పార్వతీపురం: కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతోందని మాజీ మంత్రి పాముల పుష్పశ్రీవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే నిజాయితీపరుడైన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్టు చేశారని చెప్పారు.పార్వతీపురం మన్యం జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆమె... జూన్ 6వ తేదీన సాక్షి టీవీలో వచ్చిన కేఎస్సార్ లైవ్ షోలో సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు వ్యాఖ్యలకు... వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, సాక్షికి సంబంధం లేదని స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అయినా వాటిని వైయస్ జగన్‌కి, ఆయన సతీమణి వైయస్ భారతికి ఆపాదించి వికృత రాజకీయాలకు తెరదీశారని మండిపడ్డారు. తమ వాదనను నిజమని సమర్థించుకునేందుకు, ప్రజలను నమ్మించేందుకు ఒక ప్రణాలికను రూపొందించారని చెప్పారు. మొదట తెలుగుదేశం పార్టీ అఫిషియల్ హ్యాండిల్ నుంచి ట్వీట్ వేయించి తర్వాత నారా లోకేష్ తో రాయించి, ఆ వెంటనే సీఎం చంద్రబాబుతో పోస్టులు చేయించారన్నారు. ఆ వెంటనే జనసేన నుంచి ప్రెస్ నోట్, పవన్ కళ్యాణ్ తో ట్వీట్ వేయించి... ఒక పథకం ప్రకారం అబద్ధాన్ని నిజం చేసేందుకు ఈ కుట్రకు తెరలేపారని తేల్చి చెప్పారు. బాలికలపై అత్యాచారాలు జరుగుతుంటే కనీస స్పందన లేదు వరుసగా మహిళలు, చిన్నారుల మీద దాడులు జరుగుతుంటే ఈ ప్రభుత్వం, పోలీసుల్లో ఎందుకు చలనం లేదని ప్రశ్నించారు. అనంతపురంలో ఇంటర్ చదువుతున్న గిరిజన బాలికను బీర్ బాటిల్‌తో కొట్టి చంపితే ఇంతవరకు కదలిక లేదని, తన కుమార్తె కనిపించడం లేదని జూన్ 3వ తేదీనే బాలిక తన్మయి తండ్రి పొలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఆరు రోజుల తర్వాత బాలిక శవమై తేలడం పోలీసుల నిర్లక్ష్యానికి నిదర్శమని చెప్పారు. ఇదే అనంతపురం జిల్లాలో ఒక దళిత విద్యార్థినిని 14 మంది టీడీపీ యువకులు నెలలపాటు దారుణంగా అత్యాచారం చేసి వేధించినా.. నిందితులపై చర్యలేవని నిలదీశారు. ఈ ఘటనలో బాధితురాలికి ఇంతవరకు న్యాయం జరగలేదన్నారు. రాష్ట్రంలో కూటమి పాలనలో మహిళలపై జరుగుతున్న దారుణాలను సాక్షి ఎప్పటికప్పుడు బయటపెడుతుంటే ఈ ప్రభుత్వానికి వణుకు పుడుతోందని... అందుకే సాక్షి మీడియాను సీఎం చంద్రబాబు టార్గెట్ చేశారని తేల్చి చెప్పారు. ప్రశ్నించే గొంతులను నొక్కడమే ప్రభుత్వ ధ్యేయం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందన్న మాజీ మంత్రి... మహిళలు, ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఇంత జరుగుతున్నా బాధితులను పరామర్శించడానికి ఈ రాష్ట్ర హోంమంత్రి అనితకు తీరిక లేకుండా పోయిందని మండిపడ్డారు. కేవలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ... ఆమె ప్రెస్‌మీట్లకు పరిమితం అయిందన్నారు. గతంలో వైయస్ భారతి, వైయస్ విజయమ్మల గురించి తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు అనిత క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైయస్సార్సీపీ నాయకులను వేధించడానికే పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందని.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. ఏడాది పాలన పూర్తయినా ఇప్పటివరకు సూపర్ సిక్స్‌లో ఏ ఒక్క హామీని కూడా ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. వైయస్ జగన్ కి, వైయస్ భారతికి ఏంటి సంబంధం? ఎవరో చేసిన వ్యాఖ్యలను వైయస్సార్సీపీకి, వైయస్ జగన్‌కి, వైయస్ భారతికి ఆపాదించి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్న చంద్రబాబు నాయుడుకు... గతంలో టీడీపీ సీనియర్ నాయకులు అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణ, ఆనం వెంటకరమణారెడ్డి వంటి వారు వైయస్సార్సీపీ మహిళా నాయకులు మేకతోటి సుచరిత, రోజాలను ఉద్దేశించి అసభ్యకరంగా చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు.వారితో ఎందుకు క్షమాపణలు చెప్పించడం లేదని నిలదీశారు. ఐటీడీపీ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసుకుని వైయస్సార్సీపీ మహిళా నాయకులను సోషల్ మీడియాలో దారుణంగా తిట్టిస్తున్నా.... ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలకు గంజాయి, ఏరులైపారుతున్న మద్యమే కారణమన్న మాజీ మంత్రి... శాంతిభద్రతలు పరిరక్షణలో సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత దారుణంగా విఫలమయ్యారని మండిపడ్డారు. మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం... వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే డైవర్షన్ రాజకీయాలకుపాల్పడుతుందని పుష్పశ్రీవాణి తేల్చి చెప్పారు.