పిఠాపురం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్.జగన్ పర్యటనల్లో మరోసారి భద్రతాలోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. కాకినాడ జిల్లా పిఠాపురం పర్యటనలో వైయస్.జగన్ పర్యటనలో మరోసారి వెల్లడైంది. ఇంతకుముందు జిల్లాల పర్యటనలతో ఇలాంటి పరిస్థితే తలెత్తింది. మాజీ సీఎంకు కల్పిస్తున్న భద్రత సరిపోలేదని ఇదివరకే పలుమార్లు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తంచేసింది. కక్షపూరితంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే భద్రతను కుదించినవైనంపై పలుమార్లు గొంతెత్తింది. వైయస్.జగన్ పర్యటనల్లో భద్రతాలోపాలు బయటపడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని పలుమార్లు వైయస్ఆర్ సీపీ నేతలు మండిపడ్డారు. తాజాగా పిఠాపురం పర్యటనలో మాధవపురం వద్ద నేరుగా వైయస్. జగన్ ప్రయాణిస్తున్న కార్ పైకి ఎక్కి కొందరు యువకులు రావడం కలకలం రేపింది. ఒక్కసారిగా చుట్టూఉన్నవారు ఉలిక్కపడ్డారు. అలాగే ఈ ఉదయం హెలికాప్టర్ ల్యాండ్ అయిన సందర్భంలో కూడా హెలిపాడ్ కిక్కిరిసిపోయింది. ఇక్కడ తగినంత భధ్రతను పోలీసులు కల్పించలేదు. అభిమానుల ముసుగులో ఏదైనా జరగవచ్చనే ఆందోళనను పార్టీ నేతలు వ్యక్తంచేస్తున్నారు. గతంలో రెండుసార్లు వైయస్.జగన్‌గారిపై జరిగిన దాడులను ఈ సందర్భంగా గుర్తుకు తెస్తున్నారు.