కూటమి ఏడాది పాలన దోపిడి, అబద్ధాల మయం

ప్రజలకు మిగిలింది మాత్రం వంచన, మోసం 

మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ధ్వజం

కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయస్ఆర్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని).

ప్రభుత్వం ఎప్పుడూ చెప్పేవి గొప్పలు. చేసేది అప్పులు

అదే పనిగా ఈవెంట్ల నిర్వహణ. ఆర్భాటంగా ప్రచారం

ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు ఏ మాత్రం లేదు

ఒక్కటంటే ఒక్క పథకం సాకారం కాలేదు, బాదుడు తప్ప

అయినా అన్నీ చేశామని దబాయింపు. అడిగితే బెదిరింపు

సంక్షేమం, అభివృద్ధి అన్నది ఎక్కడా కనిపించడం లేదు

మాజీ మంత్రి పేర్ని నాని వెల్లడి 

రాష్ట్రంలో మహిళల మాన ప్రాణాలకు భద్రత లేదు

కూటమి నాయకుల నుంచి ప్రజల ఆస్తులకు రక్షణ లేదు

పోలీసులే లంచావతారమెత్తి దోపిడీలకు దిగుతున్నారు

అన్ని వ్యవస్థలూ నిర్వీర్యం. ప్రజలందరికీ వంచన. దగా

ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టీకరణ

తాడేపల్లి: రాష్ట్రంలో టీడీపీ కూటమి ఏడాది పాలనంతా దోపిడి, అబద్ధాల మయం అని, ప్రజలకు మిగిలింది వంచన, మోసం మాత్రమే అని వైయస్ఆర్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఎప్పుడూ చెప్పేవి గొప్పలు కాగా, చేసేది అప్పులు మాత్రమే అని, అదే పనిగా ఈవెంట్ల నిర్వహణ. ఆర్భాటంగా ప్రచారం తప్ప, ఈ ప్రభుత్వం ఈ ఏడాదిలో ఒరగబెట్టిందేమీ లేదని, పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పేర్ని నాని స్పష్టం చేశారు.

మాజీ మంత్రి పేర్ని నాని ఇంకా ఏం మాట్లాడారంటే..:

తొలి అడుగు కాదు.. తప్పటడుగు:
    కూటమి పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా టీడీపీ, జనసేన, టీడీపీ కలిసి సుపరిపాలనలో తొలి అడుగు ఆకాంక్షల నుంచి అభివృద్ధి దిశగా అంటూ సచివాలయం వద్ద ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ఏడాది కాలంగా ప్రజలకు ఏం మంచి చేశారో వివరిస్తారనుకుంటే ఎన్నికలకు ముందు చెప్పిన అబద్ధాలనే మళ్లీ చెప్పుకొచ్చారు. చంద్రబాబు, లోకేష్, పవన్‌ కళ్యాణ్‌.. ముగ్గురూ కలిసి ‘ఆత్మస్తుతి. పరనింద’తో పాటు, పరస్పర డబ్బాతో గడిపేశారు. దీనికి కోట్ల రూపాయల ప్రజాధనం నీళ్లలా ఖర్చు చేశారు. కనీసం ఒక్క సంక్షేమ పథకం అందించకుండా ఏడాదిలోనే రూ.1.61 లక్షల కోట్లకుపైగా అప్పులు చేస్తూ గుడ్‌ గవర్నెన్స్‌ అందించామని అలవోకగా పచ్చి అబద్ధాలు చెప్పారు.
    మరోవైపు వారు ప్రచురించిన 30 పేజీల డాక్యుమెంట్‌లో వైయస్‌ జగన్‌ పాలనలో అప్పులపైనా అబద్ధాలు ప్రచురించారు. ఒక్క హమీని కూడా పూర్తిగా అమలు చేయకుండానే సంక్షేమ పథకాలు అమలు చేశామని, అభివృద్ధి సాధించేశామని డాక్యుమెంట్‌లో ప్రకటించుకున్నారు. ఇంతకన్నా పచ్చి దగా మరొకటి ఉండదు. 

