దేవినేని ఉమా ఎందుకు ఉలిక్కి పడుతున్నారు

ఎంపీ విజయసాయిరెడ్డి

 అమరావతి : పోలవరం కాంట్రాక్టర్లను వైదొలగమని చెబితే టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా ఎందుకు ఉలిక్కి పడుతున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు పనులన్నింటినీ బినామీ కాంట్రాక్టర్లకు అప్పగించి వేల కోట్ల రూపాయల కమిషన్లు దండుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఈ విషయాలన్నీ బయటపడి.. అడ్డంగా దొరికిన తర్వాత వారికి పులివెందులా పంచాయతీలా అనిపిస్తోందా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

ఇక అన్న క్యాంటీన్ల విషయంలో టీడీపీ ఎమ్మెల్సీ లోకేశ్‌ స్పందిస్తున్న తీరును విజయసాయిరెడ్డి విమర్శించారు. ‘అన్న క్యాంటీన్లను మీ హెరిటేజ్ సొమ్ముతో ఏమైనా నడిపారా లోకేశ్ బాబూ? మూసేశారని టీఎంసీల కొద్ది కన్నీరు కారుస్తున్నావు. మీ పథకాలన్నీ ప్రజల సంక్షేమానికి కాకుండా దోచుకునేందుకే మొదలు పెట్టారు. క్యాంటీన్ నిధులను పసుపు-కుంకుమ ప్రలోభాలకు మళ్లించి 43 కోట్ల బకాయి పెట్టారు’ అని గత ప్రభుత్వ తీరును ఎండగట్టారు.

ములాఖత్‌లో కలుద్దురు...!
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న టీడీపీ నేతలపై విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా మండిపడ్డారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు కుట్రలో చంద్రబాబుకు సహకరించిన యనుమల.. ఇప్పుడు గురివిందలా విలువల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. అర్ధరాత్రి ఆనాటి కేంద్ర మంత్రి చిదంబరం కాళ్లు పట్టుకుని వైఎస్‌ జగన్‌పై కేసులు పెట్టించింది మీ బాసే కదా అంటూ యనుమలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రేపు మీ నాయకుడు, ఆయన కొడుకు ఏ జైల్లో ఉంటారో? ములాఖత్‌లో కలుద్దురు. సిద్ధంగా ఉండండి’ అంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఎమ్మెల్సీ లోకేశ్‌లను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు.

తాజా ఫోటోలు

Back to Top