తాడేపల్లి: ప‌్రతిపక్ష నేత చంద్రబాబు, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ డీఎన్‌ఏ ఒక్కటేనని వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయాల పట్ల ఎస్‌ఈసీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, నిమ్మగడ్డ ఎస్‌ఈసీగా ఉండటం రాష్ట్రం ఖర్మ అని దుయ్యబట్టారు. తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఇప్పుడు జరనున్న పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో తనకు దఖలు పడిన అధికారాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దుర్వినియోగం చేస్తున్నారు. నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన తన ధర్మాన్ని ఎస్‌ఈసీ ఎప్పుడో గాలికి వదిలేశారు. ఎస్‌ఈసీ పూర్తిగా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వం నిర్ణయాల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, గత మార్చి నుంచి జరుగుతున్న పరిణామాలే తెలియజేస్తున్నాయ్. గత కొద్దికాలంగా చంద్రబాబు చేస్తున్న కుట్రలో భాగంగా ఒక కీలుబొమ్మగా మారి, మరింత ముందుకు వెళ్లి పక్షపాతం స్టేజి దాటి తాను ప్రధాన పాత్రధారిగా, సూత్రధారిగా భావించాల్సిన పరిస్థితి వస్తోంది.
చంద్రబాబు గత 40 ఏళ్లుగా మ్యానిప్యులేషన్స్‌కు, మేనేజ్‌మెంట్‌కు, వ్యవస్థలను వక్రమార్గం పట్టించటానికి, వ్యవస్థలను తన స్వార్థ ప్రయోజనాలకు అనుగుణంగా వాడుకున్నారు. తాజాగా ఎస్‌ఈసీని కూడా చంద్రబాబు వేదికగా చేసుకున్నారు. తెర వెనుక నుంచి కొంచెం కొంచెంగా వ్యవహరిస్తూ.. చివరికి గత మార్చిలో వారి అసలు రంగు బయటపడింది. చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికల కమిషనర్ కీలుబొమ్మగా వ్యవహరిస్తూ రావటం దురదృష్టకరం. గత రెండు, మూడు రోజులుగా రాజకీయాలు దాటి, అధికారుల మీద కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ దుందుడుకు దాడి మొదలుపెట్టారు. రిటైర్డ్ బ్యూరోక్రాట్ అయిన నిమ్మగడ్డ రమేశ్ వ్యవహరించే తీరు ఫ్యాక్షనిస్ట్ ధోరణిని తలపిస్తోందని గట్టిగా భావిస్తున్నాం.
ఇద్దరు సీనియర్ అధికారుల పట్ల నిమ్మగడ్డ రాసిన రాతలు కానీ, వాడిన భాష సక్రమంగా లేదు. గతంలో తాను కూడా ఓ అధికారిగా ఉన్నారు. ఆయన వాడుతున్న భాష అసభ్యతకు తార్కాణంగా కనిపిస్తోంది. అది వాస్తవానికి ఎస్‌ఈసీ పరిధి కాదు. వ్యక్తిగత కక్ష ఉందనుకోవటానికి లేదు. కేవలం అధికారులను, ఉద్యోగులను టెర్రరైజ్ చేయాలని ఎస్‌ఈసీ అనుకుంటున్నారు. అధికార యంత్రాంగాన్ని టెర్రరైజ్ చేసి తద్వారా వాళ్ల బాధ్యతల్లో సక్రమంగా నిర్వర్తించలేని పరిస్థితి క్రియేట్ చేసి టీడీపీకి ఎలా ఉపయోగపడాలో ఆలోచిస్తున్న పరిస్థితి గమనిస్తున్నాం. వారు ఏపని చేసినా ఏం కొంపలు అంటుకుంటాయో అని భయపడే పరిస్థితి తేవాలని నిమ్మగడ్డ ప్రయత్నిస్తున్నారు.