అప్పులపై సవాల్‌కు సిద్ధమా?:
    2022–23 ఏడాదిని చూపించి వైయస్‌ జగన్‌ పాలనలో రాష్ట్రం అప్పులతో దివాళా తీసిందని ప్రచారం చేశారు. చంద్రబాబుకి, లోకేష్‌కి ఇదే నా సవాల్‌..
చంద్రబాబు పాలనలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై వైయస్‌ జగన్‌ పాలనలో ఉన్న పరిస్థితులపై చర్చకు సిద్ధమా? 2014–19 మధ్య చంద్రబాబు పాలనలో పరిమితులకు మించి అప్పులు చేశారు. ఆ ప్రభావం 2019లో వచ్చిన వైయస్‌ జగన్‌ ప్రభుత్వంపై పడింది. ఆ పరిమితికి మించి చేసిన అప్పులను సరిదిద్దే క్రమంలో 2022–23లో రూ.17 వేల కోట్లకు సంబంధించి నెట్‌ బారోయింగ్‌ కెపాసిటీ అనేది సన్నగల్లింది. అంతేకానీ ప్రభుత్వం నుంచి చేసే చెల్లింపుల విషయంలో కానీ, రాష్ట్ర పరపతి తగ్గడం కానీ జరగలేదు. వైయస్‌ జగన్‌ పాలనలో రాష్ట్ర ఆర్థిక ప్రగతి చంద్రబాబు కంటే గొప్పగానే సాగింది. వైయస్‌ జగన్‌ ఐదేళ్ల పాలనంతా ఆర్థిక క్రమశిక్షణతో సాగింది. ప్రశ్నించే వారు ఎదురుగా లేనప్పడు చంద్రబాబు 420, లోకేష్‌ 840 అబద్ధాలు ప్రజలకు చెప్పారు. దమ్ముంటే దీనిపై చర్చకు రావాలి. 
    వైయస్‌ జగన్‌ ఐదేళ్ల పాలనలో రూ.3.32 లక్షల కోట్ల అప్పులు చేస్తే, రూ.14 లక్షల కోట్లు అప్పులు చేశారని ఎన్నికలకు ముందు చంద్రబాబు, లోకేష్, పవన్‌ కళ్యాణ్, పురంధీశ్వరి విపరీతంగా ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక కూడా రూ.10 లక్షల కోట్లు అప్పులు చేసినట్టు దుష్ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర అప్పులపై అసెంబ్లీలో ఒకలా, పబ్లిక్‌ మీటింగుల్లో మరోలా చెబుతున్నారు.

అప్పులతో దుబారా వ్యయం:
    కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఏడాదిలోనే రూ.1.61 లక్షల కోట్లకుపైగా అప్పులు చేసింది. వైయస్సార్సీపీ ఐదేళ్లలో చేసిన అప్పుల్లో 48 శాతం అప్పులు ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం చేసేసింది. చంద్రబాబు ఏడాది పాలనలో జీఎస్టీ వసూళ్లు చూస్తేనే రాష్ట్రం ఆర్థికంగా ఎంత దారుణంగా ఉందో తెలిసిపోతుంది. పైగా దీన్ని ఆర్థిక క్రమశిక్షణగా చెప్పుకోవడం హాస్యాస్పదం. అప్పు తెచ్చిన ప్రతి రూపాయినీ వైయస్‌ జగన్‌ ప్రజా సంక్షేమానికి క్రమశిక్షణతో ఖర్చు చేస్తే, చంద్రబాబు మాత్రం ఈవెంట్‌ల కోసం ఇబ్బడిముబ్బడిగా ప్రజాధనాన్ని వెచ్చిస్తున్నాడు. 
    యోగాంధ్ర పేరుతో ఒకరోజు ఈవెంట్‌ మ్యాట్లకు రూ.350 కోట్లు ఖర్చు చేశారు. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్, లోకేష్‌.. ముగ్గురూ విలాసాల కోసం ప్రత్యేక విమానాలు, హెలిక్యాప్టర్లలో తిరుగుతున్నారు. ప్రత్యేక విమానం కొనుగోలు చేస్తున్నారు. తమ సొంత డబ్బులు కొనుగోలు చేయాల్సి వస్తే ఈ విధంగా తిరుగుతారా?.

