న్యూఢిల్లీ: మొదటి బడ్జెట్ లోనే కూటమి ప్రభుత్వం ప్రజలకు చెవిలో పూలు పెట్టారని వైయస్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేస్తుంటే..ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలం వెళ్లదీస్తూ పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌పై వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. రాష్ట్రంలో యువతకు 20లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెల,నెల 3వేల రూపాయల నిరుద్యోగ భృతి కల్పిస్తామని చెప్పి ఎన్నికల్లో వాగ్దానం చేసి ఈ బడ్జెట్ లో దాని ఊసే ఎత్తలేదని వైవీ సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి ఈ బడ్జెట్ లో అసలు నిధులే కేటాయించలేదన్నారు. ప్రతి మహిళకు 1500 రూపాయలు ఇస్తామన్న హామీ ఈ బడ్జెట్లో ప్రస్తావనే లేదన్నారు. అమ్మకి వందనం కింద స్కూల్ కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15వేలు ఇస్తామన్న హామీని ఈ బడ్జెట్ లో తుంగలోకి తొక్కారని మండిపడ్డారు . రైతులకు త్వరలో కేంద్రం ఇస్తున్న 6 వేలతో కలిపి రూ. 20వేలు ఇస్తామని చెప్పారు కానీ దానిని ఎప్పుడు అమలు చేస్తారో అని ఈ బడ్జెట్లో చెప్పలేదని ఫైర్ అయ్యారు.