోడ్డు వైడెనింగ్” పేరిట దివంగత ముఖ్యమంత్రి, మహానేత డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని తొలగించి కాలువలో పడేయడంపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల ఆరాధ్య నేత విగ్రహాన్ని ఈ విధంగా అవమానకరంగా తొలగించడం ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసే దుర్మార్గమైన చర్యగా పార్టీ ఖండించింది. ఈ ఘటనకు నిరసనగా పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్త అన్నపురెడ్డి అదీప్ రాజు ఆధ్వర్యంలో వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెందుర్తి జంక్షన్‌లో ధర్నా నిర్వహించారు. మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని తొలగించడం ద్వారా ప్రజల గుండెల్లో చెరగని స్థానం సంపాదించిన నాయకుడిని అవమానించినట్లేనని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించడం మరింత ఆందోళనకరమని పార్టీ నేతలు విమర్శించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన వ్యక్తం చేయడం ప్రతి పౌరుడి హక్కు కాగా, దాన్ని అణిచివేయడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాసినట్లేనని వారు పేర్కొన్నారు. తక్షణమే డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని యథాస్థానంలో పునఃస్థాపించడంతో పాటు, ఈ ఘటనకు బాధ్యులైన జివిఎంసీ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ప్రభుత్వం ప్రజల భావోద్వేగాలను గౌరవించి, ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని పార్టీ నాయకులు కోరారు.