అమరావతి: రాజధానిపై జోక్యం చేసుకోమని కేంద్రం వెల్లడించినా.. ఎల్లో మీడియా మాత్రం కేంద్రం ఎలాగైనా అడ్డుకోవాలని కోరుకుంటుందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శించారు. ‘రాజధానిపై కేంద్ర జోక్యం చేసుకోదని పార్లమెంట్‌లో సంబంధిత మంత్రి వెల్లడించారు. అది రాష్ట్రాలకున్న ప్రత్యేక హక్కు. పచ్చ మీడియా మాత్రం కేంద్రం ఎలాగైనా అడ్డుకోవాలని కోరుకుంటుంది. దీనిపై వివరణ ఇచ్చిన బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్‌పై దుష్ప్రచారానికి ఒడిగట్టడం దారుణం’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. అదేవిధంగా ‘ఏబీ వెంకటేశ్వరరావు యూనిఫామ్ లోపల పచ్చచొక్కా తొడుక్కున్న టీడీపీ కార్యకర్త. బాబు, లోకేశ్ తర్వాత ప్రభుత్వంలో ఐదేళ్లూ ఈయనే చక్రం తిప్పారు. అక్రమ పద్ధతిలో ఆస్తులు పోగేసుకున్నాడు. ఇండియన్ పోలీస్ సర్వీసుకే కళంకం తెచ్చిన ఇలాంటి వారు ఆలస్యంగానైనా శిక్ష అనుభవించక తప్పదు’ అని విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు.