సీఎం చొరవతో బీసీలకు జాతీయస్థాయిలో గుర్తింపు

అంబేడ్కర్, పూలే ఆశయాలకు అనుగుణంగా సీఎం వైయస్‌ జగన్‌ పాలన

రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ

విజయవాడ: బలహీనవర్గాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ అన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ పాలన నూతన రాజకీయ శకానికి నాంది పలుకుతుందని, బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రాజకీయ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో అరుదైన ఘట్టానికి శ్రీకారం చుట్టారన్నారు. పాదయాత్రలో తనకు ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ.. మరోవైపు అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నారని చెప్పారు. బీసీ సంక్రాంతి సభలో ఎంపీ మోపిదేవి వెంకట రమణ పాల్గొని మాట్లాడారు.

రాష్ట్రంలో సగం జనాభాకు పైగా ఉన్న బీసీలు.. మొన్నటి వరకు రాజకీయ పార్టీలకు ఓటు బ్యాంకుగానే పరిమితం అయ్యారని, నేడు ఆంధ్రరాష్ట్ర రాజకీయాలకు వెన్నెముక బీసీలకు గుర్తింపు తీసుకువచ్చిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌దన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్, బీసీల ఆశాజ్యోతి జ్యోతిరావుపూలే ఆశయాలకు అనుగుణంగా పరిపాలన చేస్తున్నారన్నారు. బీసీలకు గౌరవప్రదమైన జీవన విధానం కల్పించారన్నారు. చిన్న చిన్న కులాలకు కూడా రాష్ట్రస్థాయిలో కార్పొరేషన్‌ చైర్మన్లు, డైరెక్టర్‌ హోదాలను సీఎం కల్పించారన్నారు. ప్రాంతీయ పార్టీలు రాజ్యసభ సీట్లను బడా వ్యాపారులకు కట్టబెట్టేవని, ఆ సంస్కృతికి భిన్నంగా సీఎం వ్యవహరించారన్నారు. ఇద్దరు బీసీలను రాజ్యసభకు పంపించారన్నారు. కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమించబడిన వారు ఆ కులాల అభివృద్ధికి పాటుపడాలని, అప్పుడే సీఎం కన్న కలలను సాకారం చేసిన వారమవుతామన్నారు. 
 

Back to Top