చంద్ర‌బాబుది ఉద్య‌మం కాదు..ఉన్మాదం

 బాబుకు పేదల గురించి మాట్లాడే హక్కే లేదు

53వేల మంది దళితులకు వైయ‌స్ జ‌గ‌న్ ఇళ్ల పట్టాలు ఇస్తుంటే చంద్రబాబు అడ్డు 

వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ నందిగం సురేష్

తాడేపల్లి: అమ‌రావ‌తి పేరుతో చంద్ర‌బాబు చేస్తున్న‌ది ఉద్య‌మం కాద‌ని, ఉన్మాద‌మ‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ నందిగాం సురేష్ విమ‌ర్శించారు. ఉద్యమం ఎందుకు? ఎవరికోసం చేశారో బాబుతో సహా అందరికీ తెలుసన్నారు. టీడీపీ ఐదేళ్ల పాల‌న‌లో అమరావతి ఎక్కడ అభివృద్ధి జరిగిందో చెప్పాలని నిల‌దీశారు. దళితుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని మండిప‌డ్డారు.  తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో సోమవారం నందిగాం  సురేష్  మీడియాతో మాట్లాడారు.

చంద్ర‌బాబు హ‌యాంలో అమ‌రావ‌తి ఎక్క‌డ అభివృద్ధి జ‌రిగిందో చెప్పాల‌ని నందిగాం సురేష్ ప్ర‌శ్నించారు. రాజకీయాల కోసమే చంద్రబాబు దళితులను అడ్డుపెట్టుకుంటారని దుయ్యబట్టారు.  బినామీ ఆస్తులు ర‌క్షించుకోవ‌డానికే చంద్ర‌బాబు ఉద్య‌మం చేస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. నిన్న‌టి ధ‌ర్నాలో చంద్ర‌బాబు మాట్లాడిన భాష ఆయ‌న ఉన్మాదానికి నిద‌ర్శ‌న‌మన్నారు. ధ‌ర్నాలు, దీక్షలప్పుడే ఆయ‌న వ‌ద్ద జనాలు ఉంటారని విమర్శించారు. రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందన్నట్టుగా చంద్రబాబు డ్రామా చేస్తున్నారని, సీఎం వైయ‌స్ జ‌గ‌న్ 53వేల మంది దళితులకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే చంద్రబాబు అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. క‌ర‌క‌ట్ట రోడ్డును విస్త‌రిస్తుంటే అడ్డుకుంటున్న‌ది ఎవ‌రో అంద‌రికీ తెలుసు అన్నారు.

 అమరావతి ప్రాంతం మురికివాడగా మారుతుందని బాబు ఆరోపించారని, దళితుల పట్ల చంద్రబాబుకు ఉన్న ప్రేమ దీనిబట్టే అర్ధం అవుతుందని విరుచుకుపడ్డారు. ద‌ళిత ఎంపీ, ఎమ్మెల్యేల‌పై రాజ‌ధాని ప్రాంతంలో దాడి జ‌రిగితే చంద్ర‌బాబు ఒక్క మాటైనా అన్నారా అని ప్ర‌శ్నించారు.  దళితులు ఇంగ్లీష్ మీడియం చదువుకోకూడదా.. సొంతింట్లో ఉండకూడదా అని సూటిగా ప్రశ్నించారు. బషీర్‌బాగ్‌లో రైతులపై కాల్పులు జరిపిన చరిత్ర చంద్రబాబుదని, బాబుకు పేదల గురించి మాట్లాడే హక్కే లేదని ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు.

Back to Top