నిమ్మగడ్డ ప్రభుత్వానికి రాసిన లేఖలు అన్నీ అబద్ధాలు, అసత్యాలే. నిమ్మగడ్డ రాసిన రెండు మూడు ప్రొసీడింగ్స్ చూస్తే ఆయన ముందు రాసినవి, తర్వాత మార్చినవీ అబద్ధమే. అవి కమిషన్ స్థాయిని అటుంచి గూడపుఠాణిలో భాగంగా అవతల వారిపై ఎత్తులకు పైఎత్తులు వేయాలనే చంద్రబాబు రాజకీయమే ఎస్‌ఈసీ రాతల్లో కనపడుతోంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాగానే ఎస్‌ఈసీ సీఎస్‌కు ఓ లేఖ రాశారు. అందులోనూ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. కమిషన్ మొదటి దశ ఎన్నికలను రీషెడ్యూల్ చేస్తోందంటూ లేఖ రాశారు.
అప్పటికే గ్రామ పంచాయితీ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ వ్యాక్సిన్ చేస్తోంది. దాని తర్వాత ఎన్నికలకు వెళ్లాలని అనుకుంటోందని చెబితే ఎస్‌ఈసీ ఒప్పుకోలేదు. సహజంగానే న్యాయస్థానాలకు వెళ్లారు. సింగిల్ బెంచ్ ప్రభుత్వ వాదనలు అంగీకరించింది. డివిజన్ బెంచ్ లేదు.. లేదని ఎటూకాకుండా చెప్పింది. దాంతో సుప్రీంకోర్టుకు వెళ్లటం జరిగింది. దేశంలో చట్టాలు అమలు చేసే ప్రభుత్వాలకు అయినా, ఏ సంస్థలకు అయినా ఆఖరికి కోర్టులు చెప్పేదాని ప్రకారం వెళ్లాల్సిందే. ప్రభుత్వానికి అభిప్రాయం ఉండటానికి వీల్లేదంటే దానికి ఏమీ చేయలేం. అవతల (ఎస్‌ఈసీ) డిక్టేటర్ లా ప్రవర్తిస్తున్నాడు. ఇందులో రహస్యం లేదు. సుప్రీం తీర్పు వచ్చింది. దాని మీద ఎస్‌ఈసీ సీఎస్ కు లేఖ రాస్తూ కొన్ని కామెంట్స్ చేశారు. అది తప్పు. ఇద్దరు కలెక్టర్లు, ఒక ఎస్పీని ఉద్దేశిస్తూ వాడిన భాష కూడా సక్రమంగా రాయలేదు. వాళ్లపై రిమార్క్ పెట్టేలా ఎస్‌ఈసీ చేశారు.
జి.కె.ద్వివేది, గిరిజా శంకర్, ఐఏఎస్‌లను 25.01.2021న మార్చేసి వేరే వారిని పెట్టమని ఎస్ఈసీనే మొదట లేఖ రాశారు. ప్రభుత్వం నుంచి పేర్లు ఎస్‌ఈసీకి వెళ్లాయి. కానీ మాకు సంబంధం లేదు, మీరు కావాలంటే చేసుకోండని మరో లేఖ ఎస్‌ఈసీ రాశారు. అసభ్యకరమైన భాషలో, తన పరిధిలో లేనివి అన్నీ ఇద్దరు ఐఏఎస్‌లకు అంటగడుతూ లేఖ రాయటం ఏంటి? ముందు అన్నమాటకు కట్టుబడి ప్రభుత్వంను కోరితే సరిపోయేది. ఎన్నికల విధుల్లో భాగంగా ట్రాన్స్‌ఫర్, సస్పెండ్ చేసే అధికారాలు ఎస్‌ఈసీకి ఉన్నాయి. అవి అందరికీ తెల్సినవే. సర్వీస్ రిజిస్ట్రర్‌లో ఎంటర్ చేయాలంటే డీఓపీటీకి రాయటం వీళ్లు ఆఫీసర్లుగా పనికిరారు అనటం అహంభావాన్ని సూచిస్తున్నాయి. అదే సమయంలో అంతకుముందు రాసిన లేఖలో ఎందుకు ఒప్పుకోలేదు. ఎలక్ట్రోరోల్స్ సంబంధించి ఎస్ఈసీ అబ్జర్వేషన్ ప్రకారం 2019 ఎన్నికల జాబితా ప్రకారం చేయాల్సి వస్తోందని అన్నారు. కానీ చట్టం ప్రకారం ఏ సంవత్సరంలో ఎన్నికలు జరిగితే.. ఆ సంవత్సరం జనవరి 1 క్వాలిఫైయింగ్ తేదిగా ఉంది.
