విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ వచ్చి తీరుతుంది

ఈనాడు, ఆంధ్రజ్యోతిలో రాసిన వార్తలన్నీ అవాస్తవం

అవాస్తవం అని తేలితే.. రామోజీ, రాధాకృష్ణ బహిరంగ క్షమాపణ చెబుతారా..?

కేంద్రంతో నిన్నటి సమావేశంలో రైల్వేజోన్‌ అంశమే ప్రస్తావనకు రాలేదు

వైయస్‌ఆర్‌ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి

తాడేపల్లి: విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ నూటికి నూరు శాతం వచ్చి తీరుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వంతో నిన్న జరిగిన చర్చలో రైల్వేజోన్‌ ప్రస్తావనే రాలేదని, వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వాన్ని భ్రష్టుపట్టించాలని, కుల ప్రాతిపదికన ముందుకెళ్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలను ప్రజలెవరూ నమ్మరని, ఈ రెండు పత్రికలు రాసే అవాస్తవాలను నమ్మొద్దని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేశారు. రైల్వేజోన్‌ వందశాతం వచ్చి తీరుతుందని, ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రచురించిన వార్తలు అవాస్తవం అని తేలితే.. రామోజీరావు, రాధాకృష్ణ బహిరంగంగా క్షమాపణ  చెబుతారా..? అని ప్రశ్నించారు. రైల్వేజోన్‌పై ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో రాసిన అభూత కల్పనలపై ఎంపీ విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 

‘‘కేంద్ర ప్రభుత్వంతో నిన్నటి సమావేశంలో కొవ్వూరు మీదుగా రాజధాని, తెలంగాణలోని ప్రాంతాలను కలుపుతూ హైదరాబాద్‌ను కనెక్ట్‌ చేసే రైల్వేలైన్‌పై చర్చ జరిగింది. దీనిపై రాష్ట్రానికి సంబంధించిన వాటా ఇవ్వాలని కేంద్రం ప్రతిపాదన.  కొవ్వూరు మీదుగా రైల్వేలైన్‌ రాజధాని, తెలంగాణలోని గ్రామాల మీదుగా హైదరాబాద్‌ను కనెక్ట్‌ చేయాలనే ప్రతిపాదనను పునర్విభజన చట్టంలోనే పొందుపరిచారు కాబట్టి.. మొత్తం కేంద్రమే భరించాలని మన వాదన. దీనికి సంబంధించి చర్చ వచ్చింది.

కానీ, రైల్వేజోన్‌కు సంబంధించిన అంశం చర్చకు రాలేదు. రైల్వేజోన్‌ తప్పకుండా వస్తుంది. వైయస్‌ఆర్‌ సీపీ రైల్వేజోన్‌ కోసం ఎన్నో పోరాటాలు చేసింది. తప్పకుండా నూటికి నూరు శాతం విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ వచ్చి తీరుతుంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రచురించిన వార్తలు అవాస్తవం అని తేలితే.. బహిరంగంగా రామోజీరావు, రాధాకృష్ణ క్షమాపణ చెబుతారా..? వయసులో పెద్దవారు, అనుభవజ్ఞలు ఆ ఇద్దరికీ ఒక్కటే సలహా ఇస్తున్నా.. ఇటువంటి అవాస్తవాలను ప్రచురించి మీ కులాభిమానాన్ని చూపించి మీ స్థాయిని దిగజార్చుకోవద్దు. రాధాకృష్ణ, రామోజీరావు కలగని వారికి వారు ఊహించుకొని ఏదేదో పేపర్లలో రాయొద్దు’’ అని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top