నంద్యాల జిల్లా: స్థానిక వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో తిరుమల లడ్డూ వివాదంపై వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన టీడీపీ కూటమి తిరుమల శ్రీవారి ప్రసాదం అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరిస్తోందని ఆరోపించారు. లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు, పామాయిల్, కెమికల్స్ కలిశాయని చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత టీడీపీ కూటమిదేనని ఆయన స్పష్టం చేశారు. సీబీఐ–సిట్ దర్యాప్తులో భాగంగా నిర్వహించిన ల్యాబ్ పరీక్షల్లో జంతువుల కొవ్వు లేనిదిగా స్పష్టమైందని తెలిపారు. అయినప్పటికీ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం భక్తుల విశ్వాసాలను దెబ్బతీసే చర్యగా పేర్కొన్నారు. 2024లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల చుట్టూనే ఈ కేసు తిరుగుతోందని కాటసాని వివరించారు. 2024 జూన్ 12, 21, 25 మరియు జులై 4 తేదీల్లో టీటీడీకి వచ్చిన నెయ్యి ట్యాంకర్లను స్థానిక టీటీడీ ల్యాబ్‌లో పరీక్షించి పాస్ చేసిన తర్వాతే వినియోగించారని చెప్పారు. అయితే జులై 6, జులై 12 తేదీల్లో వచ్చిన నాలుగు ట్యాంకర్ల నెయ్యి నాణ్యత ప్రమాణాలు లేకపోవడంతో టీటీడీ గోడౌన్ నుంచి తిరస్కరించి సంబంధిత కంపెనీకి మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. సీబీఐ–సిట్ ఛార్జిషీట్ల ప్రకారం జులై 25, 2024న తిరస్కరించిన నాలుగు ట్యాంకర్లను శ్రీకాళహస్తి సమీపంలో రాఘవేంద్ర స్టోన్ క్రషర్ వద్ద దాచిపెట్టి, అనంతరం అవే ట్యాంకర్లను దొడ్డిదారిన మళ్లీ టీటీడీకి పంపినట్లు దర్యాప్తులో తేలిందని వెల్లడించారు. ఈ ఘటనలన్నీ చంద్రబాబు హయాంలోనే జరిగాయని, అందువల్ల కల్తీ ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత టీడీపీ నాయకులదేనని ఆయన ప్రశ్నించారు. తిరుమల లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతు కొవ్వు, గొడ్డు మాంసం కొవ్వు, పంది కొవ్వు లేదా ఫిష్ ఆయిల్ కలిసిందన్న ఆరోపణలను దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థలు అయిన ఎన్‌డీడీబీ, ఎన్‌డీఆర్‌ఐలు పూర్తిగా ఖండించాయని చెప్పారు. ఈ నివేదికలను సీబీఐ–సిట్ కూడా తన ఛార్జిషీటులో పొందుపరిచిందని గుర్తు చేశారు. అయినప్పటికీ తప్పుడు ప్రచారం కొనసాగించడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. ఎన్‌డీడీబీ నివేదికను వక్రీకరించి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని, ఆ నివేదికలో ఎక్కడా జంతు కొవ్వు ఉన్నట్లు నిర్ధారణ చేయలేదని పేర్కొన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు కూడా చంద్రబాబు తీరును తప్పుబట్టిన విషయాన్ని గుర్తుచేశారు. నెయ్యి టెండర్ల విషయంలో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఎలాంటి సడలింపులు ఇవ్వలేదని కాటసాని రామభూపాల్ రెడ్డి స్పష్టం చేశారు. నెయ్యి సరఫరా చేసే ప్రతి కంపెనీ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ గుర్తింపు పొందిన ల్యాబ్ సర్టిఫికేట్ తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని, ట్యాంకర్లు వచ్చిన తర్వాత టీటీడీ ల్యాబ్‌లో కూడా పరీక్షలు నిర్వహించే విధానం కొనసాగుతోందని తెలిపారు. తిరుమల శ్రీవారి ప్రసాదం వంటి విశ్వాసాలకు సంబంధించిన అంశాన్ని రాజకీయ లాభాల కోసం వాడుకోవడం దుర్మార్గమని, భక్తుల మనోభావాలను దెబ్బతీసే తప్పుడు ప్రచారాలను వెంటనే ఆపాలని కాటసాని రామభూపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ కార్పొరేటర్లు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.