ఎల్‌ఈడీ లైట్లతో రూ.970 కోట్ల మేర విద్యుత్‌ ఆదా

సిలికా సాండ్‌ మార్కెటింగ్‌లో పోటీ పెంచి ఆదాయం సాధిస్తాం

ఈ ఏడాది గనుల ద్వారా వచ్చిన ఆదాయం రూ.400 కోట్లు మాత్రమే

ఏపీపీఎస్‌సీ ద్వారా గ్రామ సచివాలయాల్లో ఖాళీల భర్తీ

పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

మైనింగ్‌ శాఖ, గ్రామాల్లో అభివృద్ధి శానిటేషన్‌పై సమీక్ష

విజయవాడ: మైనింగ్‌ శాఖ, ఏపీఎండీసీ నుంచి అత్యధిక ఆదాయం కోసం ప్రయత్నాలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. 2021–22 ఆర్థిక ఏడాదికి గనుల ఆదాయం, పంచాయతీ రాజ్‌ ద్వారా గ్రామాల్లో అభివృద్ధి, శానిటేషన్‌పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఎండీసీ, డైరెక్టరేట్‌ ఆఫ్‌ మైనింగ్‌ల ఆధ్వర్యంలో జరుగుతున్న మైనింగ్‌ కార్యకలాపాలపై చర్చించారు. సమీక్షా సమావేశం అనంతరం మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..

‘ఈ ఏడాది గనుల ద్వారా రూ.400 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది. బెరైటీస్‌ ద్వారా రూ. 1000 కోట్ల ఆదాయానికి ప్రయత్నాలు చేస్తున్నాం. సిలురి మైన్‌ ద్వారా బొగ్గు సరఫరా.. మదన్‌పూరి కోల్‌ బ్లాక్‌ నుంచి కూడా ఉత్పత్తి మొదలు పెడతాం. బ్రహ్మడిహ బొగ్గు గని ద్వారా కొకింగ్‌ కోల్‌ ఉత్పత్తి చేసి సరఫరా చేస్తాం. సిలికా సాండ్‌ మార్కెటింగ్‌లో పోటీ పెంచి ఆదాయం సాధిస్తాం. గతంలో ఉచిత ఇసుక విధానం ద్వారా టీడీపీ నేతలు దోచుకున్నారు. ఎంఎస్‌టీసీ సంస్థ ద్వారా ఇసుక విక్రయాలు చేసేందుకు అప్పగించాం. ముడి ఇనుము ఖనిజం తవ్వకాలు కూడా అనుమతులు ఇస్తాం.

తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య అంశాలపై కూడా దృష్టి పెట్టాం. భూహక్కు ద్వారా ఇంటి యజమానికి అప్పగించేందుకు కార్యాచరణ, గ్రామ సచివాలయాల్లో 8 వేల ఖాళీలు ఉన్నాయి. వాటికి ఏపీపీఎస్‌సీ ద్వారా నియామకాలు చేపడతాం. గ్రామాల్లో ఎల్‌ఈడీ లైట్ల ద్వారా రూ.970 కోట్ల మేర విద్యుత్‌ ఆదా చేశాం. ఎల్‌ఈడీ లైట్ల నిర్వహణ గ్రామ సచివాలయానికి అప్పగించాం. 2021–22కు రూ.4 వేల కోట్లు లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. అనంతపురంలో, కర్నూలు జిల్లాలోని ఇనుప గనులను కడప స్టీల్‌ ప్లాంట్‌కు ఇస్తాం. విశాఖ ఉక్కుకు ఆ గనులు కేటాయించడం వల్ల ఉపయోగం లేదు.’ అని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. 
 

తాజా ఫోటోలు

Back to Top