ఎన్నికల ఓటర్ల జాబితా రూపొందించాల్సింది సీఈసీ. సీఈసీ వాళ్లు జనవరి 15-16 విడుదల చేస్తారు. 16న ఎలక్ట్రోరల్ రోల్స్ అడిగి తీసుకొని క్షేత్రస్థాయికి పంపించి, ఆ ప్రాసెస్ ప్రకారం ఓటర్ల జాబితా తయారు చేస్తారు. ఈ ప్రకారం చేయాలంటే నెలో, రెండు నెలలు పడుతుంది. దీన్ని తప్పించుకోవటానికి ఎవరి మీదనో బండ వేయాలని తనకున్న పవర్ ఎస్ఈసీకీకి గుర్తుకు వచ్చింది. ఒక వేటుకు రెండు దెబ్బలు తగులుతాయనే విధంగా ఎస్‌ఈసీ నిమ్మగడ్డ వ్యవహరించారు.
ద్వివేది, గిరిజా శంకర్ లు వారి పనులు వారు చేయటం లేదని ఎస్ఈసీ అంటేనే... దాని ప్రకారమే ప్రభుత్వం మరో జాబితా పంపించింది. ఆ తర్వాత, ఎస్ఈసీ మాట మార్చుతూ, కాదు.. కాదు.. నేను అలా అనలేదని ప్రొసీడింగ్స్ పంపించారు. ఆ ప్రొసీడింగ్స్‌లో కేసు ఎస్టాబ్లిష్ చేయటానికి, వాళ్లు ఆఫీసర్లుగా కాదు.. మామూలు వ్యక్తులుగా కూడా పనికిరారని డీఓపీటీకి, ప్రభుత్వానికి మెమో పంపించారు. దీనివల్ల ఎస్‌ఈసీకి లాభాలు ఉన్నాయ్. ఒకటేమో ఓటర్ల రోల్స్ జాబితా ఫెయిల్యూర్ అంతా ఈ ఇద్దరి అధికారుల మీద పడుతుంది, కోర్టులో కేసు వస్తే తాను తప్పించుకోవచ్చు. రెండోది ఉద్యోగుల్లో, ఆఫీసర్లలో టెర్రర్ క్రియేట్ చేయవచ్చు. మూడోది తాను సర్వాధికారిని అనే ఇంప్రెషన్ ఇచ్చి తను తప్పించుకొని పాత 2019 ఓటర్ల జాబితాతో ఎన్నికలు పూర్తి చేసుకోవచ్చు. తద్వారా చంద్రబాబు అప్పజెప్పిన డ్యూటీ ఏదైతే ఉందో దానిని తాను రిటైర్డ్ అయ్యేలోపు చెయ్యొచ్చు అనేది అతని దురాలోచన. మొత్తంమీద దుంపనాశనం చేసి గ్రామాల్లో, ప్రజల్లో చిచ్చు పెట్టి అధికారులను అభద్రతా భావంకు గురిచేసి, ప్రజల్ని కరోనా బారిన పడేసి చేతులు దులిపేసుకుని పోవాలని ఎస్ఈసీ అనుకుంటున్నారు. ఇంతటి బాధ్యతారాహిత్యం, కుట్రపూరితా స్వభావం నిమ్మగడ్డ, చంద్రబాబులకు ఒకేలా ఉంది. తన పరిధి ఏంటి.. తను వాడిన భాష ఏంటి?
