ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

నిరసన ర్యాలీల సక్సెస్‌పై వైయ‌స్ జగన్ హర్షం 

తాడేపల్లి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై సీఎం చంద్రబాబు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ వైయ‌స్ఆర్‌సీపీ  అధినేత, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, కక్షపూరిత వైఖరి, ప్రభుత్వ కొత్త మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ ‘వైయ‌స్ఆర్‌సీపీ ప్రజా ఉద్యమం’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వైయ‌స్ఆర్‌సీపీ నిరసనలు చేపట్టింది. నిరసన ర్యాలీల సక్సెస్‌పై వైయ‌స్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. 
‘‘మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణపై చంద్రబాబు తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అయింది. 175 నియోజకవర్గాలలోనూ భారీగా నిరసన ర్యాలీలు జరిగాయి. ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతకు ఇది నిదర్శనం. ప్రజారోగ్యం, వైద్య విద్య విషయంలో ఇతర పార్టీల ప్రతినిధులు కూడా కలిసి రావటం సంతోషకరం. ప్రజల సంక్షేమమే‌ ముఖ్యం అని వీరంతా అనుకోవటం మంచి పరిణామం. పోలీసులు ఈ ర్యాలీలను అడ్డుకునే ప్రయత్నం చేసినా ఎవరూ వెనక్కు తగ్గలేదు. కేసుల భయం కూడా లేకుండా ఎంతో ధైర్యంగా అందరూ తమ నిరసనను వ్యక్తం చేశారు.

ప్రజల గొంతును బలవంతంగా అణచివేయలేరని వీరంతా నిరూపించారు. చంద్రబాబూ.. ఈ బలమైన ప్రజాభిప్రాయాన్ని గౌరవించండి. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే మీ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోండి. ఇవ్వాల్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ నా కృతజ్ఞతలు’అని వైయ‌స్‌ జగన్‌ పేర్కొన్నారు.

Back to Top