అమరావతి: రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి అయిన రాష్ట్ర శాసన మండలి ఉప కార్యదర్శి పీవీ సుబ్బారెడ్డికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఏపీలో ఖాళీ కానున్న ఈ నాలుగు స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు మంగళవారం రిటర్నింగ్ అధికారి పీవీ సుబ్బారెడ్డి నోటిఫికేషన్‌ను జారీచేశారు. దీంతో మంగళవారం నుంచే నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది. తొలిరోజు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. ఇక రాజ్యసభ వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుగా వైయస్ఆర్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, జాతీయ బీసీ ఉద్యమ నేత ఆర్.కృష్ణయ్య, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి, బీద మస్తాన్‌రావులను సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంపిక చేశారు. వారు నలుగురూ బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఈనెల 31వ తేదీ మ.3 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. వీటిని జూన్ 1న ఉ.11 గంటలకు పరిశీలిస్తారు. జూన్ 3వ తేదీ మ.3 గంటల్లోగా నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. నలుగురు అభ్యర్థుల కంటే ఎక్కువమంది పోటీలో ఉంటే జూన్ 10న ఉ.9 గంటల నుంచి మ.4 గంటల వరకూ పోలింగ్ నిర్వహిస్తారు. నాలుగు స్థానాలూ ఏకగ్రీవం! ఇక శాసనసభలో వైయస్ఆర్ సీపీకి 150 మంది సభ్యుల బలం ఉంది. టీడీపీకి సాంకేతికంగా కేవలం 23 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. రాజ్యసభ సభ్యునిగా ఎన్నిక కావాలంటే సగటున 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. టీడీపీకి అంత బలంలేని నేపథ్యంలో.. రాజ్యసభ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ఎవరూ పోటీచేసే అవకాశంలేదు. దీంతో వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు ఏకగ్రీవం కానున్నారు.