విశాఖపట్నం: జిల్లాలో నూతనంగా నిర్మించనున్న వైయస్ఆర్‌సీపీ కార్యాలయానికి విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ రూ.కోటి విరాళం ప్రకటించారు. వైయస్ఆర్‌సీపీ కార్యాలయ భవన నిర్మాణానికి ప్రభుత్వం మధురవాడ లా కాలేజీ రోడ్డులోని పనోరమ హిల్స్ పక్కన రెండెకరాల స్థలాన్ని కేటాయిస్తూ మంగళవారం జీవో విడుదల చేయడం తెలిసిందే. ఈ జీవో కాపీని మద్దిలపాలెంలోని పార్టీ నగర కార్యాలయంలో ఉమ్మడి విశాఖ వైయస్ఆర్‌సీపీ రీజినల్ కోర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డికి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఎంవీవీ మాట్లాడుతూ.. విశాఖ కార్యనిర్వాహక రాజధాని కానున్న నేపథ్యంలో పార్టీ జిల్లా కార్యాలయాన్ని అత్యాధునిక డిజైన్లతో నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు.