హత్యా రాజకీయాలపై బహిరంగ చర్చకు సిద్ధమా?

సీఎం చంద్రబాబుకు టీజేఆర్‌ సుధాకర్‌బాబు సవాల్‌

వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు ప్రెస్‌మీట్‌.

క్యాబినెట్‌ సమావేశంలో మరణాల గురించి చర్చలేంటి?

వివేకా హత్య జరిగినప్పుడు అధికారంలో టీడీపీ ఉంది

సీబీఐ దర్యాప్తు జరుపుతున్న కేసుపై ఎందుకీ రాద్దాంతం?

సూటిగా ప్రశ్నించిన టీజేఆర్‌ సుధాకర్‌ బాబు

ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌

అందుకే సహజ మరణాలతో చంద్రబాబు రాజకీయం

అదే ఆయన కుటుంబంలో మరణాలు ఎందుకు సమీక్షించరు?

వైయ‌స్ జగన్‌పై చంద్రబాబుకు తీవ్రమైన రాజకీయ కక్ష

అందుకే ఆయన కుటుంబాన్ని అదేపనిగా టార్గెట్‌ చేస్తున్నారు

ప్రెస్‌మీట్‌లో టీజేఆర్‌ సుధాకర్‌బాబు స్పష్టీకరణ

తాడేపల్లి: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, ప్రజా సమస్యలు అస్సలు పట్టించుకోకుండా పని చేస్తున్న సీఎం చంద్రబాబు, ఎప్పటికప్పుడు ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు వెల్లడించారు. ఆ దిశలోనే హత్యా రాజకీయాల గురించి ప్రస్తావిస్తున్నారని ఆయన తెలిపారు. చంద్రబాబుకు ధైర్యం ఉంటే, హత్యా రాజకీయాలపై బహిరంగ చర్చకు రావాలని.. నాడు మల్లెల బాబ్జీ మొదలు, మొన్నటి తారకరత్న వరకు అన్నింటిపై చర్చించాలని సవాల్‌ చేశారు. చివరకు క్యాబినెట్‌ భేటీలో కూడా ఒక మరణంపై చర్చించే స్థాయికి సీఎం చంద్రబాబు దిగజారిపోయారని, వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్‌లో టీజేఆర్‌ సుధాకర్‌బాబు ఆక్షేపించారు.

కామెడీ సమావేశాలుగా మార్చారు!:
    రాష్ట్ర కేబినెట్‌ సమావేశం జరిగితే తమకు ఏం మేలు జరుగుతుందోనని ప్రజలు ఎదురు చూస్తుంటారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి 14 కేబినెట్‌ సమావేశాలు జరిగితే వ్యవస్థల బలోపేతంపై కానీ, సూపర్‌ సిక్స్‌ హామీల అమలుపై కానీ ఏనాడూ నిర్ణయం తీసుకోలేదు. కేబినెట్‌ సమావేశాలను కామెడీ సమావేశాలుగా మార్చేశారు. చివరకు కేబినెట్‌ సమావేశాలను సైతం డైవర్షన్‌ పాలిటిక్స్‌ కోసం వాడుకుంటున్నారు.
    సూపర్‌సిక్స్‌ కాకుండా ఎన్నికల్లో 143 హామీలిచ్చి వాటి అమలుపై చర్చించకుండా సీబీఐ పరిధిలో ఉన్న వైయస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి, తాజాగా అనారోగ్యంతో మరణించిన ఆయన ఇంటి వాచ్‌మెన్‌ రంగయ్య గురించి కేబినెట్‌లో చర్చించడం కన్నా హేయమైన అంశం ఇంకోటి ఉండదు. 

ఈ 9 నెలలు ఏం చేశారు?:
    వివేకా హత్యను చూపించి, జగన్‌గారి చెల్లెళ్లను బయటకు తీసుకొచ్చి, రాజకీయ ప్రచారంలో ఆయనపై దుమ్మెత్తి పోయడానికి వాడుకుని అధికారంలోకి వచ్చి 9 నెలలైనా.. కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా ఇంతవరకు ఎందుకు సమీక్షించలేదు? 
ఈ  9 నెలలూ వివేకా హత్య గురించి పట్టించుకోకుండా వదిలేసి, అనారోగ్యంతో మరణించిన రంగయ్య మరణాన్ని డైవర్షన్‌ పాలిటిక్స్‌కి వాడుతున్నారు. 
    