మీరిచ్చిన బాండ్లకు ఏం సమాధానం చెబుతారు?:
    చంద్రబాబు పాలనలో డొల్లతనం, విచ్చలవిడి అవినీతి కారణంగానే ప్రతినెలా జీఎస్టీ రెవెన్యూ దారుణంగా పడిపోతూనే ఉంది. ప్రతినెలా నెగిటివ్‌ గ్రోత్‌తో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అట్టడుగున నిలిపిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. సంపద సృష్టిస్తామని ప్రచారం చేసుకుంటూ రూ.1.61 లక్షల కోట్లు అప్పులు చేశారు. ఆడబిడ్డ నిధి, దీపం, ఉచిత బస్సు, తల్లికి వందనం పథకాల పేరుతో ఓటేయించుకుని మహిళలను దారుణంగా వంచించారు. ఏయే కుటుంబానికి ఏయే పథకాలు వర్తిస్తాయి? దాని ద్వారా ఆ కుటుంబానికి ఎంత లాభం చేకూరుతుందో..  వివరిస్తూ చంద్రబాబు, పవన్‌ కళ్యాన్‌ సంతకాలు చేసి ఎన్నికలకు ముందు బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అంటూ బాండ్లు పంచారు.
    దాని ప్రకారం చూస్తే తొలి ఏడాది ఏ ఒక్క పథకం అమలు చేయలేదు. దీపం పథకంలో ఒకే ఒక్క సిలిండర్‌ ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. ఆడ బిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, ఉచిత బస్సు ప్రయాణం, 50 ఏళ్లకే పింఛన్లు వంటి పథకాలు అమలు చేయకుండానే ఇచ్చేశామని సిగ్గు లేకుండా చెప్పుకోవడం కన్నా దారుణం ఇంకోటి ఉంటుందా? వంద రోజుల్లో డీఎస్సీ పూర్తి చేసి పోస్టింగ్‌ ఇస్తామన్నారు. ఏడాది దాటినా ఇప్పటికీ పూర్తి కాలేదు. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టు పేరుతో నాటి మా ప్రభుత్వం మీద విషం చిమ్మి, అధికారంలోకి వచ్చాక రద్దు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, నాడు వైయస్‌ జగన్‌ అమలు చేసిన సర్వే విధానాలనే యథావిధిగా కొనసాగిస్తున్నారు. 

వారినే కాంట్రాక్టర్లు దత్తత తీసుకున్నారు:
    చంద్రబాబు, లోకేష్, పవన్‌లను కాంట్రాక్టర్లే దత్తత తీసుకున్నారు
పీ4 పేరుతో మీటింగులు పెట్టి రూ.20 కోట్లు ప్రజాధనం ఖర్చు చేయడం తప్ప ఎవరికీ ఎలాంటి మేలూ జరగడం లేదు. బంగారు కుటుంబాల పేరుతో ప్రభుత్వ కాంట్రాక్టులు చేసే వారిని తీసుకొచ్చి చంద్రబాబు చెప్పే ఉపన్యాసాలు వినలేక జనం పారిపోతున్నారు. కాంట్రాక్టర్లు మాత్రం మేం చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్, లోకేష్‌లను ఎన్నికలు కాగానే దత్తత తీసుకున్నామని వెటకారంగా చెబుతున్నారు. 1.48 కోట్ల కుటుంబాలు దారిద్య్రరేఖకు దిగువన ఉంటే 19.15 లక్షల కుటుంబాలకు అర్హతలు ఉన్నాయని తేల్చి 62,970 మందిని ఈసారికి దత్తత తీసుకున్నామని చెబుతున్నారు. పీ4 కార్యక్రమం ద్వారా ఈ ఏడాది కాలంలో ఎన్నికుటుంబాల స్థితిగతులు మారాయో ప్రభుత్వం వివరాలతో సహా వెల్లడించాలి. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా బాగుపడేది మాత్రం కన్సల్టెంట్లే తప్ప పేదవారు కాదు. 

