ఎన్డీఏతో ఎందుకు కలుస్తున్నాడో చంద్రబాబుకే తెలియాలి

చంద్రబాబు ఢిల్లీ టూర్‌పై ఎంపీ కేశినేని నాని హాట్ కామెంట్స్
 

ఎన్టీఆర్‌ జిల్లా: చంద్రబాబు ఢిల్లీ టూర్‌పై ఎంపీ కేశినేని నాని హాట్ కామెంట్స్ చేశారు. 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు, లోకేష్ భారీ అవినీతికి పాల్పడ్డారన్న కేశినేని.. 2019లో మోదీ అధికారంలోకి రారని చంద్రబాబు అనుకున్నాడని, కాంగ్రెస్ కూటమిని కలుపుకుని ప్రధానమంత్రి అయిపోవచ్చని బాబు దురాశకు పోయాడంటూ వ్యాఖ్యానించారు. 
‘‘అప్పట్లో నాతో మోదీపై అవిశ్వాస తీర్మానం పెట్టించాడు. మోదీని వ్యక్తిగతంగా నానా తిట్లు తిట్టాడు. 2019లో వైయ‌స్‌ జగన్‌ దెబ్బకు బొక్కబోర్లా పడ్డాడు. ఓడిపోయిన మరుక్షణం నుంచే చంద్రబాబుకు భయం పట్టుకుంది. కేంద్రం నుంచి కేసుల్లో ఇరికిస్తారనే భయంతో మోదీ, అమిత్ షాను కలిసేందుకు విశ్వప్రయత్నాలు చేశాడు. ఎన్డీఏ నుంచి ఎందుకు బయటికి వచ్చాడో. తిరిగి ఎన్డీఏతో ఎందుకు కలుస్తున్నాడో చంద్రబాబుకే తెలియాలి’’ అంటూ కేశినేని చురకలు అంటించారు.

అప్పటికీ ఇప్పటికీ పరిస్థితుల్లో ఏం మార్పులొచ్చాయి?. ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇచ్చారా?. రైల్వే జోన్ ఇస్తానని హామీ ఇచ్చారా?. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామని హామీ ఇచ్చారా? అభివృద్ధికి డబ్బులిస్తామని చెప్పారా? చంద్రబాబు వద్ద చాలా ప్రశ్నలకు సమాధానం లేదు?.తాను, తన కొడుకు జైలుకు వెళ్లాల్సి వస్తుందనే చంద్రబాబు భయం. టీడీపీ పార్టీని మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టాడు. టీడీపీ పార్టీ పెట్టిన తర్వాత తొలిసారి రాజ్యసభలో ఖాళీ అయ్యింది. తెలంగాణలో టీడీపీ ఖాళీ అయ్యింది. 2024 ఎన్నికల తర్వాత టీడీపీ మూతపడుతుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం కలే. ఎన్నికలయ్యాక తన సొంత రాష్ట్రం తెలంగాణకు వెళ్లిపోతాడు’’ అంటూ కేశినేని నాని సెటైర్లు వేశారు.

Back to Top