చంద్రబాబులాంటి కుట్రలు ఏవైతే ఉంటాయో.. మిగిలిన అందరి మీద బురదచల్లి అవే దుర్మార్గపు ఆరోపణలు చేయటం ఎస్‌ఈసీ చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ఎన్నికలకు అడ్డంపడుతుందని, అధికారులు ప్రభుత్వం చెప్పినట్లు వింటున్నారు. అసలు ప్రజల్లో టీడీపీ గాలి విపరీతంగా ఉంది. ఈ ప్రభుత్వం (వైయస్‌ఆర్‌సీపీ) పై చేయి సాధించాలని చూస్తోంది. ఈ ప్రభుత్వానికి (వైయస్‌ఆర్‌సీపీకి) ఎన్నికలు అంటే భయం, వణుకు అనేది క్రియేట్ చేయటానికి ఎస్‌ఈసీ ఎన్ని తిప్పలు పడాలో అన్ని పడుతున్నారు. మేం రేపు ఎన్నికలు స్వీప్ చేస్తాం. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా స్వీప్ చేస్తాం. ఆ ఎన్నికల మీద పడినా ఓ అర్థం ఉంటుంది. చంద్రబాబు పెయిడ్ ఏజెంట్‌లా నిమ్మగడ్డ పనిచేస్తున్నారు. గ్రామ పంచాయితీ ఎన్నికలు పార్టీరహితంగా జరుగుతాయి. ఎవరైనా ఎంతైనా జబ్బలు చరుచుకోవచ్చు. అక్కడ తేలేది ఏమీ ఉండదు. గ్రామ స్థాయిలో ప్రజలు ఓట్లు వేసి గెలిపించుకుంటారు. దీనిని కూడా బ్యాడ్‌లైట్‌లో చెడ్డగా చిత్రీకరించాలని నిమ్మగడ్డ-చంద్రబాబులు ప్రయత్నిస్తున్నారు. ఉద్యోగుల్ని టెర్రరైజ్ చేయాలనే విధంగా ఇలాంటి వ్యక్తి ఎస్‌ఈసీగా ఉండటం రాష్ట్రం ఖర్మ. గతంలో రాష్ట్రానికి సీఎంగా చంద్రబాబు ఉండటం ఎంత ఖర్మ అనుకున్నామో.. ఇప్పుడు రాష్ట్రానికి పట్టిన ఇంకో ఖర్మ ఎస్‌ఈసీ.
2018-19 మధ్య పంచాయితీ ఎన్నికలు జరగాల్సి ఉంది. మరి, ఎందుకు జరపలేదు. అప్పుడు గుర్తుకు రాని రాజ్యాంగ నేపథ్యం ఇప్పుడు ఎందుకు గుర్తుకు వచ్చింది. తాను రిటైర్డ్ అయ్యేలోగా ఏదో చేయాలని ప్రయత్నిస్తున్నాడు. వైయస్‌ఆర్‌సీపీ ధైర్యం, ఎంత గెలుస్తామనేది అవతల పెట్టినా.. మా పార్టీ అంత బలహీనంగా అయితే లేదు. ఎన్నికల్లో తప్పుడు పనులు చేసి పై చేయి సాధించాలనే ఆలోచన ఉండాల్సిన అవసరం మా పార్టీకి లేదు. ఏకగ్రీవాలు ప్రోత్సహిస్తూ.. పబ్లిసిటీ ఇచ్చి.. వీలైనంత వరకు గ్రామాల్లో ముఠాకక్షలు లేకుండా, శాంతియుతంగా ఏకగ్రీవాలు జరిగేట్టుగా, తద్వారా గ్రామాభివృద్ధికి పాటు పడేరకంగా అందరూ పనిచేయాలి. మా పార్టీనే స్వీప్ చేస్తామని ప్రయాసపడటం లేదు. పంచాయితీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల జోక్యం అతిగా పెరిగితే.. చివరకు ఊర్లలో ప్రశాంత వాతావరణం పోయి, చేస్తున్న అభివృద్ధిపై ప్రభావం పడుతుంది. రాజకీయ పార్టీలు అనవసరంగా వ్యవహరించకుండా ఏకగ్రీవాలు చేసుకోండని ప్రోత్సహిస్తే బావుంటుంది.
పంచాయితీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మార్చి 31లోపు మిగిలిన ఎన్నికలు కూడా ముగిస్తాడు ఏమో. అప్పుడు జరిగే మిగిలిన ఎన్నికల్లో ఎవరి బలం ఎంతో తెలుస్తుంది. ఈ రచ్చలోకి గ్రామాలను లాగటం ఎందుకు అనేది మా తాపత్రయం. అందుకే విజ్ఞప్తులు చేస్తున్నాం. ఒకరకంగా పరిధిదాటి హెచ్చరించాల్సి వస్తోంది. ఏ కారణంతో ఎస్‌ఈసీ ఫత్వాలు జారీ చేస్తున్నారు. తనకు తాను అనుకొని 20 రోజులు, నెల రోజులు రాష్ట్రమంతా తన కంట్రోల్‌లో ఉందనే భ్రమలో ఉంటూ పచ్చమీడియా ద్వారా అదే ఇంప్రెషన్ క్రియేట్ చేస్తూ మమ్మల్ని చెడ్డగా చూపిస్తూ, ప్రజల్లో అయోమయాన్ని సృష్టిస్తున్నారు. ఇది చంద్రబాబు, నిమ్మగడ్డ రమేశ్ కలిసి చేస్తున్న కోల్డ్ బ్లడెడ్ కుట్రగా మేం భావిస్తున్నాం.
నిమ్మగడ్డ రమేశ్ నిన్న, మొన్న చేసిన దానిపై ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకుంటోంది. తన పరిధి దాటి తను ఏదైతే చేస్తున్నారో.. దాన్ని పరిగణలోకి తీసుకోకుండా ప్రొసీడింగ్స్‌ను ప్రభుత్వం విడుదల చేయబోతోంది. భవిష్యత్‌లో ఎస్‌ఈసీ ఇచ్చే అడ్డగోలు ఉత్తర్వుల్ని ప్రభుత్వం పాటించబోదు. ప్రభుత్వం తను నిర్ణయాలు తీసుకోవాలి. రికమెండేషన్స్ ఎన్నైనా ఎస్‌ఈసీ చేసుకోవచ్చు. నిర్ణయాలు తీసుకోవాల్సింది ప్రభుత్వమే. ఎస్‌ఈసీ కేవలం కొద్దికాలంపాటు సస్పెండ్ చేయటం, రిలీవ్ చేయమని కోరటం మాత్రమే చేయగలరు. కానీ ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ తన పరిధి దాటారు. ప్రభుత్వం తన ఆఫీసర్లను ప్రొటెక్ట్ చేయటానికి ముందు ఉంటుంది. ఇక ముందు కూడా ఇలాంటి అడ్డగోలు ఆర్డర్స్ ఎస్‌ఈసీ ఇచ్చినా ఎవ్వరూ వర్రీ కావాల్సిన అవసరం లేదు. నిష్పక్షపాతంగా అధికారులు పనిచేయండి. వైయస్‌ఆర్‌సీపీ కానీ, ఇంకో పార్టీ కానీ అసలు పార్టీలు గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అధికారులు తమ పరిధిలో అధికారాలు వాడి గ్రామాల్లో గొడవలు రాకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నిక జరిగేట్టు చూడండి. మహా అయితే కొద్దిరోజుల పాటు డ్యూటీల నుంచి ఎస్ఈసీ మిమ్మల్ని పక్కన పెడుతుందేమో కానీ అంతకుమించి చేయగలిగిందేమీ లేదు.
గోపాలకృష్ణ ద్వివేది అనే వ్యక్తి రెండు మొట్లు పైన ఉండే వ్యక్తి. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ రిప్రజెంటివ్‌గా పనిచేశారు. గతంలో చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్ ను పట్టుకుని మీరు ప్రభుత్వాన్ని ధిక్కరిస్తారా అని అన్నాడు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఎన్నికల కమిషన్ ఛాంబర్‌లోకి వెళ్ళి, ఎన్నికల కమీషన్ అంత పెద్దది అనుకుంటున్నారా అని మాట్లాడారు. అదే చంద్రబాబు ఈరోజు దైవదూషణలా.. ఎన్నికల కమీషన్‌ను దూషిస్తారా అని చంద్రబాబు అంటున్నారు. ప్రజలు ఏమనుకుంటారో.. అన్న విజ్ఞత లేకుండా చంద్రబాబు వ్యవహరించారు. అప్పుడు చంద్రబాబు ఎటాక్ చేస్తే.. ఇప్పుడు సహపాత్రధారి నిమ్మగడ్డ కూడా ద్వివేదిని ఎటాక్ చేస్తున్నారు.
ఏతావాతా తేలేది ఏమిటి అంటే.. తాను (నిమ్మగడ్డ), చంద్రబాబు అనుకున్నట్లు ఉంటే అదే గొప్ప. ఈరోజు కూడా చంద్రబాబు చాలా మాట్లాడారు. ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని పిలుపు ఇవ్వాల్సిందిపోయి.. ఏకగ్రీవాలు ప్రోత్సహించాల్సింది పోయి.. ఏకగ్రీవం అంటేనే బూతులాగా.. ఒక్క ఓటు ఉన్నా నామినేషన్ వేయాలని చంద్రబాబు అనటం ఏంటి? నాది కాకపోతే కొట్టుకు చావండన్నట్లు చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. గ్రామ స్థాయిలో అవసరాలు తీర్చడం కోసం అవసరమైన బాడీ ఏర్పాటు చేయాలి. పార్టీ రహితంగా ఏర్పాటు చేస్తే.. దాంట్లో పట్టుదలకు పోయి.. హూంకరించి ఒక ఓటు వచ్చినా నామినేషన్ వేయాల్సిందే. ఏకగ్రీవం అంటే బెదిరింపులు, దబాయింపులు అన్నట్టు వ్యవహరించడం సరికాదు. ఏకగ్రీవాలు ఇప్పుడు కొత్తకాదు, 2013 ముందు నుంచి కూడా ఏకగ్రీవాలు జరిగాయి.
వైయస్‌ఆర్‌సీపీని ఎదుర్కోవాలంటే విధానపరంగా, ఫెయిల్యూర్స్‌ను చూపి ఎదుర్కోవాలి. లేకపోతే జనరల్ ఎన్నికల్లో, పార్టీ గుర్తు మీద వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఎదుర్కోవాలి. గ్రామ పంచాయితీ ఎన్నికలకు ముడిపెట్టడం ఏంటి? అదే కుట్రబుద్దితో నిన్న, ఇవాళ చంద్రబాబు ఐదు గంటలు మాట్లాడారు. అదే కుట్ర బుద్ధి. రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలని చంద్రబాబు నుంచి ఆశించటం అత్యాశే అవుతుంది. నిన్నమొన్నటి వరకు కులాలు, మతాల మధ్య, ప్రాంతాల మధ్య ఏ జుట్లు ముడివేయాలి.. ఎవరెవర్ని కొట్టించాలని ఏదో ఒకటి తగాదా ఉండాలని మురికి గుంటలో చేపలు పట్టుకోవాలన్నట్లు, శవాల మీద బొరుగులు ఏరుకోవాలన్నట్లు చంద్రబాబు వ్యవహారం ఉంది. ఆయనకు తందాన అన్నట్లు ప్రతి వ్యవస్థలోనూ ఇలాంటి వేరు పురుగులు తయారు చేసుకోవటం.. తన దుర్మార్గపు ఆలోచనలను వారితో చంద్రబాబు అమలు చేస్తున్నారు. దానికి తాజా ఉదంతమే ఎస్‌ఈసీనే. ఈ మాట అనటంలో మాకు ఎలాంటి ఆలోచన, సంకోచం లేదు. తన పరిధిని ఎస్‌ఈసీ ఎప్పుడు దాటాడో, దుర్మార్గపు చంద్రబాబు పథకాల్లో భాగం అయ్యాడో అప్పటి నుంచి ఆ గౌరవాన్ని ఎస్‌ఈసీ కోల్పోయారు.