పవన్‌ నేతృత్వంలో పంచాయతీ రాజ్‌ వ్యవస్థ నిర్వీర్యం:
    పవన్‌ కళ్యాణ్‌ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి పంచాయతీల అకౌంట్లన్నీ ఫ్రీజ్‌ అయిపోయాయి. జెండా పండుగ చేయడానికి రూ.10 వేలు ఇస్తామని పవన్‌ కళ్యాణ్‌ ఆర్భాటంగా ప్రకటించాడు. ఆ నిధులు ఇప్పటికీ డ్రా చేసుకోలేని దుస్థితి. 
చంద్రబాబు ఈవెంట్‌ ఆర్గనైజింగ్‌ స్కిల్స్‌ను పవన్‌ కళ్యాన్‌ కూడా ఒంట పట్టించుకుని పల్లె పండుగ అనే పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. 13వేల గ్రామ పంచాయతీల్లో ఒకేసారి కార్యక్రమాలు చేయడం రికార్డు అని ఊదరగొట్టారు. ప్రతి బుధవారం పేమెంట్‌ చేస్తామని ప్రకటించారు. ఈ వేడుక మొదటి మూడు బుధవారాలతోనే ఆగిపోయింది. ఆ తర్వాత ఎవరికీ బిల్లులు చెల్లించిన పాపాన పోవడం లేదు. దీన్ని ఆర్థిక క్రమశిక్షణ అంటారా?
    ఇంకా 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,120 కోట్లు డైవర్ట్‌ చేశారు. వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తారీఖున వేతనాలు పడితే, ఇప్పుడు 6 నెలలుగా వారితో పనులు చేయించుకుంటూ వేతనాలు చెల్లించడం లేదు. దీంతో ఆ కుటుంబాల జీవనం దుర్భరంగా మారింది. రూ.15 వేల వేతనాలకు పని చేసే ఈ ఉద్యోగులకు తల్లికి వందనం పథకం కూడా అమలు చేయడం లేదు. 

పిఠాపురంలో దళితుల సాంఘిక బహిష్కరణ:
    రాష్ట్రంలో మహిళలు, బాలికల మీద వరుసగా అత్యాచారాలు జరుగుతుంటే చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్, నారా లోకేష్, హోంమంత్రి అనితలో ఎవరూ ఒక్కసారి కూడా ప్రెస్‌మీట్‌ పెట్టి స్పందించిన పాపాన పోలేదు. ఏ ఒక్క నిందితుడి మీద కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. వైయస్సార్సీపీ నాయకుల మీద అక్రమ కేసులు బనాయించి వేధించడానికే పోలీసులను వాడుకుంటున్నారు.
    సుగాలి ప్రీతి కేసుతో విపరీతంగా ప్రచారం చేసుకున్న పవన్‌ కళ్యాణ్, ఏడాది గడిచినా దాని గురించి పట్టించుకోలేదు. ఆఖరుకి తన నియోజకవర్గం పిఠాపురంలో దళితులను సాంఘిక బహిష్కరణ చేసినా పవన్‌ కళ్యాణ్‌కి చీమకుట్టినట్టయినా అనిపించడం లేదు. బాధితులను పరామర్శించిన పాపాన పోలేదు. అదే నియోజకవర్గంలో ఒక బాలికపై టీడీపీ నాయకుడు అత్యాచారం చేసినా అతడిని స్వేచ్ఛగా వదిలేశారు. 

