టీడీపీకి షాక్.. కాకినాడ మేయర్ పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం

 మేయర్ పావనిపై అవిశ్వాస తీర్మానం

పావనికి ఒక్కరు కూడా చేయి ఎత్తని వైనం

తూర్పు గోదావ‌రి:  కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ లో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. మేయర్ పావనిపై టీడీపీ అసమ్మతి కార్పొరేటర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో, ఆమె పదవిని కోల్పోయారు. కాకినాడ మేయర్‌పై టీడీపీ అసమ్మతి కార్పొరేటర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాసంలో మేయర్‌ పావని, ఉపమేయర్‌-1 సత్తిబాబు ఓడిపోయారు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 33 మంది కార్పొరేటర్లు, ముగ్గురు ఎక్స్‌అఫీసియో సభ్యులతో కలిపి మొత్తం 36 ఓట్లు వచ్చాయి. కాకినాడ మున్సిపల్‌ కౌన్సిల్‌లో 44 మంది కార్పొరేటర్లు ఉండగా, మరో ముగ్గురు ఎక్స్‌ అఫిషియో సభ్యులున్నారు. అవిశ్వాస తీర్మానానికి కోరం 31 మంది ఉండాల్సి నేపథ్యంలో సమావేశానికి 43 మంది కార్పొరేటర్లు, 3 ఎక్స్‌అఫిషియో సభ్యులు హాజరయ్యారు.  మంత్రి కన్నబాబు, ఎంపీ వంగ గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు.  కోర్టు కేసు నేపథ్యంలో ఫలితాలను ప్రిసైడింగ్‌ అధికారి రిజర్వ్‌ చేశారు. కోర్టు తీర్పు తర్వాత ఫలితాలనుఅధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.   

కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కు 2017లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో టీడీపీకి 30, వైయ‌స్ఆర్‌ సీపీకి 8, బీజేపీకి 3 సీట్లు రాగా... ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు కూడా గెలుపొందారు.

 

Back to Top