ప్రభుత్వం కోర్టుకు ఒక ప్రిన్సిపల్ స్టాండ్ మీద వెళ్లటం జరిగింది. కోర్టు నుంచి డైరెక్షన్ వచ్చాక ఎన్నికలకు వెళ్ధామని ఎస్ఈసీకి చెప్పాం. అంతేకానీ ఎస్ఈసీ ఒక మాట అంటే.. ఇటు నుంచి నాలుగు మాటలు అనాల్సి వస్తోంది. ఎస్‌ఈసీ వెనకాల ఉన్న చంద్రబాబు కుట్రలను గమనిస్తున్నాం. నారా చంద్రబాబు అనే వ్యక్తి సొంత మామను వెన్నుపోటు పొడిచి రాష్ట్రాన్ని కబంధహస్తాల్లో ఇరికించుకున్న రోజు నుంచి రాష్ట్రం సర్వనాశం అయిపోయింది. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ చంద్రబాబు తన మొహాన్ని అద్దంలో చూసుకుంటే దెయ్యమే తనకు కనిపిస్తుంది. చంద్రబాబు ఇలాంటి పనులకు కుటుంబం లేదు, రాష్ట్రమూ లేదు. అయినా చంద్రబాబు దింపుడు కళ్లెం ఆశల్లో భాగంగా కుట్రలు చేయిస్తున్నారు. ఈ నెలరోజుల్లో ఎన్నికల పర్వం ముగుస్తుంది. ఈ పర్వం ముగిసిన తర్వాత చంద్రబాబు, ఆ పార్టీ పూర్తిగా రాజకీయంగా సమాధి కావటం ఖాయం. చంద్రబాబు రాజకీయంగా సమాధి అవుతారు. అపోహలు, అభద్రతను సృష్టించటానికి ఎస్ఈసీ చేస్తున్న ప్రయత్నాలను ప్రభుత్వం తిప్పికొడుతుంది. అందరికీ భరోసా ఇస్తుంది. నిష్పక్షపాతంగా అధికారులు పనిచేయండి. గవర్నమెంట్ మీతో ఉంటుందనే మెసేజ్ వెళ్తుంది. ఎస్‌ఈసీ శైలిని ఎవ్వరూ సీరియస్‌గా భావించాల్సిన అవసరం లేదు. ప్రజల్ని కన్‌ప్యూజ్ చేసే ప్రయత్నాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పంచాయితీ ఎన్నికలను ఏకగ్రీవాలు చేయాలని కోరుతున్నాం. అధికారయంత్రాంగం కూడా ఏకగ్రీవాలు అయ్యే వాతావరణాన్ని ప్రోత్సహించాలి. దీనికి మీడియా కూడా సహకరించి తగిన ప్రచారం కల్పించాలి.
ప్రభుత్వం ఎస్‌ఈసీ ప్రొసీడింగ్స్ రిజెక్ట్ చేస్తూ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఎస్‌ఈసీ చేసింది తుంటరి పనికాదు. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ల కేరక్టర్ దెబ్బతీసేలా, వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ చేశారు. డీఓపీటీకి పంపటం దుర్మార్గం. ప్రభుత్వం వాటిని గుర్తించబోమని చెబుతోంది. ఎస్‌ఈసీ పరిధిలోనిది ఈ అంశం కాదని ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయబోతోంది.
వ్యాక్సినేషన్ సంబంధించి ఏ రకంగా చేయాలో చెప్పమని కేంద్రంను కోరటం జరిగింది. ఇంకా సమాధానం రాలేదు. చేయగలింది చేస్తూపోవటమే. ప్రభుత్వం ఇంతవరకు దాచి ఏమీ చేయలేదు. ప్రభుత్వం ప్రిన్సిపుల్ స్టాండ్ తీసుకొని ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పారు.