ఎమ్మెల్యేల మద్యం, ఇసుక, బూడిద దోపిడీ:
    ఎమ్మెల్యేలకు మద్యం షాపులు పావలా వాటా ఇవ్వాలి. ఒక్కో మద్యం షాపు నుంచి పోలీసులు నేరుగా రూ. 60 వేల లంచం వసూలు చేస్తున్నారు. గౌడ కులస్తులకు షాపులు ఇచ్చినట్లు చెప్పుకుని టీడీపీ నాయకులే దోచుకుంటున్నారు. ఫ్రీ శాండ్‌ పాలసీ అనేది పచ్చి అబద్ధం. రాష్ట్రంలో ఉచిత ఇసుక అనేది లేదు. ఇసుక రీచ్‌లన్నీ కూటమి నాయకుల కబంధ హస్తాల్లో ఉన్నాయి. ఆఖరుకి సిమెంట్‌ ఫ్యాక్టరీల్లో బూడిదను కూడా వదలకుండా కూటమి నాయకులు దోపిడీ చేస్తున్నారు. 
    తోట్లవల్లూరు రీచ్‌ నుంచి మైనింగ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, పామర్రు ఎమ్మెల్యే కలిసి రోజూకి రూ.5 లక్షలు ఇంటికి తీసుకెళ్తున్నారు. మైనింగ్‌ శాఖ మంత్రి లంకపల్లి రీచ్‌కి ఎవర్నీ టెండర్లు వేయనీయకుండా అందరితో విత్‌ డ్రా చేయించి గ్రీన్‌ ట్రిబ్యునల్‌ అడ్డుపడినా రాత్రుళ్లు ఇష్టారాజ్యంగా అక్రమంగా తరలిస్తున్నాడు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఎమ్మెల్యేలకు పావాలా వాటా ఇచ్చి ఆయన ముప్పావలా తీసుకుంటూ ఎంపీ పరిధిలోని ఏడు నియోజవర్గాల పరిధిలో అక్రమంగా ఇసుక మైనింగ్‌ చేస్తున్నాడో లేదో చెప్పాలి. ఎంపీ నాయకత్వంలో జగ్గయ్యపేట, నందిగామ నుంచి హైదరాబాద్‌కు ఇసుక తరలి పోతోంది. ఇదేనా ఉచిత ఇసుక పాలసీ?.
    ఇబ్రహీంపట్నం థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లో బూడిద కోసం ఎంపీ, ఎమ్మెల్యే తన్నుకుంటే లోకేష్‌ పిలిచి చెరో అర్థరూపాయి తీసుకోవాలని సయోధ్య చేసిన మాట వాస్తవమా కాదా? ఇదేనా పీపుల్స్‌ ఫ్రెండ్లీ పాలసీ? వైయస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి 80 లక్షల టన్నుల ఇసుక స్టాక్‌ చేసి పెడితే కూటమి ప్రభుత్వం వచ్చిన 15 రోజుల్లోనే 40 లక్షల టన్నులు కూటమి ఎమ్మెల్యేలంతా దోచుకున్నారు. 

విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు నిర్వీర్యం:
    కూటమి పాలనలో రైతుల పంటలకు కనీస గిట్టుబాటు ధర రావడం లేదు. రైతు దగ్గర కొన్న పంటకు 48 గంటల్లో డబ్బులు చెల్లిస్తామని చెప్పారు. కానీ వాస్తవం చూస్తే ధాన్యం అమ్మిన రైతులకు చెల్లించాల్సిన బకాయిలే సుమారు రూ.1000 కోట్లపైగా ఉన్నాయి. కోకో, మామిడి, పొగాకు, మిర్చి రైతులకు మార్కెట్‌ జోక్యం పథకం (ఎంఐఎస్‌) ద్వారా గిట్టుబాటు ధర కల్పించామని ఇంకో పచ్చి అబద్ధం చెప్పారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఈ అబద్ధాన్ని సహించరు.
    రాష్ట్రంలో ఎన్టీఆర్‌ ఆరోగ్యశ్రీ స్కీం అమలు కావడం లేదు. ఆస్పత్రులకు రూ.3,600 కోట్లు బకాయిలు పెట్టారు. చివరికి బసవ తారకం ఆస్పత్రిలో కూడా ఎన్టీఆర్‌ ఆరోగ్యశ్రీ స్కీం అమలు జరగడం లేదు. ప్రజా వైద్యాన్ని పూర్తిగా గాలికొదిలేశారు. ఫోన్‌ చేస్తే 108 అంబులెన్స్‌ సమయానికి రావడం లేదు. ఆస్పత్రుల్లో మందులు ఉండటం లేదు. వైయస్‌ జగన్‌ మొదలుపెట్టిన మెడికల్‌ కాలేజీల నిర్మాణాలను ఆపేశారు. మెడికల్‌ సీట్లు వద్దని భారతీయ వైద్య మండలి (ఎంసీఐ)కి లేఖ రాసిన ముఖ్యమంత్రిని చరిత్రలో ఎక్కడా చూడలేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించకపోవడంతో, కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులకు హాల్‌ టికెట్లు, టీసీలు ఇవ్వకుండా వేధిస్తున్నాయి.

