అరటి రైతుల సమస్యలపై స్పందించిన ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి

టిష్యూ కల్చర్ అరటి పంటను పరిశీలించి కంపెనీ ప్రతినిధులతో చర్చ

వైయ‌స్ఆర్ జిల్లా: అరటి పంట దిగుబడి సరిగా రాక తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్న రైతుల విజ్ఞప్తి మేరకు పార్లమెంట్ సభ్యులు వైయస్ అవినాష్ రెడ్డి టిష్యూ కల్చర్ అరటి పంటను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పంటలో ఏర్పడిన సమస్యలు, దిగుబడి తగ్గడానికి కారణాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులు టిష్యూ కల్చర్ అరటి మొక్కల నాణ్యతపై, దిగుబడిలో తేడాలు వస్తున్న తీరుపై ఎంపీకి వివరించారు. ఇందుకు స్పందించిన వైయస్ అవినాష్ రెడ్డి .. సంబంధిత టిష్యూ కల్చర్ కంపెనీ ప్రతినిధులతో ఫోన్ ద్వారా మాట్లాడి, రైతులకు జరిగిన నష్టంపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని, భవిష్యత్‌లో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే రైతులకు పరిహారం చెల్లించే అంశాన్ని కూడా పరిశీలించాలని కంపెనీ ప్రతినిధులకు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, రైతులు నష్టపోయే పరిస్థితి వస్తే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ రైతుల పక్షానే నిలుస్తుందని భరోసా ఇచ్చారు. వ్యవసాయ రంగంలో కొత్త పద్ధతులు ప్రవేశపెడుతున్నప్పుడు రైతులకు పూర్తి అవగాహన కల్పించడం, నాణ్యమైన మొక్కలు అందించడం అత్యంత కీలకమని పేర్కొన్నారు. అంతకుముందు ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి నియోజకవర్గ పరిధిలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతుల సమస్యలపై ప్రత్యేకంగా స్పందించడం పట్ల రైతులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారానికి అవసరమైన అన్ని స్థాయిల్లో తన వంతు కృషి చేస్తానని ఎంపీ అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు.

Back to Top