అదే చంద్రబాబు కుట్ర:
    వైయస్‌ జగన్‌ నాయకత్వ పటిమను తగ్గించి చూపించడానికి వారి కుటుంబంలో జరిగిన ఒక హత్యను హైలెట్‌ చేసి వారి కుటుంబాన్ని పదే పదే రోడ్డుకు లాగుతున్నారు. అందులో భాగంగానే జగన్‌ చెల్లెళ్లను చంద్రబాబు తన రాజకీయ క్రీడలకు పావుగా వాడుకుంటున్నాడు. అన్యోన్యంగా ఉన్న కుటుంబాన్ని చీల్చడానికి చంద్రబాబు చేస్తున్న కుట్రగా  వైయస్ఆర్‌సీపీ భావిస్తోంది. 

దస్తగిరికి ఫండింగ్‌ చేస్తున్నదెవరు?:
    వైయస్‌ వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఉంది. చంద్రబాబే సీఎంగా ఉన్నారు. దీనిపై ఆనాడే సీబీఐ విచారణ చేయాలని వైయస్‌ జగన్‌ డిమాండ్‌ చేసినప్పుడు ఎందుకు వెంటనే చర్యలు తీసుకోకుండా నీరుగార్చే ప్రయత్నం చేశారు? 
    ఒకటికి పది సార్లు చనిపోయే దాకా వివేకానందరెడ్డిని తానే గొడ్డలితో నరికి చంపానని దస్తగిరి అంగీకరించిన తర్వాత అతడ్ని అప్రూవర్‌గా ఎలా మారుస్తారు? హత్య జరిగిన విధానాన్ని అతను టీవీ డిబేట్లలో గంటలకొద్దీ  పూసగుచ్చినట్టు చెబుతుంటే అరెస్ట్‌ చేయకుండా,  అతడికి సుప్రీంకోర్టులో బెయిల్‌ తెచ్చుకునే స్థాయిలో ఫండింగ్‌ చేస్తున్నదెవరో చంద్రబాబు చెప్పాలని వైయస్ఆర్‌సీపీ డిమాండ్‌ చేస్తోంది. 
    సుప్రీంకోర్టు లాయర్లకు ఫీజులు చెల్లించి అప్రూవర్‌గా మార్చి బయట తిరగడానికి అవకాశం కల్పించింది ఎవరు? వృత్తి రీత్యా డ్రైవర్‌ అయిన దస్తగిరి ఇప్పుడు 5 నుంచి 10 కార్ల కాన్వాయ్‌తో పులివెందులలో ఎలా స్వేచ్ఛగా తిరుగుతూ, సెటిల్మెంట్లు చేస్తున్నాడు?. నలుగురైదుగురు డ్రైవర్లకు జీతాలిచ్చి ఎలా పోషిస్తున్నాడు? వీటన్నింటిపై ఎందుకు సమీక్షించలేదు? 

హత్యా రాజకీయాలపై బహిరంగ చర్చకు సిద్ధమా?:
    హత్యా రాజకీయాల గురించి సమీక్షించాలనుకుంటే 2014–19 మధ్య చంద్రబాబు పాలనలో జరిగిన హత్యలపై ఎందుకు సమీక్షించలేదు? రాష్ట్రంలో జరిగిన హత్యారాజకీయాలపై చర్చించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. మల్లెల బాబ్జి హత్య నుంచి వంగవీటి మోహనరంగ, పత్తికొండ నారాయణరెడ్డి, వినుకొండలో జరిగిన రషీద్‌ హత్యలపై లైవ్‌ డిబేట్లలో చర్చిద్దాం రండి. గత వైయస్‌ జగన్‌ పాలనలో శాంతి భద్రతలు ఎలా ఉండేవి, నేడు ఎలా ఉన్నాయో చర్చించడానికి మేం సిద్ధం. మీరు సిద్ధమా?.
    చంద్రబాబు బావమరిది బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పుల గురించి సమీక్షిద్దామా? బాలకృష్ణ ఇంట్లో సెక్యూరిటీ గార్డ్‌ ఎలా చనిపోయాడో ఇంతవరకు తెలియదు. చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తినాయుడు పిచ్చివాడై పోయాడు. పదేళ్ల పాటు ఆయన్ను గొలుసులతో ఇంట్లో కట్టేశారు. తారకరత్న హఠాన్మరణం చెందారు. వీటిపై కూడా ప్రజల్లో చాలా అనుమానాలున్నాయి. వీటిన్నింటిపైన కూడా సమీక్ష చేసి నిజాలు  నిగ్గు తేలుద్దామా?.
    పరిటాల హత్యల కేసులో కూడా సాక్షులు చనిపోయారని రాసిన పత్రికలు, 2014–19 మధ్య చంద్రబాబు సీఎంగా ఉండగా ఎందుకు సమీక్ష చేయలేదని అడగలేదే?  

సహజ మరణాలతో రాజకీయ కుట్రలు హేయం:
    సహజ మరణాలను, అనారోగ్యంతో జరిగిన మరణాలను వైయస్ఆర్‌సీపీకి, జగన్‌ కుటుంబానికి చుట్టాలని కుట్రలు చేస్తున్నారు.  వివేకా హత్య జరిగిన సమయంలో డాక్టర్‌ ఈసీ గంగిరెడ్డి హైదరాబాద్‌లో ఉన్నారు. తర్వాత ఆయన కరోనాతో చనిపోయారు. జగన్‌ డ్రైవర్‌గా పని చేసిన నారాయణ బ్రెయిన్‌ ట్యూమర్‌తో చనిపోతే దాన్ని కూడా హత్యకేసుతో ఎలా ముడిపెడతారు?. ఇమ్యూనిటీ డెఫిషియన్సీతో ఆరు నెలల పాటు చికిత్స తీసుకుని డాక్టర్‌ అభిషేక్‌రెడ్డి చనిపోతే దాన్ని కూడా వివేకా హత్యకు ముడిపెట్టారు. 
    ఏదైనా ఉంటే రాజకీయంగా తేల్చుకోవాలి కానీ, జగన్‌గారి  కుటుంబంపై ఇలా తప్పుడు ప్రచారం చేయడం ఏమాత్రం సమంజసం కాదు. అభూత కల్పనలతో రాజకీయంగా వైయస్ఆర్‌సీపీకి నష్టం కలిగించడమే లక్ష్యంగా చేస్తున్న ఇలాంటి హేయమైన చర్యలను పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం.

వివేకా రెండో భార్య షమీమ్‌ ఫోన్‌ ఏమైంది?:
    వైయస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుపై సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని వైయస్ఆర్‌సీపీ మొదటి నుంచి డిమాండ్‌ చేస్తోంది. అందులో ఏ అనుమానం లేదు. వివేకా రెండో వివాహం చేసుకున్న షమీమ్‌ ఫోన్‌ ఎక్కడుంది? ఆ ఫోన్‌ కాల్‌ లిస్ట్‌లో ఎవరెవరి నెంబర్లు ఉన్నాయి?. వాట్సాప్‌ఛాట్‌లో ఏమున్నాయ్‌? అసలు ఆ ఛాట్‌ ఎందుకు డిలీట్‌ చేశారు?. ఆ కోణంలో కేసును ఎందుకు దర్యాప్తు చేయడం లేదు? దానిపైన కూడా చంద్రబాబు సమీక్ష చేయాలి. 
    సీబీఐ ఎస్పీగా ఉన్న రాంసింగ్, సునీతారెడ్డి వేధింపులు భరించలేక ఎస్పీకి గంగాధర్‌రెడ్డి ఫిర్యాదు చేస్తే దాన్ని పట్టించుకోకుండా వదిలేశారు. ఈ పనులు చూస్తుంటే వైయస్ఆర్ కుటుంబం అన్నా, వైయస్‌ జగన్‌ ని చూసినా చంద్రబాబు ఎంతలా భయపడిపోతున్నారో అర్థమైపోతుంది. ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి, ఆయన్ను కించపర్చడానికే కేబినెట్‌ సమావేశాలు వాడుకుంటున్నారు. అనుక్షణం కక్ష రాజకీయాలతోనే చంద్రబాబు పాలన సాగుతోంది. 

చంద్రబాబు కుట్రలను షర్మిల, సునీత గుర్తించాలి:
    టీడీపీలో ఎన్టీఆర్‌ కొడుకు బాలకృష్ణ తప్ప ఇంకెవరూ లేరా? అల్లుల్లే ఎందుకుంటారు? వారిని చంద్రబాబు పిలవరా? పిలిచినా వారు రావడం లేదా?  దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలి. 
    నిన్నమొన్నటి దాకా కత్తులు దూసుకున్న తోడళ్లుల్లు చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆలింగనం చేసుకున్నారు. మరోవైపు వైయ‌స్ జగన్‌గారి కుటుంబాన్ని తన రాజకీయ వికృత క్రీడకు బలి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. చంద్రబాబు దారుణ నిజస్వరూపాన్ని ఇప్పటికైనా వైయస్‌ జగన్‌ చెల్లెళ్లు గ్రహించాలని టీజేఆర్‌ సుధాకర్‌బాబు కోరారు.

 

Back to Top