డ్వాక్రా మహిళలకు బెదిరింపులు  :
    యోగాంధ్ర పేరుతో వేల మంది గిరిజన విద్యార్థులను తీసుకొచ్చి ఇరుకు, చీకటి గదుల్లో కుక్కేశారు. కడుపుకి కనీసం అన్నం పెట్టకుండా కటిక నేలమీద పడుకోబెట్టారు. బస్సుల్లో రప్పించారే కానీ, అవసరం తీరాక వారిని రోడ్డు మీదనే వదిలేసి పోయారు. రాష్ట్రంలో ఏ కార్యక్రమం జరిగినా డ్వాక్రా అక్కచెల్లెమ్మలను పిలిపించి వేధిస్తున్నారు. ప్రభుత్వమే ప్రైవేట్‌ కంపెనీలతో టైఅప్‌ అయ్యి డ్వాక్రా మహిళలను దోచుకుంటోంది. జెనీ అనే యాప్‌ క్రియేట్‌ చేసి డ్వాక్రా అక్కచెల్లెమ్మల అకౌంట్ల నుంచి నగదు మళ్లించి వారితో బలవంతంగా బ్యాగులు, సబ్సులు, పచ్చళ్లు కొనిపిస్తున్నారు. కొనకపోతే లోన్లు రావని బెదిరిస్తున్నారు. వారితో ఎవరు బలవంతంగా కొనిపిస్తున్నారు? 

పవన్‌ మాటలకు చేతలకు పొంతన ఉండదు:
    పవన్‌ కళ్యాణ్‌ చెప్పే మాటలకు చేసే పనులకు అస్సలు సంబంధం ఉండదు. ఆయన చిల్లర పనులు చేస్తూ అందరికీ నీతులు చెబుతుంటాడు. సినిమా డైలాగులు సినిమాలకే పరిమితం కావాలంటాడు. 2019–24 మధ్య ఆయన మాట్లాడిన మాటలేంటి? అధికారంలోకి వచ్చాక ఒక్కసారైనా బాధితుల పరామర్శకు వెళ్లారా? అనంతపురంలో 14 ఏళ్ల బాలిక మీద గ్యాంగ్‌ రేప్‌ చేస్తే ఈ పవన్‌ కళ్యాణ్‌ ఎందుకు వెళ్లలేదు. గిరిజన విద్యార్థిని చంపితే ఎందుకు వెళ్లలేదు. యలమంచలి జనసేన ఎమ్మెల్యే ఒక జర్నలిస్టును కిడ్నాప్‌ చేసినప్పుడు పవన్‌ కళ్యాణ్‌ బెత్తం ఎందుకు తీయలేదు? కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీ అనుచరులు ఒక మహిళను వస్తావా? అని అడిగితే ఈయన ఎందుకు చూస్తూ ఊరుకున్నట్టు? ఈయనేదో అన్నీ సరిగ్గా చేస్తున్నట్టు.. హోం మంత్రి పదవి నేను తీసుకుంటానంటాడు. అనిత హోం మంత్రి కాదు.. ఆమె జగన్‌ని తిట్టే శాఖకు మంత్రి. 
    చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు, ఆయన సభల్లో ఎవరైనా చనిపోతే ప్రమాదం అనాలట! వైయస్సార్సీపీ కార్యకర్తలు దాన్ని ప్రశ్నిస్తే శవాల మీద పేలాలు ఏరుకోవడం అంటారట! అని పేర్ని నాని చురకలంటించారు.

Back to Top