రైల్వే కోడూరు: రైల్వే కోడూరులో నిన్న (గురువారం) పట్టపగలే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు వీణను రోడ్డు మీదే లాఠీలతో కొట్టడాన్ని చూసి మహిళాలోకం సిగ్గుతో తలదించుకుంటోందని వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు ఆక్షేపించారు. పోలీసులు కూడా తమ చేతుల్లో నుంచి లాఠీ లాక్కుని వీణను జంతువును కొట్టినట్టు కొడుకుంటే ప్రేక్షక పాత్ర పోషించారని తెలిపారు. కూటమి ప్రభుత్వం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. వెంటనే ఎమ్మెల్యే అనుచరుడు నాగేంద్రను అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని రైల్వే కోడూరులో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ప్రెస్‌మీట్‌లో కోరుముట్ల శ్రీనివాసులు ఇంకేమన్నారంటే..: రాష్ట్రంలో అరాచక పాలన: రైల్వే కోడూరు ఘటన దారుణం. జనసేన పార్టీ సిద్దాంతమే ఇలా ఉందా లేదా వ్యక్తుల సిద్దాంతం ఇలా ఉందా అర్దం కావట్లేదు. వీణ అనే ఎస్సీ సామాజిక వర్గ మహిళ గతంలో జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై చేసిన ఆరోపణల్ని మేం కూడా వ్యక్తిగత విషయంగా భావించి పట్టించుకోలేదు. ఎమ్మెల్యే వ్యవహారంపై నిరసన తెలిపి వదిలేశాం. కానీ నిన్న ప్రభుత్వ వాహనంలో వచ్చి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అనుచరుడు తాతంశెట్టి నాగేంద్ర పోలీసుల దగ్గర నుంచి లాఠీ లాక్కుని మహిళను జంతువును కొట్టినట్లు కొట్టడం ఎంతవరకు సబబు అనేది ప్రజలు ఆలోచించాలి. ఈ ఘటన భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావాలనుకునే యువతపైనా తీవ్ర ప్రభావం చూపేలా ఉంది. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా?: నిన్నటి ఘటన చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలో ఉందా, చట్టం అమల్లో ఉందా అనే అనుమానాలు రేకెత్తించింది. చట్టానికి కళ్లు లేవు, పోలీసులు నిమిత్తమాత్రులుగా ఉన్నారు, లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందనే విషయం అందరికీ అర్ధమైంది. పోలీసుల చేతుల్లో నుంచి లాఠీ లాక్కుని మరీ మహిళపై పట్టపగలే రోడ్డు మీద దాడి చేస్తుంటే అతనిపై చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం ప్రజలు అందరికీ సమాన హక్కులు ఉంటాయి. ఈ విషయం పోలీసులు, రాజకీయ నేతలు తెలుసుకోవాలి. నాగరిక సమాజంలో ఉన్నామా లేదా అనే అనుమానాల్ని రేకెత్తించిన ఈ ఘటన చాలా దురదష్టకరం. నిన్న ఘటనలో పోలీసుల ప్రేక్షకపాత్ర చూసి మహిళలు తమకు రక్షణ ఉందా లేదా అనే భయాందోళనలకు గురవుతున్నారు. మహిళలపై కూటమి ఎమ్మెల్యేల అఘాయిత్యాలు: పోలీసులకు మాత్రం రాజ్యాంగం లాఠీ వాడే హక్కు ఇచ్చింది. వారికి తప్ప ముఖ్యమంత్రికి సైతం ప్రజలపై లాఠీలు వాడేందుకు వీల్లేదు. ఈ ఘటనలో కూడా మాకు వీణ అనే మహిళ గురించి అనవసరం. ఆమె ఓ మహిళగా తనకు జరిగిన నష్టంపై పోరాటం చేస్తోంది. స్వయంగా నారావారిపల్లెలో చంద్రబాబును స్వయంగా కలిసి అడిగినా ఫలితం శూన్యం. ఇదేనా ప్రజాస్వామ్యం ? ఇదేనా కూటమి పరిపాలనా ? ఇదేనా మహిళలపై మీకున్న గౌరవం ? చెప్పేవి శ్రీరంగనీతులు, దూరేవి దొమ్మరి గుడిసెలు అన్నట్లుగా వీరి పరిస్ధితి తయారైంది. మొన్న సత్యవేడులో ఓ ఎమ్మెల్యే అరాచకం, గుంటూరులో మరో ఎమ్మెల్యే అరాచకం, ఆముదాలవలసలో మరో ఎమ్మెల్యే అరాచకం. మీ ఎమ్మెల్యేలు, మంత్రులపైనా నియంత్రణ లేకపోతే ఇక ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తారు ? తాజాగా ఎంపీ మహేష్ యాదవ్ డ్రగ్స్ కేసు. ఇలా చెప్పుకుంటూ పోతే పేజీలకు పేజీలు నిండిపోతాయి. ఎమ్మెల్యే అనుచరుడిపై చర్యలు తీసుకోవాల్సిందే: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తమ ఎమ్మెల్యేల అరాచకాలపై ఏమీ మాట్లాడరు. ఇతరులకు మాత్రం శ్లోకాలు చెప్తుంటారు. గతంలో మా ప్రభుత్వం ఉండగా 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని ఆరోపించారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోయినా కనీసం సుగాలి ప్రీతి కేసులో న్యాయం చేయలేకపోయారు. చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం పవన్‌కళ్యాణ్ ను వాడుకుంటారు, లోకేష్ జాకీలు పెట్టి లేపుతుంటారు. పవన్ కళ్యాణ్ మాటలు వింటున్నాం, కాబట్టి ఇప్పుడు ఆయన రైల్వేకోడూరు ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలి. మీ పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగిని, నాకు సాయం చేయాలని మహిళ కోరితే కూడా పట్టించుకోరా?. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా ఓ మహిళ వ్యధను పట్టించుకోకపోతే, భవిష్యత్తులో రాష్ట్రంలో ప్రతీ మహిళా దీనిపై స్పందించే పరిస్ధితి వస్తుంది. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిన్న మహిళపై జరిగిన దాడిపై వెంటనే కేసులు నమోదు చేయాలి. లేకపోతే ప్రజలు రోడ్డెక్కి పోలీసు స్టేషన్, అసెంబ్లీని ముట్టడించే పరిస్ధితి వస్తుందని కోరుముట్ల శ్రీనివాసులు హెచ్చరించారు.