చిరువ్యాపారులకు అండగా ‘జగనన్న తోడు’

నిరుపేదల ఉపాధికి ఊతమిస్తూ.. ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా అడుగులు

సీఎం వైయస్‌ జగన్‌పై ప్రజల్లో పరిపూర్ణ విశ్వాసం ఉంది

మున్సిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

తాడేపల్లి: అధిక వడ్డీలకు రుణాలు తీసుకొని, ఆ వడ్డీల భారం అధికమై తీసుకున్న రుణాలు చెల్లించలేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్న చిరు వ్యాపారులు, సాంప్రదాయ చేతివృత్తుల వారు, వీధి వ్యాపారులకు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘జగనన్న తోడు’ పథకం అండగా నిలుస్తోందని మున్సిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. నిరుపేదలైన చిరువ్యాపారులు, సాంప్రదాయ చేతివృత్తుల వారికి వడ్డీలేని రూ.10 వేల రుణాన్ని ప్రభుత్వం అందిస్తుందని, ఇప్పటి వరకు 15 లక్షల పైచిలుకు మంది లబ్ధిదారులకు రూ.2,400 కోట్లపైగా వడ్డీలేని రుణాలు అందించిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌దని అన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగనన్న తోడు పథకం అమలు కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్‌ పాల్గొని మాట్లాడారు. 

తన సుదీర్ఘ పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలను కళ్లారా చూసిన వైయస్‌ జగన్‌..  అధిక వడ్డీలకు అప్పులు చేసి వాటిని తీర్చలేక ఆత్మాభిమానాన్ని చంపుకొని బతకలేక, చివరకు ప్రాణాలు సైతం కోల్పోతున్న ఎందరో అభాగ్యులకు అండగా ఉంటానని, వారు గౌరవంగా తలెత్తుకొని జీవించడానికి తోడుంటానని పాదయాత్రలో మాట ఇచ్చారని, ఇచ్చిన మాటకు కట్టుబడి, చిరువ్యాపారుల కష్టాలు తీర్చేందుకు జగనన్న తోడు పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. క్రమం తప్పకుండా అర్హులందరికీ రూ.10 వేల వడ్డీలేని రుణాలను అందిస్తున్నారని చెప్పారు. రుణం తిరిగి చెల్లించినవారికి మళ్లీ రుణ సౌకర్యం కల్పిస్తున్నారన్నారు. ఇప్పటి వరకు 15 లక్షల పైచిలుకు లబ్ధిదారులకు రూ.2,400 కోట్లపైచిలుకు రుణాలు అందించడం జరిగిందన్నారు. దేశ చరిత్రలోనే అత్యధికంగా వడ్డీలేని రుణాలు అందిస్తున్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వమేనని మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. 

ప్రతి నిరుపేద ఉపాధికి ఊతమిస్తూ వారు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా  అడుగులు వేయించేందుకు జగనన్న ప్రభుత్వం ఎప్పుడూ తోడుగా ఉంటుందని రాష్ట్ర ప్రజలు పరిపూర్ణ విశ్వాసంతో ఉన్నారన్నారు. అందుకే ఎవరిన్ని మాయమాటలు చెప్పినా, అబద్ధాలతో మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నా.. ప్రజలు మాత్రం జగనన్నే వన్స్‌మోర్‌ అని అంటున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెప్పారు.  
 

Back to Top