మైనార్టీలపై జరుగుతున్న దాడులను ప్రజలు గమనిస్తున్నారు

వైయ‌స్ఆర్‌సీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు వి. ఖాదర్ బాషా, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ హఫీజ్ ఖాన్

బాపట్ల: రాష్ట్రంలో మైనార్టీలపై జరుగుతున్న దాడులు, వేధింపులను ప్రజలంతా నిశితంగా గమనిస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు వి. ఖాదర్ బాషా, వర్కింగ్ ప్రెసిడెంట్ హఫీజ్ ఖాన్ అన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను లక్ష్యంగా చేసుకుని వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలపై దాడులు పెరుగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లాలో నిర్వహించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర మైనార్టీ అధ్యక్షులు వి. ఖాదర్ భాషా, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ హఫీజ్ ఖాన్ పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ డిప్యూటీ స్పీకర్, బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ శ్రీ కోన రఘుపతి, వేమూరు నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ అశోక్ బాబు హాజరై పార్టీ బలోపేతంపై కీలక సూచనలు చేశారు.

ఈ సందర్భంగా వి. ఖాదర్ భాషా, హఫీజ్ ఖాన్ సంయుక్తంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న కూటమి ప్రభుత్వ పాలన ప్రజావ్యతిరేకంగా మారిందని తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను లక్ష్యంగా చేసుకుని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల కోసం పనిచేస్తున్న కార్యకర్తలపై దాడులు, వేధింపులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితులను రాష్ట్ర ప్రజానీకం నిశితంగా గమనిస్తోందని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించి, ప్రజలపై భారం మోపే విధానాలతో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్యంగా ప్రశ్నిస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అణిచివేయడానికి జరుగుతున్న ప్రయత్నాలు తీవ్రంగా ఖండించదగినవని అన్నారు. సమావేశంలో పాల్గొన్న నాయకులందరూ ఏకగ్రీవంగా ఒక విషయాన్ని స్పష్టం చేశారని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే, ప్రజల సంక్షేమాన్ని నిజాయితీగా అమలు చేసిన జనహితనేత వైయస్ జగన్ మోహ‌న్ రెడ్డి నాయకత్వమే అవసరమని అభిప్రాయపడ్డారని చెప్పారు. గత ఐదు సంవత్సరాల జగనన్న పాలనలో మైనార్టీల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారని, మైనార్టీ సంక్షేమం కోసం రూ.23,500 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేసిన ఏకైక నాయకుడు జగనన్నేనని గుర్తు చేశారు.

ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ఆస్తులపై కన్నేసి, మైనార్టీల హక్కులను దెబ్బతీయడానికి ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో మైనార్టీ సోదరులు, సోదరీమణులు అప్రమత్తంగా ఉండాలని, తమ హక్కులు, ఆస్తులను కాపాడుకోవాలంటే ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో జగనన్నను మళ్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని, ఈ లక్ష్య సాధన కోసం ఏ త్యాగానికైనా, ఏ పోరాటానికైనా తాము సిద్ధంగా ఉన్నామని వి. ఖాదర్ భాషా, హఫీజ్ ఖాన్ స్పష్టం చేశారు. పార్టీ బలోపేతంలో ప్రతి కార్యకర్త పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు.

Back to Top