న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల అకాల వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి ఏం చర్యలు తీసుకున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని మంగళవారం లోక్‌సభలో వైయస్ఆర్‌సీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి ప్రశ్నించారు. కరవు, వరదలతో రైతులు సంక్షోభంలో ఉన్నారని, మద్దతు ధరల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. అన్ని సీజన్ల పంటలకు మద్దతు ధర ప్రకటించాలని కోరారు. కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి కైలాష్‌చౌదరి బదులిస్తూ.. ఏపీ రైతుల్ని ఆదుకోవడానికి 2021–22లో ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ కింద రూ.1,119 కోట్లు అందుబాటులో ఉంచామని తెలిపారు. ఉపాధి పనిదినాలు పెంచాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఉపాధి పనిదినాలు పెంచాలని వైయస్ఆర్‌సీపీ ఎంపీ వంగా గీత జీరో అవర్‌లో కేంద్రాన్ని కోరారు. 2021–22లో 2,350 లక్షల పనిదినాలకు అనుమతించారని తెలిపారు. ఎస్సీ కాంపొనెంట్ కింద రూ.39,944.99 లక్షలు, ఎస్టీ కాంపొనెంట్ కింద రూ.20,430.66 లక్షలు, ఇతరుల కింద రూ.59,151.30 లక్షల వేతనాలతోపాటు మెటీరియల్ కాంపొనెంట్ కింద రూ.3,54,248.32 లక్షలు ఇచ్చారన్నారు. పాలన కాంపొనెంట్ కింద రూ.24,775 లక్షలు అనుమతించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించిన మేరకు మొత్తం రూ.4,97,650 లక్షలు విడుదల చేయాలని కోరారు. లిథియం బ్యాటరీ ఉత్పత్తుల యూనిట్ ఏర్పాటు ప్రతిపాదన లేదు ఆంధ్రప్రదేశ్ సహా ఎక్కడా లిథియం బ్యాటరీ ఉత్పత్తుల యూనిట్ ఏర్పాటు ప్రతిపాదన లేదని కేంద్ర భారీపరిశ్రమల శాఖ సహాయమంత్రి క్రిషన్‌పాల్ గుర్జర్ తెలిపారు. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్‌సెంటివ్ (పీఎల్‌ఐ) పథకం ద్వారా దేశంలో అడ్వాన్స్ కెమిస్ట్రీ సెల్ (ఏసీసీ) ఏర్పాటుకు ఈ ఏడాది మేలో అనుమతి ఇచ్చినట్లు వైయస్ఆర్‌సీపీ సభ్యులు కోటగిరి శ్రీధర్, పి.వి.మిథున్‌రెడ్డి, పోచ బ్రహ్మానందరెడ్డిల ప్రశ్నకు జవాబుగా చెప్పారు. వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పిస్తున్నాం కరోనా వ్యాక్సినేషన్‌పై వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని వైయస్ఆర్‌సీపీ సభ్యుడు ఆదాల ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నకు సమాధానంగా కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. మత్స్య అభివృద్ధికి రూ.104.79 కోట్లు విడుదల ఆంధ్రప్రదేశ్‌లో మత్స్య అభివృద్ధికి రూ.104.79 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాలా తెలిపారు. 2020–21, 2021–22 ఆర్థిక సంవత్సరాలకు ఏపీలో మత్స్య అభివృద్ధికి రూ.655.38 కోట్లు కేటాయించినట్లు వైయస్ఆర్‌సీపీ సభ్యులు ఎం.వి.వి.సత్యనారాయణ, గొడ్డేటి మాధవి, బెల్లాన చంద్రశేఖర్ అడిగిన ప్రశ్నకు జవాబుగా చెప్పారు.