ఐక్యంగా ముందుకు సాగుదాం…

వైయ‌స్ఆర్‌సీపీ జెండాను మరోమారు ఎగరవేద్దాం

వైయ‌స్ఆర్‌సీపీ నేతలు బొత్స‌, క‌న్న‌బాబు పిలుపు

విజయనగరం : ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేయాలని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని స్పష్టం చేశారు. బుధవారం విజయనగరంలోని జే-కన్వెన్షన్ మైదానంలో వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ఆధ్వర్యంలో జిల్లా విస్తృతస్థాయి పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రతిపక్ష నాయకులు, మాజీ మంత్రి బొత్సా సత్యనారాయణ, మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో-ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి, ఉత్తరాంధ్ర జిల్లాల జోన్-1 కో-ఆర్డినేటర్ హర్షవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, సచివాలయ, గ్రామ స్థాయి కమిటీల నియామకంపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ‘రెడ్‌బుక్ రాజ్యాంగం’ నడుస్తోందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసులను అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అక్రమ కేసులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.  అధికారంలోకి వచ్చిన వెంటనే కార్యకర్తలపై నమోదు చేసిన అక్రమ కేసులను తొలగిస్తామని, తప్పుడు కేసులు పెట్టిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నేతలు స్పష్టం చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఇప్పటికే రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫిబ్రవరి 15లోగా గ్రామ మరియు సచివాలయ స్థాయి కమిటీల నియామకాన్ని పూర్తి చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. పార్టీ కోసం నిజాయితీగా పనిచేసే ఉత్సాహవంతులకే కమిటీల్లో అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు గడిచినా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులతో భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, అయితే వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు ఎవ్వరూ వెనకడుగు వేయాల్సిన అవసరం లేదని తెలిపారు. తమకు అధికారం కంటే ప్రజల సంక్షేమమే ముఖ్యమని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినప్పటికీ ప్రజల పక్షాన అనేక పోరాటాలు చేసినట్లు గుర్తు చేస్తూ, రానున్న రోజుల్లో వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తకు భవిష్యత్తులో తగిన గుర్తింపు ఉంటుందని, అందరికీ ఐడీ కార్డులు అందజేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ, రాష్ట్ర వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు), జిల్లా పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఎమ్మెల్సీలు, మేయర్, పార్లమెంట్ పరిశీలకులు, అనుబంధ విభాగాల నాయకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ శ్రేణుల ఉత్సాహంతో ఈ సమావేశం విజయవంతంగా ముగిసింది.

Back to Top