రాజశేఖర్‌ యాదవ్‌ వైయస్‌ఆర్‌సీపీలో చేరిక

వైయస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరిన యాదవ మహాసభ జాతీయ కార్యదర్శి
 

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి బీసీల మద్దతు రోజు రోజుకు అధికమవుతుంది. ఇటీవల వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బీసీ డిక్లరేషన్‌ ప్రకటించడంతో బడుగు, బలహీన వర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు వైయస్‌ఆర్‌సీపీకి మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లాకు చెందిన అఖిల భారతీయ యాదవ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌యాదవ్‌ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి నేతృత్వంలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనకు వైయస్‌ జగన్‌ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా యాదవులకు సంబంధించిన పలు సమస్యలను రాజశేఖర్‌యాదవ్‌ వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. యాదవులకు నామినేటెడ్‌ పదవులు, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్‌ వర్కులతతో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. బీసీ కమ్యూనిటికి చట్టభద్రత కల్పించి బీసీ సబ్‌ ప్లాన్‌ ఏర్పాటు చేయాలన్నారు. సన్నది గొళ్లలు తిరుమల తిరుపతి గుడి తలుపులు తెరిచే సాంప్రదాయాన్ని పునరుద్ధరించాలని కోరారు. విదేశీ ఉన్నత విద్యకు అవసరమైన ఖర్చును ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నవరత్నాల ద్వారా యాదవులకు సంక్షేమంలో పెద్ద పీట వేయాలని వైయస్‌ జగన్‌ను కోరారు. బీసీ డిక్లరేషన్‌లో వైయస్‌ జగన్‌ ఇచ్చిన వాగ్ధానాలతో బడుగు, బలహీన వర్గాల్లో వెలుగులు నిండుతాయని హర్షం వ్యక్తం చేశారు. బీసీలంతా కూడా వైయస్‌ఆర్‌సీపీ వెంటే ఉంటారని, వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుంటామని రాజశేఖర్‌ యాదవ్‌ పేర్కొన్నారు.
 

Back to Top